Rajinikanth: ఉపరాష్ట్రపతి పదవిపై సినీనటుడు రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని వెల్లడించారు. ఆయన మరికొన్ని రోజులు కేంద్రమంత్రిగా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఒక గొప్ప నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారని తెలిపారు. శనివారం రాత్రి చెన్నైలోని సేఫియర్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో ‘రజనీ మక్కల్ మంద్రం’ అనే పార్టీని స్థాపించిన రజనీ కొద్దిరోజులకే ఆ పార్టీనీ మూసేశారు. అనారోగ్య కారణాల వల్లే పార్టీని మూసేస్తున్నట్లు అప్పట్లోనే వెల్లడించారు. తాజాగా మరోసారి తాను పార్టీ మూసేయడానికి గల కారణాలను రజనీ వెల్లడించారు.
తనకు మూత్రపిండాల సమస్య ఉండడం వల్లే రాజకీయాలకి దూరమయ్యానని చెప్పుకొచ్చారు. ఆ సమస్యతో కార్యక్రమాల్లో, బహిరంగ సభల్లో పాల్గొనరాదని వైద్యులు సూచించారని వెల్లడించారు. కరోనా సమయంలో కూడా చికిత్స తీసుకుంటున్న సమయంలో చాలా మంది ఆయనకు అదే సూచించారని వెల్లడించారు. అందువల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని.. ఈ విషయాలను చెబితే తాను బయటపడుతున్నానని అనుకుంటారని ఎక్కడా చెప్పలేదన్నారు.
అలాగే దేవుడు లేడు అనే వారిని ఏమనాలో అర్థం కావడం లేదని రజనీకాంత్ అన్నారు. రక్తాన్ని మనుషులెవరూ తయారు చేయలేరని.. దేవుడున్నాడనేందుకు ఇదే నిదర్శనమని వెల్లడించారు. దేవుడు లేడని గట్టిగా నమ్మే వాళ్లు ఒక బొట్టు రక్తాన్నైనా చేసి చూపించాలని సవాల్ విసిరారు.