IPL : మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఐపీఎల్ 16వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా నేడు క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు.. ముంబై, లక్నో మధ్య జరిగే మ్యాచ్ లో విజేతతో క్వాలిఫయర్-2లో తలపడుతుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
ఈ ఐపీఎల్ సీజన్ గుజరాత్ , చెన్నై జట్ల మధ్య మ్యాచ్ తో మొదలైంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. గుజరాత్ ఆ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. తొలి మ్యాచ్ ను అహ్మదాబాద్ లో సొంతగడ్డపై ఆడటం గుజరాత్ జట్టుకు కలిసొచ్చింది. మరి నేడు చెన్నై జట్టు కూడా సొంతగడ్డపైనే క్యాలిఫయర్ -1 మ్యాచ్ ఆడబోతుంది. మరి ధోని సేన తొలి మ్యాచ్ లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
గత సీజన్ లోనే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలిసారే విజేతగా నిలిచిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్.. టైటిల్ నెలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు రికార్డు స్థాయిలో 12వ సారి ప్లే ఆఫ్స్‌కు చేరిన చెన్నై ఫైనల్లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతోంది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో గుజరాత్ పటిష్టంగా ఉంటే.. సొంతగడ్డపై ఆడనుండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. శుభ్ మన్ గిల్, పాండ్యా, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, షమీ గుజరాత్‌కు కీలకం కానున్నారు.
చెన్నై జట్టుకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అతిపెద్ద బలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, జడేజాతో బ్యాటింగ్ బలంగా ఉంది. టైటాన్స్ బౌలింగ్‌తో పోల్చుకుంటే చెన్నై కాస్త బలహీనంగా ఉంది.
గుజరాత్ ఈ ఐపీఎల్ సీజన్ లో లీగ్ దశలో అదరగొట్టింది. 14 మ్యాచ్ ల్లో 10 గెలిచి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ జట్టు 4 మ్యాచ్ ల్లో మాత్రమే ఓడింది. చెన్నై 8 మ్యాచ్ ల్లో గెలిచి మరో 5 మ్యాచ్ లు ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మరి క్వాలిఫైయర్ -1 లో గెలిచేదెవరు? ఏ జట్టు ఫైనల్ కు చేరుతుంది.?
Leave a Comment