EPAPER
Kirrak Couples Episode 1

Petrol: పెట్రో ధరలు తగ్గనున్నాయా? పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే లాభమా? నష్టమా?

Petrol: పెట్రో ధరలు తగ్గనున్నాయా? పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే లాభమా? నష్టమా?

Petrol: దేశంలో పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏ రాష్ట్రంలో చూసినా లీటర్ పెట్రోల్ ధర రూ. 100 కు పైగానే కదలాడుతోంది. డీజిల్ ధరలు కూడా సరేసరి.. పెట్రోల్ ధరతో పోటీ పడుతోంది.
చమురు సంస్థలు రోజూ పైసల రూపంలో పెంచుకుంటూ పోతే.. అప్పుడప్పుడు కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది. ఐనా.. పెట్రో ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడమే కాదు పెను భారంగానే ఉన్నాయనే మాట వాస్తవం. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కాబట్టి ధరలకు కళ్లెం వేయడానికి … పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో ఆశలు చిగురిస్తున్నాయి.


పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను జీఎస్టీ కిందకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే ఇది సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. అంతేకాదు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే అంశం ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ ముందు ఉందని నిర్మలా తెలిపారు. రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాత కేవలం జీఎస్టీ శాతాన్ని మాత్రమే నిర్ణయించాల్సి ఉందని స్పష్టం చేశారు. GST కౌన్సిల్ 49వ సమావేశం ఫిబ్రవరి 18న ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలోనూ జీఎస్టీ కిందకు పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని డిమాండ్లు వచ్చిన ప్రతిసారీ కేంద్రం దాదాపు ఇదే రీతిలో స్పందించింది. కానీ రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని.. నెపాన్ని రాష్ట్రాల మీదకు నెట్టే ప్రయత్నం చేసింది. నిజానికి దేశంలో ఎక్కువ రాష్ట్రాలు బీజేపీ పాలనలోనే ఉన్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని నిర్ణయం తీసుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. ఇక బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తాయన్నదే ఇక్కడ ప్రధానాంశం.

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. కేంద్రం విధించే ఎక్సైజ్ ట్యాక్స్ తోపాటు రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను VAT, సరకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు అన్నీ పెట్రో ధరలను నిర్ణయిస్తాయి. పెట్రోల్ పైన 60 శాతం, డీజిల్ పైన 54 శాతం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తున్నాయి. ఐతే గతేడాది మే 21న దేశవ్యాప్తంగా ఇంధన ధరలలో మార్పు కనిపించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. దీంతో అప్పట్లో కాస్త పెట్రో ధరలకు కళ్లెం పడింది. ఇక పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. 2020 ఆర్ధిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 5. 56 లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకున్నాయి. ఐతే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ఈ ఆదాయం నుంచి దాదాపు లక్ష కోట్ల వరకు ఆదాయం తగ్గిపోనుందనే అంచనాలు ఉన్నాయి. ఇది దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 0.4 శాతం ఉంటుందని అంచనా.


పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే వినియోగదారులకు లాభం చేకూరుతుందని అందరూ అనుకుంటున్న మాట. జీఎస్టీలోని అత్యధిక శ్లాబు 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకు వచ్చినా.. లీటర్ పెట్రోల్ పై దాదాపు రూ. 25 నుంచి రూ. 30 వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కానీ 28 శాతం జీఎస్టీతోపాటు వ్యాట్, ఇతర స్థానిక పన్నులు విధిస్తారనే వాదన వినిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్‌పై మన లాంటి జీఎస్టీ అమల్లో లేదు. కాబట్టి మన దగ్గర కూడా జీఎస్టీ ప్లస్ వ్యాట్‌ కలయికతోనే ఉంటుంది.

మరోవైపు పెట్రోల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై రాష్ట్రాల నుంచి కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి గండి పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ. 8 సెస్ తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ 8 రూపాయలలో విధించే VAT నిష్పత్తిలో ఆదాయాన్ని కోల్పోయాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం లీటర్ పెట్రోల్‌పై 35.2% వ్యాట్ వసూలు చేస్తోంది. అంటే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తగ్గించిన రూ. 8 లో 35.2 శాతం వ్యాట్ అంటే లీటర్ పెట్రోల్‌పై రూ. 2.82 ఆదాయం తగ్గుతుందన్నమాట. అందుకే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించినా.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు తాము విధించే పన్ను తగ్గించుకోలేదు. అలాగే పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే భారీగా ఆదాయం కోల్పోతామనేది రాష్ట్రాల వాదనగా ఉంది. మరోవైపు రాష్ట్రాలకు మద్యం, ఇంధనం లాంటివి అధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఈ క్రమంలో అధిక ఆదాయాన్ని వదులుకునేందుకు రాష్ట్రాలు అంగీకరిస్తాయా అనేది కేంద్రం వాదనగా ఉంది. గతంలో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి కూడా ఇదే వాదనను తెరపైకి తీసుకొచ్చారు.

వచ్చే ఏడాది దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలోనూ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్రో ధరలపై కాస్త ఊరట లభించింది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఇలాంటి చర్యలకు దిగినట్లు విపక్ష పార్టీలు ఆరోపించాయి. ఇక పెట్రోల్, డీజిల్ సహా గ్యాస్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కూడా ఎన్నికల స్టంటేనన్న వాదన వినిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ద్వారా… రాష్ట్రాల్లోని బీజేపీయేతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లాభం చేకూరే అవకాశం ఉంటుందన్నది నిర్వివాదాంశం.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా నుంచి ఇంధన దిగుమతులపై యూరోపియిన్ దేశాలు ఆంక్షలు విధించాయి. కానీ భారత్ మాత్రం రష్యా నుంచి ఇంధన దిగుమతులను భారీగా పెంచుకుంది. గతంలో రష్యా నుంచి 0.2 శాతం ఉన్న క్రూడాయిల్ దిగుమతులు.. ఈ ఏడాది జనవరి వరకు 28 శాతానికి చేరాయి. అంతే కాకుండా రష్యా ఆయిల్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితిని జీ7 దేశాలు విధించగా.. భారత్‌ అంతకంటే తక్కువకే కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర దాదాపు 80 డాలర్లుగా ఉంది. కానీ రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఇంధనం చౌకగా లభించడం కూడా పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశం తెరపైకి వచ్చిందా అనే అనుమానం కలుగుతోంది. ఐతే ఈ అంశంపై ఇప్పటి వరకు చమురు కంపెనీలు కూడా స్పందించలేదు.ఏది ఏమైనా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. సాధారణ పౌరులకు కొంతలో కొంత ఊరట కలుగుతుందనే చెప్పాలి.

Related News

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Big Stories

×