Big Stories

New Parliament: పార్లమెంట్‌లో ‘సెంగోల్’.. బంగారు రాజదండం చరిత్ర ఇదే..

sengol new parliament

New Parliament: ఎంతో అట్టహాసంగా కొత్త పార్లమెంట్‌ భవనం. వజ్రాకారంలో అత్యద్భుత నిర్మాణం. అందులో ఎన్నో విశేషాలు. అనేక చారిత్రక ఆనవాళ్లు. వాటిలో ఒకటి బంగారు రాజదండం.

- Advertisement -

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో భాగంగా బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు ప్రధాని మోదీ. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆ రాజదండం చారిత్రక విశేషాన్ని తెలియజెప్పారు.

- Advertisement -

అనగనగా… బ్రిటిషర్లు నుంచి భారతీయులకు అధికారం బదిలీ అయ్యే సందర్భం. అప్పటి బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్, జవహార్‌లాల్ నెహ్రూల మధ్య అధికార బదిలీకి గుర్తుగా ఏం చేద్దామనే అంశంపై చర్చ జరుగుతోంది. అప్పుడు అప్పటి భారతీయ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి(రాజాజీ) సూచన మేరకు తయారు చేసిందే ఈ ‘రాజదండం’.

తమిళనాడు చరిత్రలో కొత్త రాజు బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి ఆ రాజుకు రాజదండం అందజేసే చోళుల సంప్రదాయం గురించి వివరించారు. నెహ్రూ సూచన మేరకు రాజాజీ ఆ రాజదండాన్ని తయారు చేయించే బాధ్యతను తీసుకున్నారు. రాజదండం తయారీ కోసం తమిళనాడులోని ‘తిరువడుత్తురై అథీనం’ అనే ప్రఖ్యాత మఠాన్ని సంప్రదించారు. ఆ మఠాధిపతులు 5 అడుగుల పొడువున్న బంగారు రాజదండాన్ని తయారు చేయించారు. న్యాయానికి ప్రతీకగా.. రాజదండం పై భాగంలో నంది చిహ్నం ఉంటుంది.

ఇక అధికార మార్పిడి సమయంలో మఠానికి చెందిన స్వామీజీ ఆ రాజదండాన్ని వైస్రాయ్ మౌంట్‌బాటెన్‌కు అందించి, తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి.. ఊరేగింపుగా నెహ్రూ దగ్గరికి తీసుకెళ్లారు. 1947, ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి పావు గంట ముందు.. ఆ రాజదండాన్ని స్వతంత్ర భారతదేశ నూతన ప్రధాని జవహార్ లాల్ నెహ్రూకు అందజేశారు. ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు.. ప్రత్యేకంగా రూపొందించిన పాటను ఆలపించారు. ఆ రాజదండాన్ని ‘సెంగోల్’ అంటారు. తమిళ పదమైన సెమ్మాయ్‌ (ధర్మం) నుంచి వచ్చిందు సెంగోల్. ఇదీ చరిత్ర. అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ చారిత్రక నేపథ్యాన్ని తాజాగా అమిత్ షా వివరించారు.

ప్రస్తుతం ఆ బంగారు రాజదండం అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. ఇకపై కొత్త పార్లమెంట్‌ భవనంలో సెంగోల్‌ శాశ్వతంగా కొలువుదీరనుంది. ఈ ఏర్పాటు.. మన సంప్రదాయాలను, ఆధునికతకు అనుసంధానించే ప్రయత్నమని అన్నారు అమిత్ షా. ఇది మోదీ దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News