Priyanka Gandhi: వయనాడ్ ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అభ్యర్థి ప్రియాంకగాంధీ. వివిధ ప్రాంతాల ప్రజలను కలుస్తూ వారిని అండగా ఉంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
లేటెస్ట్‌గా సుల్తాన్ బత్రేలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంకగాంధీ, ఈ ప్రాంత ప్రజల అపారమైన సామర్థ్యాన్ని చూస్తున్నానని అన్నారు.
ఈ సమస్యలకు నిజమైన, శాశ్వత పరిష్కారాల కోసం ముందుకు సాగడానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. అందరం కలిసి సంపన్నమైన వయనాడ్‌ను నిర్మిద్దామని పిలుపు ఇచ్చారు. పెరుగుతున్న ఖర్చులు కుటుంబాలపై ఒత్తిడి తెస్తున్నాయని అన్నారు.
మానవ – జంతు ఘర్షణలతో పాడి రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీనివల్ల పంటలు, పశువులు నష్టపోతున్నాయని వివరించారు. పారిశుధ్య కార్మికులు తాము చేసే కష్టానికి బీమా, ఉద్యోగ భద్రత వంటి గౌరవాన్ని కోరుకుంటున్నారని, వారు పడుతున్న బాధలను విన్నానని తెలిపారు.
ALSO READ: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి, ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం!
పనిలోపనిగా ఇటీవల వయనాడ్‌లో వచ్చిన వరద విపత్తులపై నోరు విప్పారు కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ. వయనాడ్‌లో ప్రకృతి బీభత్సంపై నోరు విప్పారు. ప్రజలకు తీరని బాధను మిగిల్సిన విపత్తును సైతం బీజేపీ రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారామె.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బీజేపీ పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, అధిక ధరల అంశాన్ని డైవర్ట్ చేసేందుకు బీజేపీ కొత్త కొత్త అంశాలను తెరపైకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల గొంతుకను పార్లమెంటులో వినిపిస్తానని, లోకసభకు పంపాలని ఓటర్లను కోరారు. మీ సమస్యలపై కేంద్ర-రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తానని చెప్పుకొచ్చారు.