EPAPER

BRS Defeat reasons | బీఆర్ఎస్ ఓటమికి పది కారణాలు!

BRS Defeat reasons | అంతా ఊహించినట్లే బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. వరుసగా రెండేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ.. మూడోసారి మ్యాండేట్ కోరుకుంది. అయితే ఈ పదేళ్లలో చేసిన చాలా తప్పులు ఆ పార్టీని మూడోసారి అధికారానికి దూరంగా ఉంచాయని చెప్పొచ్చు.

BRS Defeat reasons | బీఆర్ఎస్ ఓటమికి పది కారణాలు!

BRS Defeat reasons | అంతా ఊహించినట్లే బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. వరుసగా రెండేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ.. మూడోసారి మ్యాండేట్ కోరుకుంది. అయితే ఈ పదేళ్లలో చేసిన చాలా తప్పులు ఆ పార్టీని మూడోసారి అధికారానికి దూరంగా ఉంచాయని చెప్పొచ్చు.


అహంకార వైఖరి

ముఖ్యంగా కేసీఆర్ వైఖరే ఆయనకు, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టిందంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ నియంత మాదిరి తయారయ్యారని ప్రత్యర్థి పార్టీలు విమర్శించని రోజంటూ లేదు. ఇదే గులాబీదళం కొంప ముంచింది. ఇదే అహంకార వైఖరి బీఆర్ఎస్ ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిందంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు గానీ.. ఆత్మగౌరవాన్ని చంపుకోరు. అందుకే ఓటు రూపంలో జనం సమాధానం చెప్పారంటున్నారు.


కబ్జాలు, అవినీతి

ఇక ప్రగతి భవన్ ఒక గడీ మాదిరిగా మారింది.. ఎవరికీ అనుమతి లేకుండా పోయింది. ఒక దశలో మంత్రులు, ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితులూ ఉన్నాయి. ఇక ఎవరైనా నిరసన తెలుపుదామన్నా ఛాన్స్ లేకుండా పోయింది. జనం సమాజంలోని వివిధ వర్గాలు తమ సమస్యలు, బాధలు చెప్పుకుందామంటే.. అటు కేసీఆర్ సెక్రటేరియట్ కు వెళ్లలేదు.. ఇటు చూస్తే ప్రగతి భవన్ లో దొరకలేదు. చాలా వరకు ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారు. దీంతో ఒక దశలో ఫాంహౌజ్ సీఎం అని దేశమంతా ప్రచారం కూడా జరిగింది. ఇది కూడా బీఆర్ఎస్ ఓటమికి పెద్ద మైనస్ గా మారిందంటున్నారు. పైగా బీఆర్ఎస్ నేతల కబ్జాలు, దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి పెరగడం కారు టైర్లు పంక్చర్ అవడానికి మరో ముఖ్య కారణం.

కాళేశ్వరం కుంగడం

ఇక బీఆర్ఎస్ ఓటమికి మరో కీలక కారణం కాళేశ్వరం కుంగడం. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ నమ్ముకుంది. అయితే ఎన్నికలకు ముందు మేడిగడ్డ కుంగడం, అన్నారం లీకేజీలతో ఒక్కసారిగా గులాబీదళం షేక్ అయింది. అప్పటిదాకా కాళేశ్వరం అద్భుతం అని ప్రచారం చేసుకున్న కేసీఆర్.. ఆ తర్వాత ఎన్నికల సభల్లో దీన్ని ప్రస్తావించలేకపోయారు. జనంలో కూడా కమీషన్లతో ఈ ప్రాజెక్టు కట్టడంతోనే కుంగిపోయిందన్న అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో ఈ ఇష్యూ కూడా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకుంది. పైగా కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డే కాదని, రకరకాల ప్యాకేజీలు అని ఒక్క పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టే మునిగిపోయినట్లు కాదని ప్రచారం చేసుకున్నా జనం నమ్మలేదు. నిజానికి కాళేశ్వరం ప్యాకేజీలో గుండెకాయ లాంటిది మేడిగడ్డ. దీనిపై కాంగ్రెస్ చేసిన ప్రచారం సక్సెస్ అయింది.

నియామకాల్లో నిర్లక్ష్యం

ఇక తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలోనూ కేసీఆర్ సర్కార్ పూర్తిస్థాయిలో పని చేయకపోవడం మైనస్ అంటున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల బాధలను పట్టించుకోకపోవడం, నోటిఫికేషన్లు అన్నీ ఎలక్షన్ల ముందే ఇవ్వడం, ఇందులో పేపర్ లీక్ లు, వాయిదాలు, పరీక్షలు రద్దవడం, చెప్పిన పోస్టులు చాలా అయితే.. వేసినవి కొన్నే ఉండడం ఇవన్నీ నిరుద్యోగుల సహనానికి పరీక్ష పెట్టాయి. కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీంతో నిరుద్యోగుల ఓట్లు, వారి కుటుంబాల ఓట్లన్నీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పడ్డాయంటున్నారు.

కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం

2014లో కేసీఆర్ గద్దెనెక్కాక ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డు జారీ చేయలేకపోయారు. దీంతో చాలా మంది పేదలు రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడ్డారు. కుటుంబాల నుంచి విడిపోయిన వారున్నారు. కొత్తగా పెళ్లయిన వారు, పిల్లలున్న వారిలో పేదలు చాలా మంది ఉన్నా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. వీరందరూ సైలెంట్ ఓట్ మాదిరిగా బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు.

అందని డబుల్ ఇండ్లు

ఇక డబుల్ బెడ్రూంల సంగతైతే ఇంకా దారుణం. చాలా చోట్ల కట్టినా బిల్డింగ్ లు శిథిల దశకు చేరుతున్నా ఇవ్వలేకపోయారు. ఎలక్షన్ల ముందు కొందరికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో డబుల్ బెడ్రూం ఇండ్లు రాని వారంతా కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా మారిపోయారంటున్నారు.

