Huge victory for Sri Lanka :ఐపీఎల్ సీజన్‌లో పడి మిగతా క్రికెట్‌ను పట్టించుకోవడం లేదు గానీ.. పాకిస్తాన్-న్యూజిలాండ్, శ్రీలంక-ఐర్లాండ్ మధ్య సిరీస్‌లు జరుగుతున్నాయి. పాక్ కెప్టెన్ బాబర్ సెంచరీలతో కదం తొక్కుతున్నాడు. ఇక ఐర్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక భారీ విక్టరీ కొట్టింది.
ఐర్లాండ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో శ్రీలంకకు ఇదే అతి భారీ విజయం. ఇప్పటి వరకు జింబాబ్వేపై ఉన్న విజయమే అతి పెద్దది. 2004లో ఇన్నింగ్స్ 254 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. పైగా ఈ మ్యాచ్‌లో నలుగురు సెంచరీలు చేశారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించింది శ్రీలంక.
ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌ను 591/6 స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. కెప్టెన్ కరుణరత్నే ఏకంగా 179 పరుగులు చేశాడు. కుశాల్ మెండిస్ 140 పరుగులు చేశారు. ఇక దినేశ్ చండీమాల్ 102 పరుగులు, సమరవిక్రమ 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
బౌలింగ్‌లోనూ శ్రీలంక రెచ్చిపోయింది. ప్రభాత్ జయసూర్య ధాటికి ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలోఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ 168 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మూడు రోజుల్లోనే మ్యాచ్ సుఖాంతం అయింది. జయసూర్య తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. రమేశ్ మెండిస్ తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. రెండో టెస్ట్ ఏప్రిల్ 24 నుంచి జరుగుతుంది.