EPAPER

BCCI Assets: మన BCCI బాగా రిచ్ గురూ.. ప్రస్తుత ఆస్తుల విలువెంతో తెలుసా?

BCCI Assets: మన BCCI బాగా రిచ్ గురూ.. ప్రస్తుత ఆస్తుల విలువెంతో తెలుసా?

BCCI Assets: బీసీసీఐ 18 వేల కోట్ల నికర ఆస్తులు సంపాదించిందంటే దాని వెనుక చాలా కృషి పట్టుదల ఉంది. అసలు ఏమీ లేని పరిస్థితి నుంచి అందరినీ శాసించే స్థాయికి చేరడం వెనుక చాలా కథ నడిచింది. 2002లో బీసీసీఐ ఆస్తులు కేవలం 115 కోట్ల మాత్రమే ఉంటే 2023కి 18 వేల 700 కోట్లకు చేరింది. బోర్డు సంపద పెరుగుతున్నా కొద్దీ… ఆటలో మార్పులు చేస్తోంది. మహిళల క్రికెట్ నూ ప్రోత్సహిస్తోంది. పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు ఇస్తోంది. ఇలా ఎన్నెన్నో సంస్కరణలకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది.


బీసీసీఐ.. ఒక సక్సెస్ ఫుల్ క్రికెట్ బోర్డు. భారత్ లో క్రికెట్ జర్నీని పండగలా మార్చేసిన బోర్డు ఇది. ప్రపంచదేశాల్లో క్రికెట్ కు క్రేజ్ తీసుకురావడంలో పెద్దన్న పాత్ర పోషించింది. పోషిస్తోంది కూడా. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ గత ప్రస్థానం చాలా కష్టంగా సాగింది. 1928 డిసెంబర్ 4న బీసీసీఐ ఏర్పడింది. బ్రిటిష్ ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా ఇది పట్టాలెక్కింది. ఓసారి 1983కు వెళ్దాం. కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ వరల్డ్ కప్ నెగ్గిన సందర్భమది. సీన్ కట్ చేస్తే గెలిచిన ప్లేయర్స్ కు నజరానా ఇవ్వాలి కదా.. కానీ మన బీసీసీఐ దగ్గర నజరానా ఇవ్వడానికి కూడా నయా పైసా లేని సందర్భమది. ఫ్లైట్ టిక్కెట్లకూ డబ్బులు లేని పరిస్థితి అది.

1983లో నాటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వే.. సింగర్ లతా మంగేష్కర్‌ సాయం కోరారు. ఆమెతో ఢిల్లీలో ఓ మ్యూజిక్‌ కన్సర్ట్‌ నిర్వహించగా.. టిక్కెట్ల ద్వారా రెండు లక్షలు వచ్చాయి. ఆ డబ్బును విశ్వవిజేత టీమిండియా ప్లేయర్స్ కు బీసీసీఐ రివార్డుగా ఇచ్చి సత్కరించింది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆర్థికంగా అన్ని బోర్డులను అంతెందుకు ఐసీసీని కూడా శాసించే పొజిషన్ కు చేరుకుంది బీసీసీఐ.


ఐపీఎల్ నిర్వహణతో బీసీసీఐ దశ తిరిగిపోయింది. 2008లో ఇండియన్ ప్రిమియర్ లీగ్ మొదలైంది. అప్పటి వరకు వెయ్యి కోట్ల లోపు నెట్ వర్త్ ఉన్న బీసీసీఐ ఆస్తులు… 2008లో వెయ్యి కోట్లు దాటేశాయి. ఇక అప్పటి నుంచి భారత్ బోర్డు డబ్బు నిధుల గురించి వెనుదిరిగి చూసుకోలేదు. 2011 నాటికి 3300 కోట్లు, 2015 నాటికి 5438 కోట్లు, 2018 నాటికి 11892 కోట్లు, 2020లో 16417 కోట్లు, ఇక 2023 నాటికి 18700 కోట్ల నెట్ వర్త్ ఆస్తులను కలిగి ఉంది బీసీసీఐ. ఇదంతా ఐపీఎల్ మహిమే అంటున్నారు. సంవత్సరాలు గడిచినా కొద్దీ ఐపీఎల్ రెవెన్యూను బీసీసీఐ చాలా పెంచుకుంది. ప్రాంఛైజీలను పెంచింది. మ్యాచ్ ల సంఖ్యను పెంచింది. రెట్టింపు ఆదాయాన్ని పొందడం మొదలు పెట్టింది. కొత్త ప్రాంఛైజీలైతే.. బీసీసీఐ నిర్దేశించిన బేస్‌ప్రైస్ కంటే రెట్టింపు కోట్ చేసి దక్కించుకున్నాయి. ఆర్థిక ప్రవాహం అలా ఉంది మరి.

పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత మాదిరిగా.. ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెరగడం వల్ల సంప్రదాయబద్ధమైన సిరీస్‌లు తగ్గుముఖం పట్టి అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదనే ఆందోళన క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మీడియా రైట్స్‌, స్పాన్సర్ షిప్‌ల ద్వారా బోర్డులు ఆదాయాన్ని ఆర్జిస్తాయి. అంతేకాకుండా టికెట్ల అమ్మకాల ద్వారా కూడా ఇన్ కం స‌మ‌కూరుతుంది. ముఖ్యంగా ఐపీఎల్ ప్రసార హ‌క్కుల ద్వారా బీసీసీఐ భారీగానే ఆర్జించింది. 2023 నుంచి 2027 వ‌ర‌కు ఐపీఎల్ ప్రసార హ‌క్కులను అమ్మడం ద్వారా మూడు వేరువేరు సంస్థలు క‌లిపి బీసీసీఐకి 48,390.32 కోట్లు చెల్లిస్తున్నాయి.

