Kavya Maran: ఐపీఎల్ మెగా వేలం నిర్వహణపై బీసీసీఐ ఏర్పాటు చేసిన ఫ్రాంచైజీ సమావేశంలో ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి నెట్టింట వైరల్ గా మారాయి.
ఇంతకీ తనేమన్నారంటే.. ఎంతసేపు ఫ్రాంచైజీలను ఆడిపోసుకోవడం, విమర్శించడమే పనిగా ఉందని కావ్య మారన్ సీరియస్ అయ్యారు. కానీ ఫ్రాంచైజీ కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. చాలామంది ఆటగాళ్లు ఫ్రాంచైజీలను చిన్నచూపు చూస్తున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒక ఆటగాడు వేలంలో ఎంపికైన తర్వాత, గాయంతో కాకుండా మరేదైనా కారణాలతో సీజన్‌లో పాల్గొనకపోతే, అతన్ని తప్పనిసరిగా నిషేధించాలని తెలిపారు. అంటే ఐపీఎల్ వరకు ఆ క్రీడాకారుడిపై నిషేధం విధించాలని అన్నారు.
Also Read : పారిస్ ఒలింపిక్స్ నుంచి దిగ్గజ ఆటగాళ్లు అవుట్.. రాఫెల్, కార్లోస్ జోడికి అమెరికన్ల చేతిలో ఓటమి!
ప్రతి ఫ్రాంచైజీ కూడా తమ జట్టు సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని జట్టుని ఎంపిక చేస్తారు. అలాంటప్పుడు కీలకమైన ఆటగాడని భావించిన తర్వాత తను ఆడకపోతే.. దాని ఫలితం జట్టుపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లతో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
ఇదంతా హైదరాబాద్ సన్ రైజర్స్ లో జట్టులో ఉన్న శ్రీలంక ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్, మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ గురించేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే SRH అతనిని ప్రాథమిక ధర రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ తను జట్టులో చేరలేదు. దీంతో ప్రత్యామ్నాయం వెతుక్కోవలసి వచ్చింది. అయితే తను రాకపోవడానికి గాయమే కారణమని హసరంగ తెలిపాడు. ఇక కావ్య మారన్ మాటలపై స్పందించలేదు.
ప్రస్తుతం కావ్య మారన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి బీసీసీఐ ఏం చేస్తుందో, ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రవర్తనపై ఎలాంటి నిబంధనలు విధిస్తుందో వేచి చూడాల్సిందే.