Under Water Metro : భూఉపరితలానికి 32 మీటర్లలోతు. నదీగర్భంలో 520 మీటర్ల సొరంగ మార్గం. ఆ రూట్ లో మెట్రో రైలు 45 సెకన్లలో దూసుకెళ్లింది. దేశంలోనే తొలిసారిగా నది లోపల మైట్రో రైలు విజయవంతంగా నడిచింది. కోల్‌కతా మెట్రో రైల్వే సంస్థ ఈ ఘనత సాధించింది. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో.. కోల్‌కతాలోని మహాకరణ్ స్టేషన్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు రైలును నడిపారు.
కోల్‌కతా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ ఉదయ్‌కుమార్ రెడ్డి, ఇంజినీర్లు, అధికారులు నదీ గర్భంలో మెట్రో ప్రయాణం చేశారు. కోల్‌కతా సహా నగర శివారు ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందించాలన్నదే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇదో చారిత్రక ఘట్టంగా కోల్‌కతా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ ఉదయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇందుకోసం కోల్‌కతా మెట్రో సిబ్బంది ఎంతో శ్రమించారని ప్రశంసించారు. హావ్‌డా మైదాన్-ఎస్ప్లెనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్ రన్‌ను 7 నెలలపాటు కొనసాగిస్తామన్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో మెట్రో సర్వీసులను హుగ్లీ నదిలోని సొరంగమార్గం గుండా అందుబాటులోకి తీసుకొస్తారు.
అండర్ గ్రౌండ్ లో రైళ్లు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఫిల్లర్లపై ట్రాకులు వేసి మెట్రో రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నదీగర్భంలోనూ సొరంగమార్గం ఏర్పాటు చేసి రైలు ట్రయల్ రన్ విజయవంతం చేశారు. ఈ మార్గంలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుస్తున్నారు.
కోల్‌కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలుమార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించనుంది. సొరంగ అంతర్గత అడ్డుకొలత 5.55 మీటర్లు. బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. లండన్-ప్యారిస్ కారిడార్‌లోని యూరోస్టార్ సర్వీసు మాదిరిగా ఈ మార్గం రూపుదిద్దుకుంది.