దాదాపు 12 ఏళ్ల త‌రువాత వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌కు భార‌త్ ఇటీవలే ఆతిథ్యం ఇచ్చింది. ఈ మెగాటోర్నీలో వ‌రుస‌గా 10 మ్యాచుల్లో గెలిచి ఫైన‌ల్‌కు చేరిన భార‌త్ ఫైనల్స్ లో ఓడిపోయింది. టీమ్ఇండియా ప్రపంచ‌క‌ప్‌ గెలవకపోయినా… భార‌త ఆర్థిక వ్యవ‌స్థలోకి భారీగా న‌గ‌దు ప్రవాహం వ‌చ్చింది. ఎక‌నామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం దాదాపు 22 వేల కోట్లు క్రికెట్ వరల్డ్ కప్ ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చాయన్నది. ఇందులో బీసీసీఐ సంపాదనే అధికం. మరోవైపు ఆదాయం పెంచుకోవడంతో పాటే.. క్రికెట్ గేమ్ ను మరింత విశ్వవ్యాప్తం చేయడం, ఈ స్పోర్ట్ లోకి వచ్చే వారికి మరింత ఆసక్తి పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మహిళల క్రికెట్ కు కూడా బీసీసీఐ ఆర్థికంగా చాలా ప్రోత్సాహం అందిస్తోంది. ప్రస్తుతం టీ ట్వంటీ ఆడితే ఒక్కో ప్లేయర్ కు మ్యాచ్ ఫీజు కింద 3 లక్షలు చెల్లిస్తున్నారు. అదే వన్డే ఆడితే 6 లక్షలు, అదే టెస్ట్ మ్యాచ్ ఫీజు 15 లక్షలుగా ఉంది. ఇది పురుష ప్లేయర్లకు ఉండేది. అయితే ఇంతే మొత్తాన్ని మహిళా ప్లేయర్లకూ ఇవ్వాలని బీసీసీఐ గతేడాదే డిసైడ్ చేసింది. దీంతో మహిళా క్రికెట్ కు మహర్దశ తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది.

క్రికెట్ ను మరింతగా విశ్వవ్యాప్తం చేయాలన్న టార్గెట్ తో బీసీసీఐ పని చేస్తోంది. విశ్వ క్రీడలు అంటే ఒలింపిక్స్ మాత్రమే. ఎన్నెన్నో గేమ్స్ నిర్వహించినా క్రికెట్ కు అక్కడ చోటు కల్పించలేకపోయారు. అయితే ఇటీవలి కాలంలో క్రికెట్ ఫ్యాన్స్ చొరవ చూపడంతో 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ను చేరుస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఈవెంట్‌ను టి20 ఫార్మాట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్ల మధ్య నిర్వహిస్తారు. ఆతిథ్య దేశం హోదాలో అమెరికా జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా మిగతా ఐదు జట్లను నిర్ణయించే అవకాశముంది. 1877లో క్రికెట్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ జరిగింది. 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఒకే ఒకసారి క్రికెట్‌ మెడల్‌ ఈవెంట్‌గా ఉంది. పారిస్‌ గేమ్స్‌లో కేవలం ఫ్రాన్స్, బ్రిటన్‌ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. బ్రిటన్‌ టీంకు గోల్డ్, ఫ్రాన్స్‌ జట్టుకు సిల్వర్ మెడల్స్ లభించాయి. ఆ తర్వాత క్రికెట్‌ ఒలింపిక్స్ జాబితాలో చోటు కోల్పోయింది. మళ్లీ ఇన్నాళ్లకు పూర్వవైభవం వచ్చింది.

తక్కువ టైంలో ఎక్కువ మజా రావాలి. టెస్ట్, వన్డేలు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే టీట్వంటీ ఫార్మాట్ కు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ వచ్చింది. ఇదే ఊపులో టీ10 టోర్నమెంట్ లు కూడా నిర్వహించే ఆలోచనతో బీసీసీఐ ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా చాలా మందిని క్రికెట్ వైపు మళ్లించవచ్చు. అదే సమయంలో ఆదాయం కూడా పెద్ద ఎత్తున జెనరేట్ చేసుకోవచ్చంటున్నారు. 2008లో బీసీసీఐ ఐపీఎల్‌ను ప్రారంభించాక క్రికెట్ ప్రపంచాన్ని ఎలాగైతే ఊపేసిందో.. ఇప్పుడు టీ10తో మరో లెవెల్ క్రేజ్ తీసుకొచ్చే ప్లాన్ తో బీసీసీఐ ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై బీసీసీఐ సెక్రటరీ జై షా బ్లూ ప్రింట్ సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో ఈ లీగ్‌ను నిర్వహించాలని షెడ్యూల్ కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఐపీఎల్‌లో ప్రస్తుతం పాకిస్థాన్ మినహా ప్రపంచ స్టార్ ప్లేయర్లు అందరూ పాల్గొంటున్నారు. భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఐపీఎల్‌కు ప్రపంచంలో ఏ లీగ్‌కు దక్కని ఆదాయం, విపరీతమైన క్రేజ్ దక్కుతోంది. ఈ ఊపులో బీసీసీఐ ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

.

.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×