బంధుతో ఓట్లు బంద్

దళితబంధు, మైనార్టీ, బీసీ బంధు విషయంలోనూ లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందంటున్నారు. వచ్చింది కొందరికే.. అది కూడా బీఆర్ఎస్ నేతల అనుచరులకే అన్న వాదన జనంలో బలంగా పడిపోయింది. ఇదేం తీరు అంటూ అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల రూపంలో తమ తీర్పు ఇచ్చారు.

ఉద్యోగుల అసంతృప్తి

దేశంలోనే ఎక్కువ జీతాలు తెలంగాణలోనే ఉన్నాయని చెబుతూనే… ఏ నెలలోనూ ఫస్టుకు జీతాలు వేయని పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రతి నెల 20, 25వ తేదీ వరకూ జీతాలు వేశారు. దీంతో ఈఎంఐలు ఉన్న వారు చాలా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పీఆర్సీ, ఫిట్ మెంట్, ఐఆర్ పైనా ఉద్యోగులు పెదవి విరిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్కా ఓటు బ్యాంకుగా ఉన్న రైతులు, వృద్ధులే టార్గెట్ గా కేసీఆర్ తాయిలాలు ఇచ్చారని, మధ్యతరగతి జనాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారన్న కారణంతో వారు కూడా గులాబీ పార్టీకి దూరం జరిగారన్న టాక్ ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఇబ్బంది పడ్డా స్కూల్ ఫీజుల నియంత్రణపై ఫోకస్ పెట్టలేకపోయారు. ఇలాంటివన్నీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేక ఫ్యాక్టర్ గా మారాయంటున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈసారి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర అసంతృప్తితో కనిపించిన పరిస్థితి.

స్థానిక వ్యతిరేకత

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కువవడం మైనస్ గా మారింది. పైకి బాగా కనిపించే ఫ్లైఓవర్లు, రోడ్లు, లైట్లు, బ్యూటిఫికేషన్ వీటినే ఫోకస్ చేశారు. మిగితావన్నీ పక్కన పెట్టేశారన్న భావన జనంలో పెరగడంతో ఎదురుగాలి వీయక తప్పలేదు. ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ ఛైర్మన్లు, సర్పంచ్ లు ఇలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా నిధుల్లేక, పనులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. వీరంతా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం అసంతృప్తితో కనిపించారు. ఎన్నికల ముందు చాలా మంది కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. నిజానికి పోలింగ్ బూత్ ల దాకా వెళ్లి జనాన్ని ఓటు వేయించడం, పోల్ మేనేజ్ మెంట్ లెక్కలు చూసుకోవడంలో ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే కీలకపాత్ర పోషిస్తుంటారు. అలాంటిది వీరంతా ఒక్కసారిగా కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అవడంతో సీన్ మారిపోయింది.

పస లేని ప్రచారం

ఇక ప్రచారాల్లోనూ బీఆర్ఎస్ ఈసారి జనాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రకటనల్లోనూ క్రియేటివిటీ కనిపించలేదు. కేవలం కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు కాలేదన్న ప్రచారాన్నే నమ్ముకున్నారు. అది కూడా కలిసి రాలేదు. ఏకంగా కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తెలంగాణ వచ్చి ప్రచారాలు చేసి.. కర్ణాటక వచ్చి 5 గ్యారెంటీలు అమలవుతున్నాయో లేదో చూడాలని సవాల్ చేయడం.. వీటిని బీఆర్ఎస్ నేతలు స్వీకరించకపోవడం ఇవన్నీ గులాబీ పార్టీకే బూమరాంగ్ గా మారిపోయాయంటున్నారు.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం… ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాం.. మాకేం నష్టం లేదు అని కేసీఆర్ పదే పదే చెప్పడం కూడా పోలింగ్ కు ముందు బీఆర్ఎస్ శ్రేణులు అస్త్ర సన్యాసం చేయడానికే ఉపయోగపడిందంటున్నారు. 70 ఏళ్లొచ్చినయ్.. ఇంకేం కావాలి… తెలంగాణ తెచ్చానన్న పేరే చాలు అని కేసీఆర్ అనడం కూడా ఇక పనైపోయిందన్న భావనను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. అధికారం శాశ్వతం కాదు అని కేటీఆర్ కూడా ఎన్నికలకు ముందే వేదాంత ధోరణితో మాట్లాడడం కూడా మైనస్ అయింది. బీఆర్ఎస్ నేతలు పోలింగ్ కు ముందే అస్త్ర సన్యాసం చేయడంతో జనం కూడా మూడ్ మార్చుకున్నారంటున్నారు.

ఉద్యమకారులను మొత్తం పక్కన పెట్టడం.. ఉద్యమంతో సంబంధం లేని వారిని చుట్టూ చేర్చుకోవడం కూడా తెలంగాణ వాదులు ఉద్యమకారులు జీర్ణించుకోలేని విషయం. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ ఈజీగా విక్టరీ కొట్టారు. ఈసారి సెంటిమెంట్ పని చేయలేదు. అయితే పోలింగ్ రోజున సెంటిమెంట్ కోసం నాగార్జున సాగర్ దగ్గర సాగిన నీటి విడుదల డ్రామా బీఆర్ఎస్ కే బూమరాంగ్ అయిందంటున్నారు. సరిగ్గా పోలింగ్ రోజునే ఏపీ అధికారులు నీటి విడుదల చేయడం గులాబీదళానికే మైనస్ అయిందంటున్నారు. ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిందన్నట్లుగా రిజల్ట్ వచ్చింది. అదీ సంగతి.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×