Nandamuri Balakrishna : ఆహా ఓటిటిలో నందమూరి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాప్ అబుల్’ (Unstoppable 4) టాక్ షోకి ఎంతటి ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ రోజు రోజుకు మారుతున్న ఈ షో తీరు చూస్తే బాలయ్య లాంటి స్టార్ హీరోతో ఇలాంటి పనులు చేయిస్తారా ? అంటూ అభిమానులు మండిపడుతున్నారు.
ఇదివరకు స్టార్ హీరోలతో టాక్ షోలు చేయడానికి ఎవరూ సాహసం చేసేవారు కాదు. ఏవైనా ఇంటర్వ్యూలు లాంటివి జరిగితే యాంకర్స్ ప్రశ్నించడం, గెస్ట్ లుగా వచ్చిన స్టార్ హీరోలు లేదా హీరోయిన్లు డైరెక్టర్లు సమాధానాలు చెప్పడం లాంటివి జరిగేవి. కానీ రోజులు మారే కొద్దీ ఈ ట్రెండ్ కూడా మారుతూ వచ్చింది. ఇలాంటి సాధారణ ఇంటర్వ్యూలకు ఫుల్ స్టాప్ పెట్టి ఏకంగా స్టార్స్ తో టాక్ షోలు ప్లాన్ చేశారు.
నిజానికి స్టార్ హీరోల పర్సనల్ విషయాలు, కాంట్రవర్సీలు వంటివి తెలుసుకోవడానికి జనాలు బాగా ఆసక్తిని కనబరుస్తారు. దాన్నే క్యాష్ చేసుకోవడం మొదలు పెట్టారు ఇటీవల కాలంలో కొంతమంది నిర్మాతలు. అందులో భాగంగానే ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఒక అడుగు ముందుకు వేసి రానా, సమంత, బాలయ్య (Nandamuri Balakrishna) వంటి స్టార్స్ తో టాక్ షోలు ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఆహాలో ముందుగా రానాతో ‘నెంబర్ వన్ యారి’ అంటూ ఈ ట్రెండును మొదలుపెట్టారు.
అది సక్సెస్ ఫుల్ అయ్యాక ‘సామ్ జామ్సాం’ అంటూ సమంతతో మరో కొత్త షోని స్టార్ట్ చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ రెండింటి కంటే ఎక్కువ పాపులర్ అయ్యింది మాత్రం ‘అన్ స్టాపబుల్’ షోనే. బాలయ్య (Nandamuri Balakrishna) లాంటి స్టార్ హీరో నట విశ్వరూపం అప్పటిదాకా తెరపై చూసిన అభిమానులు టాక్ షోలో ఆయన ఎంత సరదాగా ఉంటారో చూసి ఫిదా అయిపోయారు.
అప్పటిదాకా బాలయ్య సీరియస్ గా ఉంటారు, సినిమాలలో అద్భుతంగా నటిస్తారు అనే ఆలోచనలో ఉన్న ప్రేక్షకులు ఆయన ఒక టాక్ షోను చేస్తున్నారు అనగానే అసలు ఇది ఎలా సాధ్యం అంటూ ముక్కున వేలేసుకున్నారు. కానీ బాలయ్య (Nandamuri Balakrishna) షోని అత్యద్భుతంగా నడిపించారు. ఫలితంగా ‘అన్ స్టాపబుల్’ షో సక్సెస్ ఫుల్ గా సీజన్ 4కి చేరుకుంది.
అయితే నిజానికి దీన్ని ఒక సెలబ్రిటీ టాక్ షో గానే ప్రారంభించారు. అందులో భాగంగానే పలువురు స్టార్ హీరోలను పిలిపించి బాలయ్యతో ముచ్చటింపజేశారు. కానీ రోజురోజుకీ ఈ టాక్ షో ప్రమోషన్స్ స్టేజ్ గా మారుతోంది. ఇటీవల కాలంలో కొంత మంది స్టార్ హీరోలు ఈ సినిమాకు ప్రమోషన్ కోసమే రావడం అన్నది నందమూరి అభిమానులకు మింగుడు పడడం లేదు. బాలయ్య (Nandamuri Balakrishna) లాంటి స్టార్ హీరోని సినిమాల ప్రమోషన్స్ కోసం ఇలా వాడడం ఎంతవరకు సమంజసం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ అసంతృప్తి కనక ఎక్కువైతే షోకి పాపులారిటీ తగ్గడంతో పాటు ఇతర ప్రమోషనల్ షోలకు, ఈ టాప్ షోకి పెద్దగా తేడా లేకుండా పోవడం ఖాయం.