EPAPER

Abhinava Molla : తెలంగాణ మొల్ల.. లక్ష్మీ నరసమ్మ..

Abhinava Molla : తెలంగాణ మొల్ల.. లక్ష్మీ నరసమ్మ..

Abhinava Molla : తెలంగాణ తొలి తరపు కవయిత్రులలో చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మది విశిష్ట స్థానం. చిన్న చిన్న కవితలతో రచనా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈమె.. అనేక పద్య, గద్యాలను రచించి, తెలంగాణ సాహితీ మాగాణాన్ని సస్యశ్యామలం చేశారు. తన రచనలతో సాహితీ ప్రియులను ఉర్రూతలూగించిన ఈ విదుషీమణి.. 80వ దశకంలో ‘తెలంగాణ మొల్ల’ అనిపించుకున్నారు.


చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ 1939 జనవరి 3న భద్రాచలంలో జన్మించారు. వీరి తండ్రి పొడిచేటి వీరరాఘవాచార్యులు భద్రాచల ఆలయ ప్రధాన అర్చకుడిగా 60 ఏళ్లు సేవలందించారు. దీంతో బాల్యం నుంచే ఈమెకు భక్తి, ఆధ్యాత్మిక రచనలు పరిచయమయ్యాయి. తన ఏడేండ్ల వయస్సులోనే గాంధీజీ మరణవార్త విని ‘భారత జనకుడు ఇక లేడు.. గాంధీతాత ఇకలేడు’ అంటూ కవితను రచించారు.

పెద్దలు ఈమెలోని రచయిత్రిని గుర్తించి, ప్రోత్సహించటంతో కాలక్రమంలో తరవాత ‘విధి బలీయం’, ‘పంట కల్లం’, ‘ఒయాసిస్సులు’ అనే కథలు కూడా రాశారు. నాటి సంప్రదాయాలను గౌరవిస్తూనే.. మెట్రిక్ వరకు చదివి పాస్ అయిన తర్వాత సెకండ్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ పూర్తిచేసి, భద్రాచలం ప్రభుత్వ హైస్కూలులో టీచరుగా చేరారు. తెలుగు టీచరుగా ఉంటూనే ఎంఎ పూర్తిచేశారు.


తనదైన ఆధ్యాత్మిక భావనలతో 1964లో ఈమె రాసిన ‘భద్రగిరి’ అనే నవలకు మహాకవి దాశరథి ముందుమాట రాశారు. గోల్కొండ, కృష్ణా పత్రిక, ప్రజామాత, మన దేశం, తెలుగు తేజం వంటి నాటి పత్రికలతో బాటు తర్వాతి కాలపు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పలు పద్యాలు, కవితలు రాశారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కోసం అనేక రూపకాలు, పద్యాలు రాయడంతో పాటు అనేక అవధానాల్లో పాల్గొని పండిత ప్రశంసలు అందుకున్నారు.

వీరి సాహితీ సేద్యాన్ని గుర్తించి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈమెకు ‘అభినవమొల్ల’ బిరుదు ప్రకటించగా, దానిని మరో మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి బలపరిచారు. తన జీవితకాలంలో మొత్తం 22 పద్య, గద్య కావ్యాలు అందించారు. డాక్టర్‌ ఎన్‌. గోపి ప్రేరణతో నానీలు రచించి ‘భద్రగిరినానీలు’ పేరున ప్రచురించారు.

1981లో ఆమె రాసిన ‘రామదాసు’ పద్య కావ్యం బహుళ ప్రజాదరణ పొందింది. బుద్ధుని గాథల ఆధారంగా ‘శాంతి బిక్ష’ అనే ఖండకావ్యం, ‘శ్రీపదం’ అనే ద్రవిడ ప్రబంధాల అనువాద పద్య కావ్యం, అక్షర తర్పణం, నీరాజనం, మాతృభూమి, దివ్య గీతాంజలి మొదలైన కావ్యాలను రాశారు. ఈమె రాసిన భద్రాచల క్షేత్ర చరిత్ర, తానిషా, శ్రవ్య నాటకాలు ఆకాశవాణి శ్రోతలను అలరించి చారిత్రక విజ్ఞానాన్ని పంచాయి.

వందలాది సమస్యపూరణాలు, పలు సుప్రభాతాలు, శతకాలు, సైతం రాసిన ఈమె సాహిత్యంపై మధురై కామరాజ్‌, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం. ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ వీరు సన్మానించబడ్డారు. వీరి ‘ఆడపిల్ల’ కవితను వెన్నెల-3 అనే తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు. శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యదను నవలగా రచించారు. దీనిపై కాకతీయ యూని వర్సిటీలో ఎం.ఫిల్‌ కూడా వచ్చింది.

1998లో యునెస్కో సాహితీ స్వర్ణమహిళ, యునెస్కో లిటరసీ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం, 2018లో తెలంగాణ ప్రభుత్వపు ‘విశిష్ట మహిళా పురస్కారం’ అందుకున్నారు. సంప్రదాయ కవిత్వంలోనూ ఆధునిక, సంస్కరణ వాదాన్ని ప్రవేశపెట్టిన ఈ తెలంగాణ ముద్దుబిడ్డ చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ 84 ఏళ్ల వయసులో 2023 డిసెంబర్‌ 7న భద్రాచలంలో తుదిశ్వాస విడిచారు.

Related News

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Bigg Boss: హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న అభయ్.. 3 వారాలకు పారితోషకం ఎంతంటే..?

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Big Stories

×