EPAPER

Mohammed Shami : ఇండియా బౌలింగ్ ప్యూచర్.. మహ్మద్ షమీ

Mohammed Shami : ఇండియా బౌలింగ్ ప్యూచర్.. మహ్మద్ షమీ

Mohammed Shami : అతనెప్పుడూ డబ్బును కోరుకోలేదు. అతడి లక్ష్యం స్టంపులు మాత్రమే. ఆ స్టంపునకు బంతి తగిలినప్పుడు.. దాని నుండి వచ్చే శబ్ధమే అతనికి కావాలి. అని అని అతని గురించి తెలిసినవారు అంటూ ఉంటారు. ఇంతకీ ఎవరతను ? వన్డే వరల్డ్ కప్ 2023 ద్వారా ‘ఇండియా బౌలింగ్ ఫ్యూచర్’ గా మారిన ‘మహ్మద్ షమీ’యే అతను.


ఈ వరల్డ్ కప్ లో మొదటి నాలుగు మ్యాచ్ లకు షమీని ఎంపిక చేయలేదు. హార్దిక్ పాండ్యా గాయపడటంతో.. జట్టులోకి వచ్చి రాగానే విధ్వంసమే చేశాడు. ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్ ల్లో 23 వికెట్లు తీసుకుని వరల్డ్ కప్ సీజన్ లో నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు. ఇక సెమీఫైనల్ లో అద్భుతమే చేశాడు. న్యూజిలాండ్ ని చెడుగుడు ఆడి, ఏడు వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన బౌలర్లకి ఒక్కొక్క వికెట్టు మాత్రమే వచ్చింది. అదీ 42 ఓవర్ల నుంచి పడ్డాయి. ఆ రోజు నిజంగా షమీ లేకపోతే, ఇండియా ఫైనల్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

ఇక ఉన్నమాట చెప్పాలంటే అటు బ్యాటింగ్ లో కొహ్లీ.. ఇటు బౌలింగ్ లో షమీ ఇద్దరూ కలిసి టీమ్ ఇండియా ఫైనల్ కి చేరడంలో కీలకపాత్ర పోషించారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇంత గొప్ప ప్రదర్శన చేస్తున్న తనని మొదటి నాలుగు మ్యాచ్ ల్లో ఎందుకు ఎంపిక చేయలేదంటే అందుకు షమీ ఏం చెబుతున్నాడో చూద్దాం.


“మనది అతిపెద్ద భారతదేశం.. అందులో 15మందిని క్రికెట్ బోర్డు ఎంపిక చేస్తుంది. వారిలో 11 మంది మాత్రమే ఆడగలరు. మిగిలిన నలుగురు బెంచ్ మీద ఉండాల్సిందే. ఈ రోజు నేను 11మంది జాబితాలో ఉండకపోవచ్చు. కానీ.. రేపు మనదన్న రోజు తప్పకుండా వస్తుంది. రొటేషన్ లో ఏదొక రోజు ఖచ్చితంగా ఆటలోకి వస్తాం. ఆ సమయం వచ్చినప్పుడు.. జట్టుకి సహకరించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. ఇదే అనుక్షణం అనుకుంటాను. జీవితంలో ఎదురయ్యే ప్రతీ దానిని పాజిటివ్ గా తీసుకోవాలి. అప్పుడే సానుకూల ఫలితాలు పొందగలం.
ఇదే నా ఫిలాసఫీ.”

నిరంతరం ఒక ఆశావహ దృక్పథంతో సాగిపోయే 33 ఏళ్ల షమీ విజయసూత్రం కూడా ఇదే అని చెప్పాలి. అటు కుటుంబపరంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ జాతీయ జట్టులో రాణించడమంటే మాటలు కాదు. అంతటి మనోధైర్యం, మానసిక స్థిత ప్రజ్ఞత ఉండటం చాలా గొప్ప విషయం. అది మహ్మద్ షమీలో పుష్కలంగా ఉంది. అందుకే అలుపెరగకుండా వికెట్లు తీస్తున్నాడు. ఔరా అనిపిస్తున్నాడు.

నిజానికి ప్రేమగా చూసుకున్న భార్య దగ్గర లేదు. ప్రాణంగా చూసుకున్న కూతురు దగ్గర లేదు. కోర్టు వరకు వెళ్లిన గొడవలు.. పోయిన పరువు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు భార్య ఆరోపణలు, బీసీసీఐ ఎంక్వైరీ, నిర్దోషిగా ప్రకటన, నలుగురు నానా రకాలుగా మాట్లాడే మాటలు.. వీటన్నింటిని అధిగమించి ఈ రోజు వన్డే వరల్డ్ కప్ 2023 లో అదరగొడుతున్నాడంటే.. సామాన్యమైన విషయం కాదు. ఇంటా బయట సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటినెలా అధిగమించి సక్సెస్ కావాలో.. షమీని చూసి నేర్చుకోవాల్సిందే.

