Stalin Thalapathy Vijay| తమిళనాడు రాజకీయాల్లో ఎఐఎడిఎంకె అధినేత్రి తలైవి జయలలిత మరణం తరువాత ఏర్పడిన శూన్యాన్ని అవకాశంగా తీసుకొని కొత్త పార్టీ పెట్టిన ప్రముఖ నటుడు విజయ్‌పై ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సెటైర్ వేశారు. సోమవారం తమిళనాడులోని కొలత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఒక సభలో ప్రసంగిస్తూ విజయ్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేశారు.
కొలత్తూర్ సభలో 71 ఏళ్ల సిఎం స్టాలిన్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ఎవరైనా కొత్త పార్టీ పెడితే.. దాని ఉద్దేశం డిఎంకెని నాశనం చేయడనమే ఉంటుంది. ఎందుకంటే డిఎంకె పార్టీ అభివృద్ధిని చూసి వారు ఓర్వలేరు. అలా కొత్త పార్టీ పెట్టే వాళ్లకు నేను ఒకటే చెబుతున్నా.. గత నాలుగేళ్లలో డిఎంకె ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి గురించి ఆలోచించాలి. కొత్త పార్టీలు పెడితే నాకు ఏ ఇబ్బంది లేదు. ప్రజలకు మంచి చేయడమే మా పార్టీ పని.. ఆ దిశగానే మా ప్రయాణం ఉంటుంది. కొత్త పార్టీలు, ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ.. సమయం వృధా చేయడం మాకు ఇష్టం ఉండదు” అని ఆయన అన్నారు.
అంతకుముందు కొత్త పార్టీ తమిళ వెట్రి కళగం (టివికె) అధ్యక్షుడు తలపతి విజయ్ ఆదివారం ఒక సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకె పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సెకులరిజం, సామాజిక న్యాయం కోసమే పార్టీ స్థాపించానని ప్రకటించిన విజయ్.. తమిళనాడు ప్రభుత్వం కుల గణన చేపట్టాలని, రాష్ట్రలంలో శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని, కల్తీ సారా అమ్మకాలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
Also Read: 29 మంది పిల్లలకు ఉరిశిక్ష!.. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధింపులు..
తమిళనాడులో యువత డ్రగ్స్ లాంటి ప్రమాదకర వ్యసనం బారిన పడుతున్నారని.. డిఎంకె ప్రభుత్వం ఇలాంటి సమస్యలను పరిష్కరించకుండా అధికారంలో ఉన్న కొందరు రాజకీయ నాయకుల సంక్షేమం కోసం పనిచేస్తోందని తలపతి విమర్శించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పార్టీ నాయకులు ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తున్నారని విజయ్ నిలదీశారు.
రాష్ట్రంలో పాల ధరలు, ఆస్తి పన్ను, కరెంటు బిల్లులు పెంచేసి సామాన్యులపై భారం మోపంలో డిఎంకె అభివృద్ధి కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
టివికె పార్టీ జిల్లా స్థాయి నాయకులతో విజయ్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. బిజేపీ, డిఎంకెకు వ్యతిరేకంగా మొత్తం 26 అంశాల్లో నిలదీయాలని పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో చెప్పారు.
అక్టోబర్ 27, 2024 తలపతి విజయ్ అధికారికంగా టివికె పార్టీ స్థాపించారు. ద్రవిడ ఉద్యమ నాయకుడు పెరియార్ ఈవి రామస్వామి ఆదర్శాలే తమ పార్టీ ఆదర్శాలంటూ 3 లక్షల మంది అభిమానుల సమక్షంలో భారీగా ప్రసంగం చేశారు. పెరియార్ సిద్ధాంతాలలో మహిళ శక్తిని ప్రోత్సహించడం, సామాజిక న్యాయం అంశాలను మాత్రమే తాము అనుసరిస్తామని, నాస్తిక భావాన్ని తిరస్కరిస్తామని అన్నారు.