EPAPER

King Kohli : ఎదురు లేని మొనగాడు.. కింగ్ కోహ్లీ..

King Kohli : ఎదురు లేని మొనగాడు.. కింగ్ కోహ్లీ..

King Kohli : ఆస్ట్రేలియాపై 85, అఫ్ఘాన్ పై 55, బంగ్లాదేశ్ పై103, న్యూజిలాండ్ పై 95, శ్రీలంకపై 88, సౌతాఫ్రికాపై 101, నెదర్లాండ్స్ పై 51, మొన్నటికి మొన్న సెమీస్‌లో కివీస్ పై 117, ఇవన్నీ వన్డే వరల్ట్ కప్ 2023లో ఒకే ఒక బ్యాట్స్ మెన్ చేసినవి. అతనెవరో ఈపాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. అతను మరెవరో కాదు.. వరల్డ్ కప్ క్రికెట్ లో ఎదురులేని మొనగాడు క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ.. భారతదేశానికి దొరికిన ఎన్నో క్రికెట్ ఆణిముత్యాల్లో మేలిమి ముత్యమే విరాట్ కోహ్లీ.


వరల్డ్ కప్ 2023లో ఆడిన 10 మ్యాచ్ లు ఎనిమిదింట 50 ప్లస్ స్కోర్స్ చేశాడు. ఇదొక రికార్డ్ సాధించాడు. ఇప్పటివరకు 711 పరుగులు చేసి నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2003 వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్ లో సచిన్ టెండుల్కర్ సాధించిన 673 పరుగులే ఇంతకాలం అత్యధికంగా ఉన్నాయి. ఇప్పుడది బద్దలైంది. ఇంకా ఫైనల్ మ్యాచ్ మిగిలే ఉంది. అక్కడెన్ని చేస్తాడో తెలీదు. రాబోయే కాలంలో కొన్నేళ్లు ఈ వరల్డ్ కప్ రికార్డులు కొహ్లీ పేరు మీద భద్రంగా ఉండటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటివరకూ 4 వరల్డ్ కప్ లు ఆడిన కొహ్లీ 2011 లో కప్ గెలిచిన టీమ్ లో సభ్యునిగా ఉన్నాడు. అప్పుడు మొత్తం 9 మ్యాచ్ లు ఆడి 282 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ పై సెంచరీ కూడా చేశాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్లు సెహ్వాగ్ డక్ అవుట్ అయ్యాడు. సచిన్ తన కెరీర్ లో ఆఖరి మ్యాచ్ ఆడుతూ 18 పరుగులకే వెనుతిరిగాడు.


ఈ సమయంలో గౌతమ్ గంభీర్ కి అవతలి ఎండ్ లో స్టాండ్ ఇస్తూ వికెట్ల పతనాన్ని ఒక కుర్రాడు ఆపాడు. తను చేసినవి 35 పరుగులే అయినా ఆ క్షణం, ఆ క్లిష్ట సమయంలో అవెంతో విలువైనవనే చెప్పాలి. తనెవరో కాదు.. నేటి పరుగుల వీరాధి వీరుడు విరాట్ కోహ్లీ. అలా వికెట్ల పతనాన్ని ఆపడం వల్ల తర్వాత బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి తగ్గింది. తను అవుట్ కాగానే ధోనీ వచ్చాడు.

గంభీర్ తో కలిసి ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో యువరాజ్ లాంఛనం పూర్తి చేశాడు. ప్రపంచకప్ మన సొంతమైంది. క్రికెట్ దేవుడు సచిన్ కి ఘనంగా వీడ్కోలు పలికారు. 1983 తర్వాత మళ్లీ వరల్డ్ కప్ టీమ్ ఇండియా కొట్టగలదా? అనే సందేహాలకు ధోనీ తెరదించాడు.

2015 వరల్డ్ కప్ విషయానికి వస్తే కొహ్లీ మొత్తం 305 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ పాకిస్తాన్ పై చేసినది ఉంది. కానీ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా విధించిన 328 పరుగులను చేధించలేక 233 పరుగులకి ఆలౌట్ అయి టీమ్ ఇండియా ఇంటి దారి పట్టింది.

2019 వరల్డ్ కప్ కి వచ్చేసరికి 443 పరుగులు చేశాడు. కొహ్లీ కీలకపాత్ర పోషించాడు కానీ, ఒక్క సెంచరీ కూడా రాలేదు. కానీ రోహిత్ శర్మ 5 సెంచరీలు చేసి అల్లాడించాడు. ఒంటిచేత్తో సెమీస్ కి తీసుకెళ్లాడు. తర్వాత అక్కడ ఓడిపోయి ఇంటికొచ్చేశారు.

2023 వరల్డ్ కప్ కి వచ్చేసరికి సినిమా అంతా మారిపోయింది. ఇప్పుడు కొహ్లీ 711 పరుగులతో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియాలో 528 పరుగులతో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. తర్వాత మార్ష్ 426 పరుగులతో ఉన్నాడు. వీరిద్దరూ కూడా ఫైనల్ మ్యాచ్ లో కొహ్లీని అయితే దాటలేరనే అనుకోవాలి. ఎందుకంటే కొహ్లీ కూడా 711 దగ్గరే ఉండిపోడు కదా… ఎన్నో కొన్ని తీస్తాడు. అలా చేస్తే గానీ వార్నర్ డబుల్ సెంచరీ చేయాల్సి ఉంటుంది.

ఇండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ 550 పరుగులతో ఉన్నాడు. తర్వాత శ్రేయాస్ 526 పరుగులతో ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే 2023 వన్డే వరల్డ్ కప్ లో కొహ్లీయే నెంబర్ వన్ అని ఘంటాపథంగా చెప్పవచ్చు.

ఇంతవరకు కొహ్లీ ఆడిన 4 వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో కలిపి 1741 పరుగులు చేసి టాప్ త్రీ లో ఉన్నాడు. అతని ముందు రెండో స్థానంలో రెండు పరుగుల దూరంలో రికీ పాంటింగ్ (1743) ఉన్నాడు.
మొదటి స్థానంలో ఎప్పటిలా సచిన్ (2278) పరుగులతో ఉన్నాడు.

ఫైనల్ మ్యాచ్ లో కొహ్లీ ఎప్పటిలా తన ఫామ్ ని కొనసాగిస్తూ, రోహిత్ శర్మ అందించిన పికప్ ని తీసుకుని ముందుకు తీసుకెళ్లాలి. 45 ఓవర్ వరకు ఒక ఎండ్ లో జూనియర్స్ కి అండగా నిలబడితే మనోళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇండియా బ్యాటర్లు, బౌలర్లు బ్రహ్మాండమైన ఫామ్ లో ఉన్నారు. వీరిని ఎదుర్కొని నిలబడ్డం ప్రస్తుత దేశాల జట్లకి అంత తేలిక కాదు. సీనియర్ మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, శిఖర్ ధావన్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఇలా అందరూ చెప్పే మాట ఒకటే. ఇంతవరకు టీమ్ ఇండియా ఎలాగైతే ఆడి, ఫైనల్ కి వచ్చిందో అలాగే ఆడమని చెబుతున్నారు. అనవసర ప్రయోగాలు చేయవద్దని చెబుతున్నారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×