Formula E Race Scam: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? అప్పటి ప్రభుత్వంలో అన్నీ తానై చెలాయించిన అధికారులు బుక్కయినట్టేనా? రేపో మాపో అధికారులకు ఏసీబీ నోటీసులు ఇవ్వనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ దర్యాప్తుపై దృష్టి సారించింది. ఇటీవల మున్సిపల్ శాఖ అధికారులు ఏసీబీకి లేఖ రాయడంతో దర్యాప్తుకు ప్రభుత్వం ఓకే చేసింది. దీంతో రంగంలోకి దిగేసింది ఏసీబీ. దీనికి సంబంధించి ఫైళ్లను అధికారుల నుంచి తీసుకున్నారు.
గతంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్‌కు నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతోంది ఏసీబీ. ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేలా అరవింద్ కుమార్ విచారించేందుకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది ఏసీబీ.
రేస్ నిర్వహణకు సంబంధించి నిధులు విడుదల చేశారు అప్పటి అధికారి అరవింద్ కుమార్. ఎవరి ఆదేశాల మేరకు ఆయా నిధులు విడుదల చేశారని దానిపై విచారించనుంది ఏసీబీ. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మిగతావారికి నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది.
ALSO READ: హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ.. కులగణనపై చర్చ, ఆపై
గత సంవత్సరం ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు విదేశీ కంపెనీలకు నిబంధనలకు తలొగ్గి 55 కోట్లు చెల్లించారంటూ మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది.
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం గత పాలకుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు గాలి కొదిలేశారు అధికారులు. విదేశీ కంపెనీలకు అప్పటి ప్రభుత్వ అధికారులు 55 కోట్ల రూపాయలు అందజేశారు.
విదేశీ కంపెనీలకు నిధులు అందజేసేటప్పుడు అధికారులు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అవేమీ పట్టించుకోలేదు. హెచ్ఎండీఏ బోర్డుతోపాటు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
నిధుల వ్యవహారం వెనుక అప్పటి పెద్దలు ఉన్నారని బలంగా నమ్ముతున్నారు అధికారులు. అప్పట్లో మున్సిపల్ శాఖకు కేటీఆర్ మంత్రిగా వ్యవహరించారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నోరు విప్పితే, కేటీఆర్‌కు చిక్కులు తప్పవని అంటున్నారు. ఈ గండం నుంచి కేటీఆర్ ఎలా బయటపడతారో చూడాలి.