ECI Congress Haryana | హర్యాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. హర్యాణా ఎన్నికల్ల అవతవకలు జరగలేదని, కాంగ్రెస్ కు నిరాధారమైన ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని ఎన్నికల కమిషన్ కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యలు చేసింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ పై మరోమారు విమర్శలు చేసింది. ఎన్నికల కమిషన్ పనిచేయడంలో పక్షపాత ధోరణి అద్భుతంగా ఉందని చురకలు అంటిస్తూ.. ఎన్నికల కమిషన్ స్పందించిన తీరుపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాల్సి వస్తుందని కాంగ్రెస్ నవంబర్ 1న ఓ లేఖ రాసింది.
ఎన్నికల కమిషన్ హర్యాణా ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీని హేళనగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఎన్నికల కమిషన్ తీరు ఇలాగే కొనసాగితే రికార్డుల నుంచి తొలగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని లేఖలో పార్టీ పేర్కొంది.
“సాధారణంగా ఎన్నికలు జరిగిన తరువాత ఎక్కడైనా అవతవకలు జరిగినట్లు అనుమానం కలిగినా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని కానీ ఈసారి ఎన్నికల కమిషన్ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకొని అవమానకర విధంగా తమ ఆరోపణలపై స్పందించదిన చెబుతూ.. తాము ఎన్నికల పూర్తి అయిన తరువాత జరిగిందేదో జరిగిపోయింది. అని దాన్ని వదిలేస్తాం. కానీ ఎన్నికల కమిషన్ తీరుతో నిరాశ చెంది ఈ లేఖ రాయాల్సిన అవసరమొచ్చింది.” అని కాంగ్రెస్ పార్టీ అధిష్థానం లేఖలో తెలిపింది.
Also Read : ‘ఇక లగేజిపై ఫైన్ విధిస్తాం’.. రైల్వేశాఖ కీలక ప్రకటన
కాంగ్రెస్ పార్టీ హర్యాణా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సమయంలో ఈవిఎం మెషీన్లలో 99 శాతం బ్యాటరీ స్టేటస్ ఎలా డిస్‌ప్లేలో చూపిస్తోందని? ఎత్తిచూపుతూ.. దీన్ని బట్టి ఎవరో ఓట్ల లెక్కింపునకు ముందే ఈవిఎంల వద్దకు వెళ్లారని అనుమానాలు వ్యక్తం చేసింది. కానీ ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి ఎన్నికలు జరిగిన తరువాత బాధ్యరహితంగా ఫిర్యాదులు చేయడం.. అనుమానాలు వ్యక్తం చేయడం అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యలు చేసింది.
ఈసి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖలో ఇలా ఉంది. “ఎన్నికల సంఘం న్యాయమూర్తి లాంటిది. ఏదైనా సమస్యలుంటే వాటిపై విచారణ జరిపించాలి. అంతే కానీ పార్టీలను విలన్లుగా రాక్షసులుగా చిత్రీకరిచడం ఏంటి? ఈసీ ఇలాగే వ్యవహరించడం కొనసాగితే.. చట్టం ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. పక్షపాతంగా వ్యవహరించడంలో ఈసీ పనితీరు అద్భుతంగా ఉంది. ఇంతవరకు తాము ఈవిఎంలలో బ్యాటరీ స్టేటస్ డిస్‌ప్లే గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కేవలం మేము ఎత్తిచూపిన సమస్యను కేవలం నిరాధారమైన ఫిర్యాదు గా వర్గించింది?” అని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది.
హర్యాణా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కాంగ్రెస్ సులువుగా ఎన్నికలు సాధిస్తుందని అన్ని మీడియా ఛానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. ఫలితాలు వెల్లువడ్డాక కాంగ్రెస్ కంటే బిజేపీకి ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. ఆ తరువాత హర్యాణాలో బిజేపీ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బిజేపీ నాయకుడు నాయబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.