Two Trains Collided in West Bengal : పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్ పాయ్ గుడిలో రెండు రైళ్లు బలుదేరిన కొంత సమయానికే ఢీకొనడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. గూడ్స్ రైలును కాంచనజంగ ఎక్స్ ప్రెస్ రైలును ఢీ కొట్టింది. ఈ పెను ప్రమాదంలో రైలు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన పలువురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
15 మంది మృతి.. చెల్లాచెదురుగా బోగీలు
అస్సాం సిల్చార్- కోల్‌కతా సీల్దా మధ్య నడుస్తున్న కాంచనజంగా ఎక్స్ ప్రెస్ రైలును గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఎదురెదురుగా ఢీ కొన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన రంగపాణి – నిజ్బారి స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. 60 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాద తీవ్రతకు ఎక్స్ ప్రెస్ రైలు బోగీ ఏకంగా గాల్లోకి లేచింది.
కొనసాగుతున్న సహాయక చర్యలు
రెండు రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడిన క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సీఎం దిగ్భ్రాంతి
రైలు ప్రమాదం జరిగిందనే విషయం తెలుసుకున్న సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణంపై రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
రైలు ప్రమాదం బాధాకరం: రైల్వే మంత్రి
రైలు ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదం బాధాకరమన్నారు. ప్రమాదం స్థలం వద్ద యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సమన్వయంతో సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలన్నారు.
ఏడాదిలో నాలుగు రైలు ప్రమాదాలు
దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ రోజు బెంగాల్‌లో జరిగిన ఘటనతో ఏడాది కాలంలో ఇది నాలుగో రైలుప్రమాదం. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలసోర్ వద్ద జరిగిన అతిపెద్దరైలు ప్రమాదంలో 293 మంది మృతి చెందారు. అదే ఏడాది అక్టోబర్‌లో ఏపీలోని విజయనగరంలో రెండు రైళ్లు ఢీ కొనడంతో 14 మంది చనిపోయారు. ఈనెల 2న పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహెబ్ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.
రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా
తొలుత ప్రధాని నరేంద్రమోదీ మృతుల కుటుంబాలకు.. పీఎం జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులు ఒక్కొక్కరికి రూ.50 వేలు ప్రకటించారు. ఆ తర్వాత.. మృతుల ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
#WATCH | Goods train rams into Kanchenjunga Express train in Darjeeling district in West Bengal, several feared injured
Details awaited. pic.twitter.com/8rPyHxccN0
— ANI (@ANI) June 17, 2024