PV Sindhu in Paris Olympics 2024(Sports news in telugu): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ఒలింపిక్స్‌లో మూడో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మొదటి సెట్ లో చివరి వరకు పోరాడింది. 19 పాయింట్ల వరకు వచ్చి చిన్న చిన్న తప్పిదాలతో సెట్ కోల్పోయింది. రెండో సెట్ లో ఆ స్థాయిలో పోరాడలేక చేతులెత్తేసింది.
మొత్తానికి ఎన్నో ఆశలతో వచ్చి పారిస్ విశ్వక్రీడల నుంచి నిష్క్రమించింది. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ ఒలింపిక్స్ కోసం నా శాయశక్తులా కృషి చేశానని తెలిపింది. నా వరకు నేను చాలా కష్టపడ్డాను. అయితే ఒకొక్కసారి అదృష్టం కూడా కలిసి రావాలి. విధి రాత అంతే అని తెలిపింది.
అయితే తొలి గేమ్‌లో ఓ దశలో 19-19తో సమానంగా ఉన్నా, దాన్ని విజయంగా ముగించలేకపోవడం బాధగా ఉందని తెలిపింది. ప్రతి పాయింట్ కోసం పోరాడాను. సులభంగా పాయింట్లు వస్తాయని, సులభమైన పోటీ ఉంటుందని ఎప్పుడూ భావించలేం. డిఫెన్స్ చేసుకుంటూ, నా తప్పులను నియంత్రించాల్సింది. కొన్ని స్మాష్‌లు కోర్టు బయటపడ్డాయి. వాటిని లోపలకి కొట్టి ఉంటే, ఫస్ట్ సెట్ గెలిచేదాన్ని. అక్కడ ఓడిపోవడంతో ప్రత్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. చైనా షట్లర్ బాగా ఆడింది అని ప్రత్యర్థిని మెచ్చుకుంది.
Also Read: షూటింగ్ తప్ప అన్నింటా ఓటమి..
29 ఏళ్ల పీవీ సింధు.. వచ్చే ఒలింపిక్స్ లో ఆడటంపై స్పందించింది. అది నా చేతుల్లో లేదని తెలిపింది. ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చునని తెలిపింది. ఒలింపిక్స్ కోసం విరామం అన్నదే లేకుండా చాలాకాలం నుంచి ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు నా క్రీడా భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను. ఏదేమైనా భారతదేశం కోసం మరో పతకం తీసుకువద్దామని ఎంతో అనుకున్నాను. కానీ విధి రాత వేరేలా ఉంది. అని ఆవేదన వ్యక్తం చేసింది.
రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో విశ్వక్రీడల్లో కంచు మోత మోగించిన సింధు.. పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం ప్రిక్వార్టర్స్‌కే పరిమితమైంది.