Cyber Crimes in IT:టెక్నాలజీ అనేది ఎంతో పెరిగింది. దాంతో పాటు దాని వల్ల సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. టెక్నాలజీ వల్ల జరిగే క్రైమ్‌లను అడ్డుకోవడానికి సైబర్ సెక్యూరిటీ అనేది ఏర్పడింది. కానీ సైబర్ సెక్యూరిటీ కూడా పట్టుకోలేనంత వేగంగా కొందరు సైబర్ నేరగాళ్లు క్రైమ్ చేసి మాయమైపోతున్నారు. దీనికి కారణం మిస్ కమ్యూనికేషన్ అని నిపుణులు బయటపెట్టారు. ముఖ్యంగా ఐటీ రంగంలో జరిగే సైబర్ నేరాలకు ఇదే కారణమని వారు అన్నారు.
భారతదేశంలో ఐటీ సెక్టార్ విషయంలో ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతోంది. కానీ ఐటీ రంగంలోనే దేశవ్యాప్తంగా టాప్ స్థాయిలో ఉన్న దాదాపు 80 శాతం కంపెనీలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. ఇలాంటి సంస్థల్లో కనీసం ఒక్క సైబర్ క్రైమ్ అని జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయని రిపోర్టులు చెప్తున్నాయి. అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన క్యాస్పర్‌స్కై ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టింది.
స్వతంత్ర్యంగా ఆఫీసులో నడుచుకుంటున్న విషయంలోగానీ, పనిచేస్తున్న విషయంలోగానీ సంస్థకు, ఉద్యోగులకు మధ్య విబేధాలు వస్తున్నాయని క్యాస్పర్‌స్కై రిపోర్టులో తెలిపింది. ఈ ఉద్యోగుల్లో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగులు కూడా ఉంటున్నారని తెలిసింది. కార్పరేట్‌లో బిజినెస్ సెక్యూరిటీ దెబ్బతినడానికి ఉన్నతాధికారులకు, సెక్యూరిటీ మ్యానేజ్‌మెంట్ మధ్య తలెత్తుతున్న విబేధాలే కారణమని రిపోర్ట్ చెప్పింది.
డేటా అనేది ఈరోజుల్లో ఎంతో విలువైనది. అందులోనూ ముఖ్యంగా వ్యాపారాల్లో డేటా అంటే ఆ కంపెనీకి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. అలాంటి సమాచారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కంపెనీల బాధ్యత. అలాంటి సమాచారాన్ని కాపాడడానికి ఉద్యోగులపై కాస్త పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం చాలా కంపెనీలకు అర్థం కావట్లేదని క్యాస్పర్‌స్కై అధినేత అన్నారు. చాలావరకు కంపెనీల్లో సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగులు లేకపోవడం, మరికొన్ని కంపెనీల్లో ఉద్యోగులతో విబేధాలు ఉండడం సైబర్ నేరాలకు దారితీస్తుందని ఆయన తెలిపారు.