EPAPER

IND vs SL 3rd T20I Highlights: ముచ్చెమటలు పట్టించిన మూడో టీ 20.. సూపర్ ఓవర్ లో టీమ్ ఇండియా ఘన విజయం

IND vs SL 3rd T20I Highlights: ముచ్చెమటలు పట్టించిన మూడో టీ 20.. సూపర్ ఓవర్ లో టీమ్ ఇండియా ఘన విజయం

India vs Sri Lanka 3rd T20I Highlights: టీమ్ ఇండియా మూడో టీ 20 మ్యాచ్..
శ్రీలంక బ్యాటింగు.. టార్గెట్ ఛేజ్ చేస్తోంది.
చివర 21 బాల్స్ లో 21 పరుగులు చేయాలి.
అప్పటికి 2 వికెట్లు మాత్రమే పడ్డాయి.
స్కోరు అప్పుడు 117 పరుగులు..
వాషింగ్టన్ సుందర్ బౌలింగు..
తన కోటా ఆఖరి ఓవర్ వేస్తున్నాడు.
అప్పటికే పరుగులు భారీగా సమర్పించుకున్నాడు.
ఒక్క వికెట్టూ పడలేదు. ఎవరికీ నమ్మకాల్లేవు..
సూర్యకుమార్ అప్పుడు బాల్ సిరాజ్ కి ఇచ్చాడు.
కానీ ఎందుకో మనసు మార్చుకుని మళ్లీ వాషింగ్టన్ కి ఇచ్చాడు.
మూడు బాల్స్ అయిపోయాయి. నాలుగో బంతి వేశాడు.
అటువైపు స్ట్రయికింగ్ లో మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ హసరంగ ఉన్నాడు…తను షాట్ కొడదామని ట్రై చేశాడు.
అది గాల్లోకి ఎగిరింది. అంతే రవి బిష్ణోయ్ అద్భుతంగా పట్టేశాడు.
ఒక్కసారి భారత శిబిరంలో ఆనందం వేసింది.
కానీ పడినవి 3 వికెట్లే.. వచ్చేది కెప్టెన్ చరిత్ అసలంక..
తను మొదటి రెండు టీ 20లు సరిగా ఆడలేదు.
ఈ మ్యాచ్ గెలిపించి సత్తా చూపిస్తాడని అంతా అనుకున్నారు.
కానీ ఆడిన మొదటి బంతికే గోల్డెన్ డక్ అవుట్ అయిపోయాడు. సంజూ శాంసన్ అద్భుతంగా పట్టిన క్యాచ్ తో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
వాషింగ్టన్ కి వరుస బంతుల్లో రెండు వికెట్లు వచ్చాయి. ఒక్కసారి భారత శిబిరంలో మళ్లీ ఆశలు ఊపిరిపోసుకున్నాయి.


18వ ఓవర్.. గంభీర్ ఏరికోరి తెచ్చుకున్న ఖలీల్ అహ్మద్ వేశాడు. ఒత్తిడిలో పడి ఆ ఓవర్ లో ఏకంగా 5 వైడ్లు వేశాడు. అలా ఓ ఓవర్ లో 12 పరుగులు ఇచ్చాడు. అయిపోయింద్రా మ్యాచ్ అని అంతా అనుకున్నారు. ఆ ఓవర్ ముగిసేసరికి శ్రీలంక స్కోరు 4 వికెట్ల నష్టానికి 129 పరుగులు.

ఇంకా 12 బంతుల్లో 9 పరుగులు చేయాలి. ఎవరికి ఇండియా గెలుస్తుందని నమ్మకం లేదు. అలా చూస్తున్నారంతే. అప్పుడు సూర్యకుమార్ లో కెప్టెన్ బయటకి వచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా బాల్ ని రింకూ సింగ్ చేతిలో పెట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు.  అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతంగా బౌలింగు చేసి.. అప్పటివరకు బ్రహ్మాండంగా ఆడుతున్న కుశాల్ పెరీరా ( 34 బంతుల్లో 46 పరుగులు) వికెట్ తీశాడు. అంతే అందరిలో నవ్వులు పువ్వులై పూశాయి.


డగౌట్ నుంచి గౌతం గంభీర్, గ్రౌండ్ లో సూర్య ఒకటే నవ్వులు.. తర్వాత కూడా రింకూ ఊరుకోలేదు. చిచ్చరపిడుగులా మారి బంతులేశాడు. హిట్టర్ గా వచ్చిన రమేశ్ మెండిస్ వికెట్ తీశాడు.
ఆ ఓవరులో 3 పరుగులు మాత్రమే ఇచ్చి, 2 వికెట్లు తీసి, మ్యాచ్ ని లైవ్ లో ఉంచాడు. ఇప్పుడు చివరి ఓవర్ ఎవరు వేస్తారనే ప్రశ్న అందరిలో ఉదయించింది.

సిరాజ్ కోటాలో ఆఖరి ఓవర్ ఉంది. తనకి వికెట్ పడలేదు కానీ, రన్స్ కంట్రోల్ చేశాడు. కానీ సూర్యకుమార్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, తనే బౌలింగు వేయడానికి వచ్చాడు. ఎవరికి నోటా మాట లేదు. మ్యాచ్ చూసే వాళ్లేకాదు, టీమ్ఇండియా క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయారు. తను కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫటాఫట్ 2 వికెట్లు తీసి పారేశాడు.

