Janaka Aithe Ganaka : టాలీవుడ్ యంగ్ స్టార్ సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “జనక అయిత గనక” (Janaka Aithe Ganaka) థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ కు సిద్ధమైంది. అయితే ఓటిటిలో ఆ కొంత మందికి మాత్రం ఈ మూవీ స్పెషల్ కాబోతోంది. మరి ఆ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం పదండి.
సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటించిన సరికొత్త మూవీ ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). సంగీర్తన విపిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ కీలకపాత్రల్లో నటించారు. అక్టోబర్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతుంది. అచ్చ తెలుగు ఓటిటి ఆహా (Aha)లో నవంబర్ 8 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఆహా తమ సబ్ స్క్రైబర్లలో కొంతమందికి ఈ మూవీకి సంబంధించి ఓ స్పెషల్ ఆఫర్ ఇస్తోంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు 24 గంటల ముందే ఈ సినిమాను వీక్షించే స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది ఆహా. అంటే సాధారణ సబ్ స్క్రైబర్ల కంటే గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్న ఆహా సబ్స్క్రైబర్లు అందరికంటే ఓ రోజు ముందే ఈ సినిమాను ఓటిటిలో చూడొచ్చు అన్నమాట.
కథలోకి వెళ్తే… ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) మూవీలో ప్రసాద్ అనే హీరో మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రిపై ఎప్పుడూ కోప్పడుతూ ఉండే ప్రసాద్ అతను తీసుకున్న నిర్ణయాల వల్లే తను ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నానని చిరాకు పడుతూ ఉంటాడు. ఇక ప్రసాద్ పెళ్లి చేసుకుని తన భార్యతో సంతోషంగా ఉంటాడు. కానీ పెళ్లయి రెండేళ్లు గడుస్తున్నా పిల్లలు మాత్రం వద్దు అనుకుంటాడు. ఇంట్లో వాళ్ళు అడిగినా, నచ్చజెప్పినా అస్సలు పట్టించుకోడు. పైగా ఇప్పుడు పిల్లలంటే కోటికి పైన ఖర్చవుతుంది ఒక్కొక్కరికి అంటూ లెక్కలు చెప్తాడు. వాళ్ళ చదువులు, పెళ్లిళ్లు, పెళ్ళానికి వైద్యం ఇప్పించలేనప్పుడు పిల్లల్ని కనడం వేస్ట్ అనేది ప్రసాద్ ఒపీనియన్. ఇక భార్య కూడా ఎంత మంచిదంటే అతడు ఏం చెప్తే దానికే సరే అంటుంది. ఈ నేపథ్యంలోనే ఓ రోజు సడన్ గా ప్రసాద్ కి తను ప్రెగ్నెంట్ అంటూ భార్య సర్ప్రైజ్ ఇస్తుంది. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడానికి కారణం తను వాడుతున్న కండోమ్ లో క్వాలిటీ లేకపోవడం అనే ఆలోచనతో అతను కండోమ్ కంపెనీపై కోర్టుకు ఎక్కుతాడు. అంతేకాకుండా తనకు పుట్టబోయే బిడ్డను పెంచి పోషించడానికి సదరు కంపెనీ నుంచి కోటి నష్టపరిహారాన్ని కోరుతాడు. మరి ఈ కేసులో ప్రసాద్ కు కోటి పరిహారం అందిందా? చివరకు ప్రసాద్ తండ్రి అయ్యాడా? ఈ కేసులో గెలిచాడా? అనే విషయాలను తెరపై చూడాల్సిందే.