EPAPER
Kirrak Couples Episode 1

Satish Dhawan : సతీష్ ధవన్.. రూపాయి జీతం తీసుకున్న ఏకైక శాస్త్రవేత్త..

Satish Dhawan : సతీష్ ధవన్.. రూపాయి జీతం తీసుకున్న ఏకైక శాస్త్రవేత్త..

Satish Dhawan : భారత అంతరిక్ష పరిశోధనకు ప్రణాళికలు రచించిన వ్యక్తి.. విక్రమ్‌ సారాభాయ్‌ కాగా, ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టి చూపిన గొప్ప శాస్త్రవేత్త.. ప్రొఫెసర్‌ సతీష్‌ ధవన్‌. సౌండింగ్‌ రాకెట్ల నుంచి మొదలైన భారత అంతరిక్ష ప్రస్థానం.. నేడు విదేశీ ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశ పెట్టే స్థాయికి చేరింది. తాజాగా.. మంగళయాన్, చంద్రయాన్‌‌తో బాటు సూర్యుడి మీద కూడా మనం పరిశోధన చేయగలిగే స్థాయికి భారత అంతరిక్ష సంస్థ చేరటం వెనక సతీష్‌ ధవన్‌ కృషి ఎంతో ఉంది. నేడు ఆయన వర్థంతి. ఈ సందర్భంగా ధవన్‌ సేవలను స్మరించుకుందాం.


1920 సెప్టెంబర్‌ 25న శ్రీనగర్‌లో ధవన్‌ జన్మించారు. బాల్యంతో అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థిగా రాణించిన ధవన్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులై, ఉన్నత విద్య నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అలాగే ఎంఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చేశారు. 1951లో స్వదేశానికి వచ్చిన వెంటనే బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో అధ్యాపకుడిగా చేరి 1962 నాటికి ఆ సంస్థకు డైరెక్టర్ అయ్యారు.

1971 డిసెంబర్‌లో విక్రమ్ సారాభాయ్ అకాల మరణంతో ఎలక్ట్రానిక్స్ కమిషన్‌లో ఉన్న ఎం.జి.కె.మీనన్‌ ఇస్రో చైర్మన్‌ అయ్యారు. అయితే, తన కంటే..ఐఐఎస్సీకి డైరెక్టర్‌గా ఉన్న సతీష్ ధావన్ ఇస్రో చైర్మన్ అయితే బాగుంటుందని భావించిన మీనన్.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి వచ్చిన సతీష్ ధావన్‌‌ను ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాలని కోరారు.


మీనన్ ప్రతిపాదనలను అంగీకరిస్తూనే.. ధవన్ రెండు షరతులు పెట్టారు. ఒకటి.. ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరుకు మార్చటం, రెండు.. IISC డైరెక్టర్‌గానూ కొనసాగేందుకు అనుమతించటం. ఈ రెండింటికీ నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ అంగీకరించటంతో మీనన్ స్థానంలో ఇస్రో చైర్మన్ అయ్యారు. ఇస్రో చైర్మన్‌గా నెలకు ఒక రూపాయి వేతనమే ఆయన తీసుకునేవారు.

ఈయన హయాంలోనే భారత్ తన తొలి ఉపగ్రహమైన ‘ఆర్యభట్ట’ను సోవియట్ రష్యా సాయంతో 1975 ఏప్రిల్ 19న రోదసిలోకి పంపింది. స్వదేశీ పరిజ్ఞానంతో రాకెట్‌ తయారీ, ప్రయోగం లక్ష్యంగా ధవన్ నాయకత్వంలో ఇస్రో 1979 ఆగస్టులో రోదసిలోకి పంపిన స్వయం నిర్మిత రాకెట్‌ ప్రయోగం విఫలం కావటంతో ధవన్ మీద పలు విమర్శలొచ్చాయి.

కానీ, 1980 జూలై 18న SLV-3 వాహకనౌకతో రోహిణి-1 అనే 35 కేజీల శాటిలైట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా భారత్ తన సొంత రాకెట్, ఉపగ్రహాలను అభివృద్ధి చేసి, వాటిని పర్యవేక్షించగలిగే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న ఆరో దేశంగా అవతరించింది.

అనంతరం భాస్కర, యాపిల్‌ ఉపగ్రహాలను నిర్మించి ఎస్‌ఎల్‌వీ ఉపగ్రహవాహకనౌక ద్వారా ప్రయోగించగలిగారు. ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్, తరహా ఉపగ్రహాల నిర్మాణ ప్రణాళికలు తయారు చేశారు. అంతరిక్ష రంగంలో ధవన్ విశిష్ట సేవలకు గానూ.. 1981లో పద్మవిభూషణ్‌ అవార్డును పొందారు. దీనితో బాటు ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అవార్డు, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వారి పురస్కారమూ అందుకున్నారు.

పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన దేశ అంతరిక్ష రంగానికి విశేష సేవలు అందించారు. 2002 సంవత్సరంలో జనవరి 3వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం.. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రానికి 2002 సెప్టెంబర్‌ 5న సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌గా నామకరణం చేసింది. అలాగే.. షార్‌లోని రెండోగేట్‌ వద్ద సతీష్‌ ధవన్‌ విగ్రహం, సతీష్‌ ధవన్‌ మెమోరియల్‌లను నిర్మించారు.

భారత తొలి ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విఫలమై సముద్రంలో పడిపోయినప్పుడు.. స్వదేశీ మీడియా, రాజకీయ నాయకులు ‘వందల కోట్ల ప్రజాధనాన్ని మిడిమిడి జ్ఞానంతో సముద్రం పాలు చేశారు’ అంటూ మండిపడ్డారు. ఆ ప్రయోగ బృందానికి నాయకత్వం వహించిన అబ్దుల్ కలాం ఎవరో మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేశారు. కానీ.. ఆ రోజు కలాంకు బదులుగా ఇస్రో చైర్మన్ ధవన్ మీడియా ముందుకొచ్చి.. తాము విఫలమైన మాట నిజమేననీ, త్వరలో దేశం గర్వించే విజయాన్ని అందుకుంటామని చెప్పారు.

సరిగ్గా ఏడాది తర్వాత ఇస్రో ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనప్పుడు.. కలాంను మీడియా సమావేశంలో మాట్లాడమని ధవన్ పంపించారు. దీనిని మాజీ రాష్ట్రపతి, నాటి ధవన్ టీం మెంబర్ డా.ఏపీజే అబ్దుల్ కలాం తరచూ విద్యార్థులకు చెప్పేవారు. ఫెయిల్ అయినప్పుడు నాయకుడిగా తాను బాధ్యత తీసుకొని మాట్లాడి, సక్సెస్ సమయంలో తన టీమ్‌ని మాట్లాడమని చెప్పి, వాళ్లకి ఆ క్రెడిట్ వచ్చేలా చేశారు ధవన్. ఆయన వర్థంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.

Related News

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Big Stories

×