EPAPER
Kirrak Couples Episode 1

IND Vs AFG Third T20 : డబుల్ సూపర్ ఓవర్.. టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ..!

IND Vs AFG Third T20 : డబుల్ సూపర్ ఓవర్.. టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ..!

IND Vs AFG Third T20 : ప్రపంచ క్రికెట్ చరిత్రలో రెండు సార్లు సూపర్ ఓవర్‌కి వచ్చిన తొలిమ్యాచ్ గా ఆఫ్గాన్ తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ నిలిచింది. మొదట టీమ్ ఇండియా 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అందుకు బదులుగా ఆఫ్గనిస్తాన్ కూడా పోరాడింది. తాము కూడా 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 212 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. అలా సూపర్ ఓవర్ వరకు వెళ్లింది.


అలా తొలి సూపర్ ఓవర్ లో ఆఫ్గనిస్తాన్ 16 పరుగులు చేసింది. ఇండియా అక్కడ కూడా 16 పరుగులే చేసింది. దాంతో సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. అలా రెండో సూపర్ ఓవర్ కి మ్యాచ్ వెళ్లింది. ఈసారి మొదట టీమ్ ఇండియా బ్యాటింగ్ చేసి 2 వికెట్ల నష్టానికి 11 పరుగులే చేసింది. తర్వాత ఆఫ్గాన్ 1 పరుగు మాత్రమే చేసి 2 వికెట్లు నష్టపోయింది.

దీంతో టీమ్ ఇండియా డబుల్ సూపర్ ఓవర్ లో విక్టరీ సాధించి చరిత్ర సృష్టించింది. 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తానికి ఆఫ్గానిస్తాన్ కూడా అద్భుతంగా ఆడిందనే చెప్పాలి. గట్టి పోరాట పటిమను ప్రదర్శించారు. కాకపోతే వీరుల ముందు తలవంచారు.


బెంగళూరులో ఆఫ్గాన్ తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ మొదలైన దగ్గర నుంచి సంచలనాలతోనే మొదలైంది. టీమ్ ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది. ప్రారంభంలోనే యశస్వి జైశ్వాల్ (4) వికెట్ ని కోల్పోయింది. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. తొలి రెండు టీ 20ల్లో ఇరగదీసి నాటౌట్ గా నిలిచిన శివమ్ దుబె (1) ఈసారి నిరాశపరిచాడు. అతికష్టమ్మీద స్థానం సంపాదించుకున్న సంజూశాంసన్ (1) వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేక పోయాడు. అప్పటికి 4.3 ఓవర్లలో టీమ్ ఇండియా స్కోరు 4 వికెట్లకి 22 పరుగులు మాత్రమే.

ఇక అయిపోయింది రా మ్యాచ్ అనుకున్నారందరూ… ఆ సమయంలో వచ్చాడు బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ (69 నాటౌట్), కెప్టెన్ రోహిత్ శర్మకి సంపూర్ణ మద్దతిచ్చాడు. మొదటి 34 బాల్స్ లో కేవలం 28 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ, ఆ తర్వాత తానెదుర్కొన్న చివరి 35 బంతుల్లో ఏకంగా 93 రన్స్ చేసి పారేశాడు. కేవలం 69 బాల్స్ లో 8 సిక్స్ లు, 11 ఫోర్ల సాయంతో 121 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంటే ఊచకోత ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. టీ 20లో రోహిత్ శర్మ అయిదో సెంచరీ చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

మరోవైపున రింకూ సింగ్ 39 బాల్స్ లో 6 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరూ 5 వికెట్ కి 190 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి మరో రికార్డ్ సృష్టించారు. ఆఫ్గాన్ బౌలింగ్ ని వీరిద్దరూ ఎడాపెడా వాయించి పారేశారు. చివరికి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి టీమ్ ఇండియా 212 పరుగులు చేసింది.

ఆఫ్గాన్ బౌలింగ్ లో ఫరీద్ అహ్మద్ 3, ఓమర్ జాయ్ 1 వికెట్ తీశారు.

213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గనిస్తాన్ చాలా ఆత్మవిశ్వాసంతో ఆడింది. 11 ఓవర్ల వరకు వికెట్ పడలేదంటే  ఓపెనర్లు ఎంత జాగ్రత్తగా ఆడారో అర్థమవుతోంది. 93 పరుగుల వద్ద తొలి వికెట్ గుర్బాజ్ రూపంలో పడింది. 32 బాల్స్ లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో తను 50 పరుగులు చేశాడు. అలా టీమ్ ఇండియాకి కులదీప్ యాదవ్ బ్రేక్ ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (50) చేసి అవుట్ అయ్యాడు.

గుల్బదిన్ నయిబ్ టీమ్ ఇండియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 23 బంతుల్లో 4 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తర్వాత మహ్మద్ నబీ 16 బంతుల్లో చకచకా 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరికి ఆఫ్గాన్ కూడా 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 212 పరుగులే చేసింది.

దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 16 పరుగులు చేసింది. 17 పరుగుల లక్ష్యం సాధించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి వచ్చారు. రోహిత్ శర్మ రెండు సిక్స్ లు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. కానీ యశస్వి బ్యాట్ కనెక్ట్ కాకపోవడంతో వీళ్లు కూడా 16 పరుగులే చేశారు. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది.

తర్వాత మ్యాచ్ రెండో సూపర్ ఓవర్ కి వెళ్లింది. అక్కడ మొదట టీమ్ ఇండియా బ్యాటింగ్ చేసింది. ఈసారి రోహిత్ శర్మతో పాటు, రింకూ సింగ్ వచ్చాడు. రోహిత్ శర్మ మూడు బాల్స్ ఆడి ఒక సిక్సర్, ఒక ఫోర్ కొట్టి, ఒక సింగిల్ తీసి రింకూ కి స్ట్రయికింగ్ ఇచ్చాడు. తాను ఆడిన తొలి బంతికే కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ సింగిల్ తీశాడు. కానీ రోహిత్ శర్మ రన్ అవుట్ అయ్యాడు. దీంతో టీమ్ ఇండియా 11 పరుగులు మాత్రమే చేయగలిగింది.  

దీంతో 12 పరుగుల లక్ష్యంతో ఆఫ్గనిస్తాన్ బ్యాటింగ్ కి వచ్చింది. రోహిత్ శర్మ ఈసారి బాల్ ఎవరికిస్తాడని అంతా చూస్తుంటే రవి బిష్ణోయ్ కి ఇచ్చాడు.  ఆ ఎత్తుగడ ఫలించింది. ఆఫ్గాన్ బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ అయిపోయారు. 1 పరుగు వద్ద 2 వికెట్లు పడిపోయాయి. దీంతో టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. రోహిత్ శర్మ అంటే ఏమిటో ప్రపంచానికి మరోసారి తెలియజేశాడు.

Related News

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

Big Stories

×