Chota News: బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి మహా కూటమి ఏర్పాటు విషయంలో తనకు ఎలాంటి అహం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రజలు వర్సెస్ బీజేపీగా ఉంటాయన్నారు. కోల్‌కతాకు వచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో మమత సమావేశం అయ్యారు.
రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడాల్సిందేనంటూ మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ రాయలసీమ లేదంటే.. రాయల తెలంగాణ ఏర్పాటు చేసినా ఇబ్బంది ఉండదన్నారు. వేసవి తర్వాత రాయలసీమ మేధావులు, ప్రజలతో చర్చించి కార్యాచరణ చేపడుతామని తెలిపారు.
తిరుపతి జిల్లా గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పలువురు అర్జీదారులు పోలీసులపైనే ఫిర్యాదు చేశారు. కోట ఎస్సై పుల్లారావు, టూటౌన్ సీఐ వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీతో మొరపెట్టుకున్నారు. స్పందన కార్యక్రమం ద్వారా పోలీసుల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముందు అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, హెల్పర్స్ ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నెలలుగా నిలిచిపోయిన రేషన్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రేషన్ లేక పిల్లలకు న్యూట్రిషన్ ఆహారం అందటం లేదని చెప్పారు. సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళకారుడు హరిప్రసాద్ మరోసారి అద్భుతాన్ని సృష్టించాడు. సచిన్ టెండుల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ దంపతుల ఫొటోను మగ్గంపై నేశాడు. దాన్ని సచిన్ మిత్రుడు చాముండేశ్వరినాథ్‌కు బహూకరించాడు. చాముండేశ్వరినాథ్ దాన్ని సచిన్‌కు అందజేస్తానన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో మరో చిట్ ఫండ్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అక్షర చిట్ ఫండ్ సంస్థ మూడు కోట్లకు టోకరా వేసింది. 120 మంది పైగా బాధితులు నష్టపోయారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి రైతులే తాళం వేశారు. ధాన్యం డబ్బులు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు.. సిబ్బందిని బయటకు పంపి భరోసా కేంద్రానికి తాళం వేశారు. రైతులకు ఉపయోగపడని భరోసా కేంద్రాలు ఎందుకని నిలదీశారు.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి చెక్‌పోస్ట్ వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీలో 250 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని, అవి తెలంగాణకు చెందిన బియ్యం మాదిరిగానే ఉన్నాయని అధికారులు తెలిపారు. బీహార్ నుంచి మేడిపల్లికి తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల ఐకేపీ సెంటర్‌లో తడిచిన ధాన్యాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు. ఇక్కడ ధాన్యం పోసి వారం రోజులైనా కొనుగోళ్లు ఇంకా మొదలు కాలేదని ఈటలతో రైతులు వాపోయారు. పండిన ధాన్యం అంతా తడిచి పాడయ్యిందని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. సీబీఐ కోర్టు భాస్కర్‌రెడ్డి జ్యూడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 29 వరకు పొడిగించగా.. ఉదయ్‌కుమర్ రెడ్డి రిమాండ్‌ను 26 వరకు పొడిగించింది. సీబీఐ అధికారులు వాళ్లిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.
గిరిజన మహిళనైన తనపై కొంతమంది కార్పొరేటర్లు దాడికి పాల్పడ్డారంటూ నెల్లూరు మేయర్ స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన రౌడీ కార్పొరేటర్లను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం నుంచి దర్గామిట్ట పోలీస్ స్టేషన్ మేయర్ కాలినడకన రావడంతో ఉద్రిక్తత నెలకొంది.
బాబాయిని చంపిన అబ్బాయి అంటూ బొజ్జల సుధీర్‌రెడ్డిపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బొజ్జల హరినాథ్‌రెడ్డి మరణంపై అనుమానాలున్నాయని.. సుధీర్‌రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. సుధీర్‌రెడ్డిపై కేసు వేస్తున్నానని మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి భూకబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. నిరంజన్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని… హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. తాటికొండ రాజయ్య, ఈటలపై చర్యలు తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. నిరంజన్‌రెడ్డిని ఎందుకు వెనుకేసుకొస్తోందని ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భీకర వర్షం కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొడిమ్యాల, గంగాధర మండలాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వర్షం ధాటికి రహదారులు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టీడీపీ హయాంలో ప్రారంభించిన రాయదుర్గం బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు నాలుగేళ్లయినా పూర్తి కాలేదని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. తన 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్‌లో భాగంగా బాలికల జూనియర్ కళాశాలపై రెండో వీడియోను విడుదల చేశారు. కళాశాల పనులను వైసీపీ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించే అధికారం అమిత్ షాకు ఎక్కడిదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ముస్లింలు ఈ దేశ పౌరులు కారా అని నిలదీశారు. రిజర్వేషన్లు మత ప్రాదిపదికన కాదని.. సామాజిక వెనకబాటు తనంపై కల్పించారనే విషయాన్ని గుర్తించాలని హితవుపలికారు.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అక్రమంగా ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ప్రవీణ్ ప్రకాష్ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. అక్రమంగా సస్పెండ్ చేసిన నాలుగురు అధికారులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసేందుకు కొంత మంది కుట్రలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనసైనికులు ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయవద్దని సూచించారు.
అమిత్‌షా కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు. కర్నాటకలో ఓటమి తప్పదన్న ఫ్రస్టేషన్‌లో అమిత్‌షా మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు.
హైదరాబాద్ బోరబండ బంజారా నగర్‌లో దారుణం జరిగింది. ప్రేమించలేదంటూ ఓ యువకుడు… యువతి గొంతు కోశాడు. తీవ్ర గాయాల పాలైన యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.