అయితే నాలుగో బంతికి శ్రీలంక రెండో పరుగు తీయడానికి ట్రై చేసింది. నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న సూర్య దగ్గరకి బాల్ రాగనే, తన దగ్గర వికెట్లను కొట్టకుండా, దూరంగా ఉన్న కీపర్ కి బాల్ ఇచ్చాడు. నిజానికి తన దగ్గర వికెట్లను కొట్టి ఉంటే, అక్కడ రన్ అవుట్ వచ్చేది. మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చేసేది.
కానీ అలా జరగలేదు. చివరికి 1 బాల్ 3 పరుగులుగా ఈక్వేషన్ మారిపోయింది.

చివరి బాల్ సూర్యా వేశాడు. శ్రీలంక రెండు పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయిపోయింది. అంతే ఒక్కసారి రెండు శిబిరాల్లో ఆశ్చర్యం. ఏం జరిగింది? ఏం జరిగింది? అని అంతా గందరగోళంతో కూడిన ఆనందంలో భారతీయులు మునిగిపోయారు.

Also Read: పారిస్ ఒలింపిక్స్, ప్రియుడితో ఎంజాయ్, పోటీల నుంచి స్విమ్మర్ ఔట్

సరే, ఇక సూపర్ ఓవర్ మొదలైంది. శ్రీలంక బ్యాటర్లు కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా వచ్చారు. మళ్లీ ఇక్కడ టీమ్ ఇండియా మరో ప్రయోగం చేసింది. ఈసారి వాషింగ్టన్ సుందర్ తో బౌలింగు వేయించారు. మొదటి బాల్ వైడ్ వేశాడు. తర్వాత బంతికి సింగిల్ వచ్చింది.

ఓవర్ రెండో బంతిని కుశాల్ పెరీరా షాట్ కొట్టాడు. లాంగ్ ఆన్ లో రవి బిష్ణోయ్ పట్టేశాడు. తర్వాత శ్రీలంక స్టార్ ఓపెనర్ నిశ్శాంక వచ్చాడు. వాషింగ్టన్ వేసిన రెండో బంతిని గట్టిగా కొట్టాడు. బౌండరీ లైను దగ్గర రింకూ సింగ్ పట్టేశాడు. అంతే శ్రీలంక 2 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పుడు 3 పరుగులు చేస్తే భారత్ గెలుస్తుంది.

శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ బ్యాటింగుకి వచ్చారు. సూర్య స్ట్రయికింగ్ లో ఉన్నాడు. ఫస్ట్ బాల్ ని థర్డ్ మ్యాన్ వైపు ఆడాడు. మిస్ ఫీల్డింగ్. ఫోర్ వెళ్లిపోయింది. అంతే టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. అందరి ముఖాలు వెలుగుతో నిండిపోయాయి. మొత్తానికి టీ 20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది.
అయితే టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఎదురైన ఉత్కంఠను మించిన టెన్షన్…మళ్లీ ఇక్కడ భారతీయులు చూశారు. దీనిని ఒక థ్రిల్లింగ్ విక్టరీగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిపోయిన శ్రీలంక బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగుకి వచ్చిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక సూపర్ ఓవర్ వరకు వెళ్లి పరాజయం పాలైంది.

శ్రీలంక బ్యాటింగులో చూస్తే ఓపెనర్ నిశ్శాంక (26), కుశాల్ మెండీస్ (43), కుశాల్ పెరీరా (46) మాత్రమే బాగా ఆడారు. మిగిలిన అందరూ కూడా సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోయారు. కెప్టెన్ చరిత్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు.

టీమ్ ఇండియా బౌలింగులో వాషింగ్టన్ సుందర్ 2, సూపర్ ఓవర్ లో 2 మొత్తం 4 వికెట్లు, రవి బిష్ణోయ్ 2, రింకూ సింగ్ 2, సూర్యకుమార్ 2 వికెట్లు పడగొట్టారు.

Also Read: ఈ మనుబాకర్ ఎవరు?

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకి అస్సలు శుభారంభం దక్కలేదు. శ్రీలంక బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో భారత్ బ్యాటర్లని గుక్క తిప్పుకోనివ్వలేదు. క్రీజులో కుదురుకోనివ్వలేదు. ఒకొక్క పరుగు తీయడానికి మనోళ్లు చెమటోడ్చారు. ఎప్పటిలాగే సంజూ శాంసన్ డక్ అవుట్ అయిపోయాడు. యశస్వి (10), రింకూ సింగ్ (1), సూర్య కుమార్ (8), శివమ్ దుబె (13) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఒకానొక సమయంలో 8.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 48 పరుగులతో టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఈ దశలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), వాషింగ్టన్ సుందర్ (25) ఆడటంతో టీమ్ ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగలిగింది.

శ్రీలంక బౌలింగులో చమిందు 1, తీక్షణ 3, అసితా ఫెర్నాండో 1, రమేష్ మెండిస్ 1, హసరంగ 2 వికెట్లు పడగొట్టారు.

తర్వాత శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. అందులో ఎప్పటిలా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ వీరందరూ ఆడనున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×