ipl Today : గుజరాత్ టైటన్ప్ మళ్లీ అదరగొట్టింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాండ్యా సేన 17.5 ఓవర్లలోనే టార్గెట్ చేధించింది. విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ మ్యాచ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు.
వృద్ధిమాన్ సాహా ఫెయిల్ అయ్యాడు. కేవలం 10 బంతులకు 10 పరుగులు మాత్రమే చేశాడు. శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. 35 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేశాడు. నరైన్ బౌలింగ్‌లో రసెల్‌కు క్యాచ్ ఇచ్చి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. గిల్‌కు తోడుగా హార్థిక్ పాండ్యా కాసేపు నిలబడ్డారు. ఒక సిక్స్ 2 ఫోర్లతో 26 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూతో ఔట్ అయ్యాడు.
మూడు వికెట్లు పడిన తరువాత గుజరాత్ బ్యాటింగ్ మరింత జోరందుకుంది. విజయ్ శంకర్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ఫోర్ల కంటే సిక్సులే ఎక్కువ బాది కోల్ కతా బౌలర్లను హడలెత్తించాడు. మొత్తం 5 సిక్సులు 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. డేవిడ్ మిల్లర్ కూడా భయపెట్టాడు. 2 సిక్సులు, 2 ఫోర్లతో 32 పరుగులు చేశాడు.
కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, రసెల్, సునీల్ నరైన్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. గుజరాత్‌కు 180 పరుగుల ఈజీ టార్గెట్ ఇచ్చింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫస్ట్ ఓవర్ నుంచే ధాటిగా ఆడారు. సొంత మైదానంలో కోల్‌కతా ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ విధ్వంసక బ్యాటింగ్ చేశాడు. జగదీశన్ 15 బంతుల్లో 19 పరుగుల తక్కువ స్కోర్‌కే ఔట్ అయినా.. గుర్బాజ్ 39 బంతుల్లో 81 పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
కాకపోతే, గుర్బాజ్‌కు ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదు. తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్ మెన్ క్రీజ్ లో నిలబడలేదు. గుజరాత్ బౌలర్లు పుంజుకొని కట్టుదిట్టంగా బంతులు వేయడంతో భారీ స్కోర్ సాధ్యం కాలేదు. శార్దూల్ ఠాకూర్ డకౌట్ అయ్యాడు. వెంకటేష్ అయ్యర్ 11 పరుగులు, నితిష్ రాణా 4 పరుగులు మాత్రమే చేశారు. చివర్లో మాత్రం రస్సెల్ మెరుపులు మెరిపించాడు. 19 బంతుల్లో 34 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే కోల్ కతా 179 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో షమీ 3 వికెట్లు, లిటిల్, నూర్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.