100 days for Hydra: తెలంగాణలో హైడ్రా ఏర్పడి వంద రోజులు పూర్తి చేసింది. హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? ప్రభుత్వ భూములను కాపాడడమే తదుపరి లక్ష్యమా? చెట్ల సంరక్షణపై ఫోకస్ చేసిందా? అవుననే అంటున్నారు హైడ్రా అధికారులు.
తెలంగాణ హైడ్రా ఏర్పాటు చేసి శనివారానికి వంద రోజులు కంప్లీట్ అయ్యింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరుతో వచ్చిన ఈ వ్యవస్థను చూసి కబ్జాదారులు హడలిపోయారు. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో ఒకానొక దశలో వారంతా బెంబేలెత్తి పోయారు.
తమ ఇళ్లు కూల్చకుండా ప్రయత్నాలు చేసి చేతులెత్తేశారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువుల కబ్జాలు భారీగా నిర్మిస్తున్న భవనాలపై ఫోకస్ చేసింది హైడ్రా. జూలై 19న GO 99 తో హైడ్రా ఏర్పాటైంది. అదేనెల 26 నుంచే తన పని మొదలుపెట్టింది. ఈ క్రమంలో హైడ్రాపై న్యాయస్థానాలను ఆశ్రయించినవారు లేకపోలేదు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. 120 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో విలీనం చేయడంతో హైడ్రా మరింత దూకుడు ప్రదర్శించింది.
ALSO READ: జీవన్‌రెడ్డితో మధుయాష్కీ భేటీ, కూల్ అయినట్టేనా?
నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో దేశవ్యాప్తంగా హైడ్రా పేరు మార్మోగింది. హైడ్రాతో కొందరి రాజకీయ నేతలకు ముచ్చెమటలు పట్టాయి. హైడ్రాకు జీవో 191 జోడించడంతో మరిన్ని అధికారాలు తోడయ్యాయి.
ఈసారి నగరంలో వరద ముంపునకు పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణ, చెట్ల సంరక్షణపై ఫోకస్ చేసింది. ఇప్పటికే ఆయా విభాగాలతో సమావేశాలు, రివ్యూలు నిర్వహించింది. వర్షాల సమయంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలపై దృష్టి సారించింది. ఓ వైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే మరోవైపు సిటీలో చెరువుల సుందరీకరణను మొదలు పెట్టేసింది. దీనికి ఆరునెలలు టార్గెట్‌గా పెట్టుకుంది.