Wrestlers: బీజేపీ ఎంపీ, WFI ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా అగ్రశ్రేణి రెజ్లర్లు వారాల తరబడి పోరాడుతున్నారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఆఖరికి తమకొచ్చిన పతకాలు గంగానదిలో కలిపేస్తామన్నా.. నో యాక్షన్. అయినా, తగ్గేదేలే అంటూ.. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకునే వరకూ వదిలేదేలే అంటూ ఉద్యమిస్తున్నారు బాధిత రెజ్లర్లు.
బ్రిజ్‌భూషణ్‌పై గత నెలలో నమోదైన రెండు FIRలు తాజాగా వెలుగు చూశాయి. ఆయన అరాచకాలపై రెజ్లర్లు సంచలన ఆరోపణలే చేశారు. తమను ఎంత దారుణంగా వేధించారో తెలుపుతూ.. ఏడుగురు మహిళా రెజ్లర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ రోజు ఓ మహిళా రెజ్లర్‌ను ఆఫీసులోకి పిలిచి.. ఆమె టీ-షర్ట్ పట్టుకుని లాగాడట. శ్వాస చెక్ చేస్తున్నానంటూ.. ఆమె ఛాతీపై, పొట్టపై అభ్యంతరకరంగా తాకాడని ఫిర్యాదులో తెలిపింది. ఇంకోసారి ఓ పదార్థం తీసుకొచ్చి తినమని తనను బలవంతం చేశాడని కంప్లైంట్ చేసింది.
కోచ్ లేని సమయంలో తమ దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని ఓ అవార్డ్ విన్నింగ్ రెజ్లర్ ఆరోపించింది. విదేశాల్లో జరిగిన పోటీల్లో తాను గాయపడ్డానని.. అప్పుడు బ్రిజ్‌భూషణ్ వచ్చి.. తన కోరిక తీరిస్తే వైద్య ఖర్చులన్నీ ఫెడరేషనే భరిస్తుందని చెప్పాడని మరో రెజ్లర్ కంప్లైంట్. సెల్ఫీ తీసుకుందామంటూ తనను బలవంతంగా గట్టిగా హగ్ చేసుకున్నారంటూ ఇంకో రెజ్లర్ల ఆరోపణ.
బ్రిజ్‌భూషణ్‌కు భయపడి మహిళా రెజ్లర్లు ఎప్పుడూ గుంపుగానే ఉండేవారట. అయినా, తమ నుంచి ఎవరో ఒకరిని వేరుగా తీసుకెళ్లి అభ్యంతరకర ప్రశ్నలు అడిగేవాడని.. డబుల్ మీనింగ్‌తో మాట్లాడేవాడని.. ఫిర్యాదులో తెలిపారు ఆ మహిళా రెజ్లర్లు. ఇలా 15కు పైగా లైగింక వేధింపు ఘటనలు జరిగాయని.. 10 సార్ల వరకూ అభ్యంతరకరంగా తాకడం చేశాడని.. రెండుసార్లు నేరుగా కోరిక తీర్చమని డిమాండ్ చేశాడని.. బ్రిజ్ భూషణ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను బట్టి తెలుస్తోంది.
WFI సెక్రటరీ వినోద్ తోమర్‌పైనా ఓ రెజ్లర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తాను ఢిల్లీలోని డబ్ల్యూఎఫ్‌ఐ ఆఫీసుకు వెళ్లినప్పుడు.. తోమర్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని.. గదిలో అందర్నీ బయటకు పంపించి.. తనను బలవంతంగా ఆయనవైపు లాక్కొన్నాడని పోలీసులకు చెప్పింది. ఇలా, ఆరుగుగు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు.
మరోవైపు, ఓ మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం ప్రకారం రెండో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ రెజ్లర్ ఓ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నప్పుడు బ్రిజ్ భూషణ్ ఆమెను పిలిచి.. తన కోరిక తీర్చితే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కొనిస్తానన్నాడని తెలిపింది. ఆ తర్వాత కూడా అతని గదికి పిలిపించుకుని.. బెడ్ మీద కూర్చునేలా చేశాడని.. బలవంతంగా కౌగిలించుకున్నాడని.. కొన్నేళ్ల పాటు అలా తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు జాతీయ మీడియాలో పలు కథానాలు వచ్చాయి.
అటు, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను బ్రిజ్‌భూషణ్ ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే ఉన్నాడు. దమ్ముంటే రెజ్లర్లు చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తున్నాడు. తన తప్పు ఉన్నట్టు తేలితే.. ఉరేసుకోవడానికైనా రెడీ అంటున్నాడు.