5G network:- టెలికాం సంస్థలు ఒకటితో ఒకటి పోటీపడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక టెలికాం సంస్థ ఒక ఆఫర్‌ను ప్రకటిస్తే.. దానికి మించిన ఆఫర్‌తో మరో సంస్థ సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం టెలికాం సంస్థలతో పాటు కస్టమర్ల దృష్టి కూడా 5జీ పైనే ఉంది. 5జీ సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అందుకే తాజాగా ఒక దేశ ప్రభుత్వం చొరవ తీసుకొని 5జీ సేవలపై దృష్టిపెట్టింది.
2030 లోపు అందరికీ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని యూకే ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ముందుగా యూకేలోని ఎక్కువగా ప్రజలు ఉన్న ప్రదేశాల్లో స్టాండలోన్ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యూకే ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 4జీ నెట్‌వర్క్ కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను తొలగించి 5జీ సేవల కోసం పూర్తిగా కొత్త కనెక్టివిటీని అందించాలని అనుకుంటోంది. 5జీ ప్లస్ పేరుతో ఒక అండర్‌లయింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది.
ప్రస్తుతం బేసిక్ 5జీ సేవలు యూకేలోని దాదాపు 77 శాతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. 5జీ కనెక్టివిటీని వ్యాప్తి చేయడం కోసం ప్రభుత్వం దాదాపు 150 మిలియన్ యూరోల నిధులను విడుదల చేసింది. ఇందులో మూడోవంతు 5జీ పై ప్రయోగాలు చేయడానికి ఉపయోగించాలని టెక్ నిపుణులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ నిధులలోని 40 మిలియన్ యూరోలు వ్యాపార సంస్థలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో 5జీని పెంపొందించడానికి ఉపయోగించాలని తెలిపింది.
యూకే ప్రభుత్వంతో పాటు టెలికాం సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం వారు హువాయ్ సంస్థకు సంబంధించి ఉపయోగిస్తున్న మౌలిక సదుపాయాలు అన్ని 2027లోపు తీసి పక్కన పెట్టేయాలని యూకే ప్రభుత్వం తెలిపింది. 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చి, వెంటనే 6జీ గురించి కూడా సన్నాహాలు మొదలుపెట్టాలని అనుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పోటీని తట్టుకోవాలంటే ఈ మాత్రం ముందు జాగ్రత్తగా ఉండాలని అంటోంది యూకే ప్రభుత్వం.