EPAPER

Supreme Court : మోదీ దొంగాటకు సుప్రీం చెక్..!

Supreme Court : మోదీ దొంగాటకు సుప్రీం చెక్..!

Supreme check on Modi : మోదీ ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టిన తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్ల వ్యవహారంలో విరాళాల వివరాలను వెల్లడిచేయకపోవటం అనైతికమని, రాజ్యాంగ విరుద్ధమని, ఇది క్విడ్ ప్రోకో వంటిదేనని, వాటిని తక్షణం నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి మొట్టికాయలు వేసింది. ఇప్పటి వరకు ఆయా పార్టీలకు వచ్చిన బాండ్ల వివరాలను దేశం ముందుంచాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.


అంతా మాయే..
రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 2018 జనవరి 2న అమల్లోకి తీసుకొచ్చిన ఎలక్షన్ బాండ్ల చట్టం ప్రకారం.. ప్రజలతోపాటు సంస్థలు కూడా ఈ బాండ్లను కొనుగోలుచేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందిచొచ్చు.

కానీ.. అసలు ఈ బాండ్లు ఎవరు కొంటున్నారు? ఎవరికి వీటిని ఇస్తున్నారు? లాంటి వివరాలను ప్రజలు మాత్రం తెలుసుకునే అవకాశం లేదు. పార్టీలు తమకు వచ్చిన విరాళాలను వెల్లడి చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రం ఆర్థిక చట్టం – 2017 సవరణ చేసింది.


ఎన్నికల బాండ్ల ద్వారా కొత్త రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నిధులు అందుకోవటం కుదరదు. అంతేగాక.. ఎన్నికల బాండ్ల పథకాన్ని బడ్జెట్‌లో భాగంగా ‘మనీ బిల్’ పేరుతో తీసుకొచ్చారు. దీనివల్ల ఇందులో మార్పుల చేయడానికి రాజ్యసభకు వీలులేకుండా పోయింది.

గతంలో కంపెనీల చట్టం ప్రకారం మూడేళ్లలో వచ్చిన సగటు లాభాలపై కంపెనీ బోర్డు అనుమతితో 7.5 శాతం మాత్రమే పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఉండేది. కంపెనీ వార్షిక నివేదికలోనూ ఏ పార్టీకి నిధులు ఇచ్చారో వెల్లడించాలి. కానీ.. మోదీ ప్రభుత్వం ఈ కంపెనీల చట్టానికి చేసిన సవరణ చేసింది. దీని ప్రకారం.. ఈ రోజు మొదలైన కంపెనీ కూడా మర్నాటి నుంచే రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వొచ్చు. అంతేకాదు.. కంపెనీ బోర్డు అనుమతి కూడా అవసరం లేదు. వార్షిక నివేదికల్లో వెల్లడించాల్సిన అవసరమూ లేదు. విదేశీ కంపెనీలు కూడా తమ భారతీయ అనుబంధ సంస్థల ద్వారా విరాళాలు ఇవ్వవచ్చు.

గతంలో ప్రతి రాజకీయ పార్టీ తమ విరాళాల గురించి లెక్కలు చెప్పాలని, ఎవరిచ్చారో వివరించాలని ఆదాయ పన్ను చట్టం నిర్దేశించేది. ఇప్పుడు పార్టీలు ఎన్నికల బాండ్ల గురించి రికార్డులు తయారు చేయనక్కర్లేదు. కంపెనీల చట్టం, ఆదాయపన్ను చట్టం, ప్రజా ప్రాతినిధ్యం చట్టం లాంటి చట్టాలనుంచి ఎన్నికల బాండ్లకు మినహాయింపు లభించింది.

అభ్యంతరాలు..
ఎలక్షన్ కమిషన్ వాదన ప్రకారం.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33ఏ ప్రకారం.. ఒక ఓటరు ఒక అభ్యర్థికి ఓటు వేసే ముందు ఆ అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకునే హక్కుంది. ఆ అభ్యర్థి నేరచరిత్రను కూడా తెలుసుకునేందుకు ఓటరుకు హక్కుంది. అలాగే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) క్రింద రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారనే విషయమూ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది.

రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే ఛాన్స్ లేకపోవటంతో తమకు ఎలక్షన్ ప్రక్రియ మీద పట్టు లేకుండా పోయిందని, దీనివల్ల షెల్ కంపెనీల ద్వారా ఎన్నికల బాండ్ల ప్రక్రియను దుర్వినియోగం చేస్తాయని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాని (ఎఫ్‌సిఆర్ఏ)కి మార్పులు చేయడంతో.. పార్టీలకు అడ్డూ ఆపు లేకుండా విదేశీ నిధులు ప్రవహించే అవకాశాలున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో ఆ విదేశీ కంపెనీలు మన విధానాలను ప్రభావితం చేస్తాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

అన్నీ అనుమానాలే..
ఎలక్షన్ బాండ్ల ద్వారా నేటి వరకు వచ్చిన మొత్తంలో దాదాపు 75 శాతం భారతీయ జనతా పార్టీకే దక్కింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఏపీలో వైసీపీలు అక్కడి ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సొమ్ము ముట్టింది. వెయ్యి రూపాయల నుంచి కోటి వరకు వేర్వేరు కేటగిరీల్లో ఉన్న ఈ విరాళాల్లో 95 శాతం మొత్తం.. కోట్ల రూపాయలలో జరిగింది. ఈ మొత్తం కట్టిన వారికి పన్ను మినహాయింపు కూడా లభించింది.

అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ ప్రకారం.. 2016-17 నుంచి 2021-22 మధ్య బాండ్ల రూపంలో బీజేపీకి రూ.5,127.97 కోట్ల విరాళాలు అందగా, మిగతా అన్ని జాతీయ పార్టీలకు కలిపి కేవలం రూ.1,783.93 కోట్లు మాత్రమే వచ్చాయి.

ఇక.. భారీ అప్పులతో తీవ్ర సంక్షోభంలో ఉన్న వేదాంత అనే కంపెనీ రాజకీయ పార్టీలకు బాండ్ల ద్వారా రూ. 457కోట్లు విరాళాలు సమకూర్చిందనీ, ఇదెలా సాధ్యమని అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు ముడుపుల రూపంలో ఈ బాండ్లు కొంటున్నారని సంస్థ వెల్లడించింది.

చాగ్లా తీర్పు శిరోధార్యం
ముంబై హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంసి చాగ్లా కార్పొరేట్లు ప్రజాస్వామ్య ప్రక్రియల పరిధిలోకి ప్రవేశించరాదని 1958లోనే తీర్పునిచ్చారు. ప్రజాస్వామ్య సంస్థల పనితీరును బడా వ్యాపార సంస్థలు, డబ్బు సంచులు ప్రభావితం చేయకూడదన్నారు. బడా పారిశ్రామిక సంస్థలు తమకు అనుకూలంగా విధానాలు మార్చేందుకే రాజకీయ పార్టీలను పెంచి పోషిస్తాయి కనుక దాన్ని అవినీతి క్రిందే భావించాలని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుందన్నారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×