షమీని రివర్స్ స్వింగ్ స్పెషలిస్ట్ గా పిలుస్తారు. జనవరి 6, 2013న పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్ లో నాలుగు మేడిన్ ఓవర్స్ చేసి రికార్డు సృష్టించాడు. అదే ఏడాది టెస్ట్ ల్లో కూడా ప్రవేశించాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించి పదేళ్లు అయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని సాహసపూర్ షమీ జన్మస్థలం. తండ్రి ఒక రైతు. పెద్ద కుటుంబం, కానీ షమీ తండ్రి కూడా ఒక క్రికెటరే. పదిహేనేళ్ల వయసులో షమీ బౌలింగ్ యాక్షన్ చూసి 22 కిమీ దూరంలో ఉన్న మొరాదాబాదులోని క్రికెట్ కోచ్ బద్రుద్దీన్ సిద్దిక్ వద్దకు తీసుకెళ్లాడు. అతని శిక్షణలో రాటు దేలాడు.

భారతదేశంలో ఉన్న దరిద్రపు రాజకీయాల కారణంగా అండర్ 19లో సెలక్ట్ కాలేదు. ఇక అక్కడ నుంచి తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో కోల్ కత్తా వెళ్లాడు. అక్కడ క్లబ్ క్రికెట్ ఆడుతూ కష్టాలు పడి చివరికి ఈడెన్ గార్డెన్ లో ఇండియన్ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి ప్రాక్టీస్ బౌలర్ గా వెళ్లాడు. షమీలోని బౌలింగ్ యాక్షన్, ఇన్ స్వింగ్ డెలివరీస్ చూసి సెలక్టర్లకు తన ఆటతీరుని గమనించమని చెప్పాడు.

మొత్తానికి గంగూలీ అండతో బెంగాల్ రంజీ జట్టులో స్థానం సంపాదించాడు. అలా పడుతూ లేస్తూ ఎట్టకేలకు 2013లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటికి 64 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 229 వికెట్లు, 100 వన్డేలు ఆడి 194 వికెట్లు, 23 టీ20 లు ఆడి 24 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో బెస్ట్ బౌలింగ్ 56 పరుగులకి 6 వికెట్లు, వన్డేల్లో తాజాగా కివీస్ తో జరిగిన సెమీస్ లో 57 పరుగులకి 7 వికెట్లు, టీ 20లో 15 పరుగులకి 3 వికెట్లు తీసుకుని చక్కని గణాంకాలతో దూసుకెళుతున్నాడు.

ఇప్పుడు ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో అందరి దృష్టి మహ్మద్ షమీపైనే ఉంది. అంచనాలు తనకి తనే పెంచేశాడు. ఇప్పుడు వాటిని నిలబెట్టుకోవడానికి తన శక్తికి మించి ప్రయత్నించాల్సి ఉంది.
అయితే షమీని చూసి యువ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ కూడా వికెట్లు తీయడానికి అద్భుతంగా ప్రయత్నిస్తున్నాడు. టెన్షన్ లేకుండా బౌలింగ్ చేస్తున్నాడు.

బూమ్రాపై 90 శాతం ఒత్తిడి తగ్గిపోయింది. దాంతో తను స్వేచ్ఛగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తున్నాడు. ఇలా పేస్ త్రయం ఇంత విజయవంతం కావడానికి షమీ ఇన్సిపిరేషన్ కదా కారణం.. షమీ బౌలింగ్ ని ఆస్ట్రేలియా బ్యాటర్లు పసిగడుతున్నారు. ఎలా ఆడాలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. విషయం తెలిసిన షమీ ప్లాన్ బీ తో సిద్దమవుతున్నాడు. ఒకవేళ బాల్ స్వింగ్ కాకపోతే పిచ్ పరిస్థితిని బట్టి బౌలింగ్ చేస్తూనే వికెట్లు ఎలా తీయాలనే దాని పైన ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్వింగ్ కాకపోయినా బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని క్యాచ్ వెళ్లే అవకాశం ఉండే లెంగ్త్ లో బంతులు వేస్తానని షమీ విశ్వాసం వ్యక్తం చేసాడు.

మరింకెందుకు ఆలస్యం. మనం కూడా షమీకి ఆల్ ది బెస్ట్ చెబుదాం. ఫైనల్ లో విజయం సాధించి వన్డే క్రికెట్ చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించే ఆ క్షణాల కోసం ఎదురుచూద్దాం.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×