Big Stories

New Parliament Building : కొత్త పార్లమెంట్ భవనంలో రాజదండం ప్రతిష్ఠకు సన్నాహాలు..‌ ఎందుకంటే..?

New Parliament Building : పార్లమెంట్ నూతన భవనం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఆంగ్లేయుల నుంచి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ అందుకున్న రాజదండంను లోక్‌సభలో ప్రతిష్ఠించనున్నారు. ఇది 5 అడుగులకుపైగా పొడవు అంటే 162 సెం.మీ ఉంటుంది. పైభాగంలో నంది చిహ్నం, బంగారుపూత కలిగిన వెండి దండం ఉంటుంది. పార్లమెంట్ నూతన భవన ప్రారంభం రోజే రాజదండం ప్రతిష్ఠిస్తారు. ప్రధాని మోదీ ఈ నెల 28న ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.

- Advertisement -

పరిపాలనలో నీతి, న్యాయం, కర్తవ్యపథంలో సాగాలన్న సందేశాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రాజదండాన్ని లోక్‌సభలో ప్రతిష్టిస్తున్నామని అమిత్ షా వివరించారు. ఈ అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని పురాతన సంప్రదాయాలతో నవభారతాన్ని జోడించడానికి చేస్తున్న ప్రక్రియగా చూడాలని సూచించారు. ప్రస్తుతం ఢిల్లీ జాతీయ మ్యూజియంలో ఉన్న రాజదండంను తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనం నుంచి వచ్చే వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠిస్తామని తెలిపారు.

- Advertisement -

గతంలో ఈ రాజదండం గుజరాత్‌లోని అలహాబాద్‌ మ్యూజియంలో ఉండేది. గతేడాది నవంబర్ 4న అక్కడ నుంచి ఢిల్లీ జాతీయ మ్యూజియానికి తీసుకొచ్చారు. ఆ దండాన్నే తమిళంలో సెంగోల్‌ అంటారు. దాని అర్థం సంపద నుంచి సంపన్నం అని. దీని మూలాలు దేశ వారసత్వపరంపరతో ముడిపడి ఉన్నాయి. మరోవైపు పార్లమెంట్ కొత్త భవన నిర్మాణానికి 60 వేల మంది కార్మికులు శ్రమించారు. భవనం ప్రారంభోత్సవ వేళ ప్రధాని శ్రామికులను సన్మానిస్తారు.

రాజదండంకు ఎంతో చరిత్ర ఉంది. 1947 ఆగస్టు 14న రాత్రి చారిత్రక ఘటన జరిగింది. ఆంగ్లేయుల నుంచి భారత్ కు జరిగిన అధికార మార్పిడికి ఇది ప్రతీకగా నిలిచింది. అందుకే సెంగోల్‌ను సంగ్రహాలయాల్లో ఉంచడం అనుచితమని కేంద్రం భావించింది. దీంతో కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ స్పీకర్‌ ఆసనానికి పక్కన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజదండం ప్రతిష్ఠ మరోసారి 1947 నాటి భారతీయుల భావనలను గుర్తు చేస్తోంది. అమృతకాల ప్రతిబింబంగా మారనుంది. 1947 ఆగస్టు 14న నెహ్రూకు రాజదండం అందించే కార్యక్రమంలో పాల్గొన్న 96 ఏళ్ల ఉమ్మిడి బంగారు చెట్టి కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News