Ex Pakistan Captain Inzamam Allegations on Team India: మళ్లీ మొదలెట్టేశార్రా బాబూ వీళ్లంతా అని.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా దూసుకుపోవడానికి అక్కడ పాక్ క్రికెటర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. టీమ్ ఇండియాపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నెట్టిల్లు వేడెక్కిపోతోంది.
అత్తగారు కొట్టినందుకు కాదు.. తోడి కోడలు నవ్వినందుకు.. అన్నచందంగా మారిపోయింది వ్యవహారం. పాకిస్తాన్ ఆటగాళ్లు ఓడిపోయి బాగానే ఉన్నారు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. భార్య పిల్లలతో కలిసి షికార్లు కొడుతూ విదేశాల్లోనే తిరుగుతున్నారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్టు.. ఆటగాళ్లు, బోర్డుకి లేని బాధ మాజీ క్రికెటర్ ఇంజమామ్ కి ఎందుకంటున్నారు.
విషయం ఏమిటంటే.. పాక్ క్రికెట్ లో గతంలో ఒక వెలుగు వెలిగిన మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఎవరో అంటే ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక సీనియర్ క్రికెటర్ అయి ఉండి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మొన్నటి వరకు చీఫ్ సెలక్టర్ గా ఉన్న తను ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు.
Also Read : ఆఫ్గాన్ ఛీటింగ్ పై.. ఐసీసీ సీరియస్
ఇంతకీ తనేమంటున్నాడంటే ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టీమ్ ఇండియా బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందని ఆరోపించాడు. సాధారణంగా పాత బంతితో రివర్స్ స్వింగ్ వస్తుందని, కానీ ఇక్కడ కొత్త బంతితో ఎలా వచ్చింది? అని ప్రశ్నించాడు. భారత్ బౌలర్లపై దృష్టి పెట్టాలని అంపైర్లకు సూచించాడు. వారిని ఒక కంట కనిపెట్టండి అని కూడా అన్నాడు.
దీంతో నెట్టింట ఇంజమామ్ ని భారతీయులు ఒక ఆట ఆడుకుంటున్నారు. నీకు పేరు రావాలంటే భారత్ మీద ఏడవటం కాదు.. ముందు నీ మీద పడిన మచ్చను చెరుపుకోమని గట్టిగానే డోస్ ఇస్తున్నారు.
Also Read: IND vs Eng T20 World Cup 2024: ఇండియా – ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్.. రసవత్తర పోరు
భారత్‌లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌లో పాక్ జట్టు ఇప్పటిలాగే ఆడి, తిన్నగా ఇంటికెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై అప్పటివరకు పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ గా ఉన్న ఇంజమామ్-ఉల్-హక్ తన పదవికి రాజీనామా చేశాడు. మార్కెటింగ్, వాణిజ్య ప్రమోషన్ల కోసం పలువురు పాకిస్థాన్ ఆటగాళ్లతో ఇంజమామ్ కి వాటాలున్న కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. వీటన్నింటిని నెటిజన్లు తవ్వి, ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.