EPAPER

Mohammed Shami : షమీ.. వన్స్ మోర్..

Mohammed Shami : షమీ.. వన్స్ మోర్..
Mohamad Shami

Mohammed Shami : బెంగాల్ కి చెందిన 33 సంవత్సరాల మహ్మద్ షమీ ఒంటిచేత్తో టీమ్ ఇండియాని సెమీస్ ముంగిట సగర్వంగా నిలబెట్టాడు. మరో ఎండ్ లో కోహ్లీ, శ్రేయాస్, గిల్, రోహిత్ అందరూ తలా ఒక చేయి వేసినా, భారమంతా తన భుజాలపైనే వేసుకుని నాకౌట్ మ్యాచ్ లో ఇండియాని గెలిపించాడు. ఐదుగురు బౌలర్లు ఒక్కరికి వికెట్లు పడటం లేదు. మరోవైపు స్కోరు చూస్తే పరిగెడుతోంది.


కెప్టెన్ రోహిత్ కి వికెట్లు కావాలి. మనిషి నలిగిపోతున్నాడు. బాగా టెన్షను పడుతున్నాడు. టీమ్ ఇండియానంతటిని ఒక చోటుకి చేర్చి, వారికి మనో ధైర్యాన్ని, మనోబలాన్ని ఇస్తున్నాడు. మనం కలిసికట్టుగా ఆడుదాం. ఇంతవరకు జరిగినదేదో జరిగింది. ఏ ఒక్క అవకాశాన్ని జార విడవద్దు, ఫీల్డింగ్ లో ఫోర్లు ఆపాలి. ఇలా చెబుతున్నాడు.

అలా ఐదో ఓవర్ తర్వాత రోహిత్ శర్మ తన ట్రంప్ కార్డు షమీకి బాల్ ఇచ్చాడు. ఎందుకంటే 10 ఓవర్ లోపు వికెట్టు పడాలి. లేదంటే మ్యాచ్ పై పట్టు జారిపోతుంది. కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని షమీ వమ్ము చేయలేదు. తను వేసిన మొదటి బాల్ మొదటి బంతికి ఓపెనర్ కాన్వేను అవుట్ చేశాడు. కేఎల్ రాహుల్ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టేశాడు. రోహిత్ శర్మ ఆనందం రెట్టింపు అయ్యింది.


మళ్లీ షమీ తన స్పెల్ రెండో ఓవర్ కి వచ్చాడు. అక్కడ వరల్డ్ కప్ లో అదరగొడుతున్న రచిన్ రవీంద్రను సేమ్ బాల్ తో పెవెలియన్ పంపించాడు. అప్పటికి 7.4 ఓవర్లలో కివీస్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 39 మీద ఉంది. అందరికీ సందేహం వచ్చింది. కొంపదీసి శ్రీలంక తరహాలో వీరు కూడా క్యూ కట్టేయరు కదా అనుకున్నారు.. కానీ వారిద్దరూ ఏకు మేకై కూర్చుంటారని అనుకోలేదు. ఆ ఇద్దరూ ఎవరంటే కెప్టెన్ విలియమ్సన్, స్టార్ బ్యాటర్ డేరిల్ మిచెల్ ..

అవతల దాదాపు 400 పరుగుల టార్గెట్. ఆ లక్ష్యం వైపు చూడకుండా, అది మనసులోకి రాకుండా నిలబడిపోయారు. 181 పరుగుల భాగస్వామ్యం బలపడిపోయింది. ఈ సమయంలో 29 ఓవర్ లో బుమ్రా బౌలింగ్ లో షమీ క్యాచ్ వదిలేశాడు. టీవీల దగ్గర లైవ్  చూస్తున్న 5 కోట్ల మంది నిశ్చేష్టులయ్యారు. తర్వాత  బ్యాటర్లు ఇద్దరూ క్రీజులో సెట్ అయి, ఫ్రీగా షాట్లు కొట్టడం మొదలుపెట్టారు. రన్ రేట్ కి తగినట్టుగా గేమ్ సాగిపోతోంది. మిచెల్ ఓవర్ కి ఒక ఫోరు లేదా, సిక్స్ లాగించేస్తున్నాడు. మిగిలిన బాల్స్ డిఫెన్స్ ఆడుతున్నాడు. పర్‌ఫెక్ట్ ప్లానింగ్ తో మ్యాచ్ నడుస్తోంది.

32 ఓవర్లు గడిచిపోయాయి. వికెట్లు ఎంతకీ పడటం లేదు. మళ్లీ రోహిత్ శర్మ.. వెళ్లి షమీకి బాల్ ఇచ్చాడు. ఈసారి కూడా కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని షమీ వమ్ము చేయలేదు. రెండో బాల్ కి కెప్టెన్ విలియమ్సన్ వికెట్టు తీశాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఇచ్చిన క్యాచ్ ని సూర్యకుమార్ చటుక్కున పట్టేశాడు. ఒక్కసారి స్టేడియంలో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. అందరిలో పవర్ కట్ అయిపోయి  ఉన్నవాళ్లలో ఒక్కసారి హైఓల్టేజి పాస్ అయ్యింది. స్టేడియం హోరెత్తిపోయింది.

అప్పుడే ఎవరూహించని మిరాకిల్ జరిగింది. అదే ఓవర్ లో నాలుగో బంతికి కొత్తగా వచ్చిన బ్యాటర్ టామ్ లేథమ్ ఎల్బీడబ్ల్యూగా అయిపోయాడు. అంతే షమీ దెబ్బకి మ్యాచ్ ఒక్కసారి ఇండియా వైపు తిరిగిపోయింది. ఇంక ఆ తర్వాత డేరిల్ మిచెల్ ఒంటరిపోరాటం చేశాడు. మరోవైపు గ్లెన్ ఫిలిప్స్ (41) సహకారంతో మళ్లీ కివీస్ లో ఆశలు రేపారు. అయితే బూమ్రాకి కెప్టెన్ బాల్ ఇచ్చాడు.

ఈసారి బూమ్రా బౌలింగ్ లో ఫిలిప్స్ లాంగ్ ఆన్ లో జడేజాకి క్యాచ్ ఇచ్చాడు. అప్పటికీ కివీస్ స్కోరు 295 ఉంది. 42.5 ఓవర్లు అయ్యాయి. తర్వాత ఓవర్ లో కుల్దీప్ బౌలింగ్ లో డేంజరస్ బ్యాటర్ చాప్ మన్ అయిపోయాడు. తర్వాత మళ్లీ రోహిత్ బాల్ తీసుకెళ్లి షమీకిచ్చాడు. తన కోటాని పూర్తి చేసేయమన్నాడు.

కానీ షమీ మిగిలిన మూడు వికెట్లు తీసి మ్యాచ్ నే ముగించేశాడు.. ప్రపంచ కప్ వన్డే క్రికెట్ నాకౌట్ చరిత్రలో ఏడు వికెట్లు తీసుకున్న మొదటి బౌలర్ గా నిలిచాడు. ఇది అనితర సాధ్యమైన రికార్డు. క్రికెట్ బుక్ అనేది ఒకటి ఉంటే, అందులో షమీకి  ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది. అందులో 2023 వరల్డ్ కప్ లో షమీ పాత్ర అత్యంత కీలకమని చెప్పాలి.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×