Udhayanidhi Stalin | తమిళనాడులో మళ్లీ భాషా రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ .. దక్షిణాది సినిమా పరిశ్రమలు కళకళలాడుతూ ఉన్నాయని.. మరోవైపు గుజరాతీ, మరాఠీ, బిహారీ, భోజ్‌పూరీ, హర్యాణ్వీ లాంటి ఉత్తరాదిల ప్రాంతీయ భాషలు.. హిందీ వల్ల తమ ప్రభావం కోల్పోతున్నాయని అన్నారు. శనివారం తమిళనాడు డిప్యూటీ సిఎం ఉదయనిధి స్టాలిన్.. కేరళలోని కోజికోడ్ నగరంలో జరిగిన మనోరమ హోర్టస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కోజికోడ్ లో జరిగిన మనోరమ సాహిత్య వేడుకలు (లిటరరీ ఫెస్టివల్) కు వేలల్లో జనం హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఉదయనిధి స్టాలిన్ హాజర్యాయారు. కార్యక్రమంలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ.. “మీరందరూ ఒకసారి భారతదేశంలోని అన్ని ప్రాంతీయ భాష సినిమాలను గమనించండి. ఉత్తర భారతదేశంలో ఏదైనా ప్రాంతీయ భాష చిత్రాలకు దక్షిణాదితో పొలిన ఆదరణ లభిస్తోందా?.. దక్షిణాదిలో అన్ని సినీ పరిశ్రమలు కళకళలాడుతూ ఉన్నాయి. సినిమా అనేది భాషను, సంప్రదాయాలన్ని కాపాడుతోంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో అది జరగడం లేదు. ఎందుకంటే వాళ్లు తమ ప్రాంతీయ భాష కంటే హిందీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
Also Read: ’10 రోజుల్లో సిఎం రాజీనామా చేయాలి లేకపోతే లేపేస్తాం’.. పోలీసులకు ఫోన్ చేసిన క్రిమినల్స్
మీరు గమనించండి.. మరాఠీ, బిహారీ, భోజ్‌పూరీ, హర్యాణ్వీ, గుజరాతీ ఇలా ఏ ఉత్తరాది భాషా సినిమాలైనా తమిళ, కన్నడ, తెలుగు, మలయాళం సినిమాలంత ఆదరణ పొందుతున్నాయా? ఎందుకంటే సినిమా ద్వారా మన భాషను, మన సంప్రదాయాలను మేము కాపాడుకుంటున్నాం. ఒకవేళ మనం మన ప్రాంతీయ భాషలను కాపాడుకోవడంలో విఫలమైతే. హిందీ భాష మనకు గుర్తింపు లేకుండా చేస్తుంది. కావాలంటే చూడండి ఉత్తరాదిలో అందరూ హిందీ సినిమాలే ఎక్కువగా చూస్తారు. బాలీవుడ్ లో మాత్రమే పెద్ద సినిమాల నిర్మాణం జరుగుతుంది. ” అని చెప్పారు.
తమిళంలో తన తాత కరుణానిధి సినిమా పరాశక్తి వల్ల తమిళ చిత్రపరిశ్రమ రూపురేఖలే మారిపోయాయని గుర్తచేస్తూ.. కేరళలో కూడా మలయాళం సినీ పరిశ్రమ ఎంతో అభివృద్ధి సాధించిందని కొనియాడారు. తనకు మలయాళం సినిమాలంటే చాలా ఆసక్తి అని చెప్పారు.
కార్యక్రమంలో ఉదయనిధి సినిమాలు, భాషా ప్రాధాన్యంతో పాటు మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష నీట్ ని కూడా నిషేధించాలని అన్నారు. నీట్ పరీక్ష సంస్కృతం లాంటిదని వ్యాఖ్యానించారు. వంద సంవత్సరాల క్రితం ఎవరైనా భారతదేశంలో వైద్యం నేర్చుకోవాలంటే ముందు సంస్కృతం నేర్చుకోవాలనే కండీషన్ ఉండేదని.. దాని వల్ల వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగేదని చెప్పారు. 1920 లో మద్రాస్ యూనివర్సిటీలో పనిచేసే సంస్కృత ప్రొఫెసర్ కు రూ.200 నెల జీతం ఉంటే.. తమిళం బోధించే ప్రొఫెసర్ కు కేవలం రూ.70 ల వేతనం లభించేదని తెలిపారు.
ఈ వివక్షకు వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమ పోరాటం జరిగిందని.. ఇప్పుడు మళ్లీ దక్షిణాది రాష్ట్రాలు మళ్లీ ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.