Modi National Unity Day| జాతీయ సమైక్యతా శక్తిని ఒక అర్బన్ నక్సల్స్ కూటమి దెబ్బతీయాలని చూస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాల పడి విమర్శలు చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నారని అలాంటి వారిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగ్దీప్ ధనకర్, ప్రధాన మంత్ర నరేంద్రమోదీ జాతి సమైక్యతా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గుజరాత్‌లోని కెవడియాలో సర్దార్ వల్లభాయ పటేల్ విగ్రహం వద్ద జరిగింది. కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎదుట పోలీస్ పరేడ్, మిలిటరీ పరేడ్ నిర్వహించారు.
జాతీయ సమైక్యతా దినోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “ప్రపంచంలో చాలా దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతోంది. కానీ పరస్పర శత్రువులైనా ఇండియాతో సన్నిహితంగా ఉండాలని చూస్తున్నాయి. ఇదంతా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండడం వల్లనే సాధ్యమైంది. దేశంలో అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా.. వాటిని బాహ్య శక్తుల అవసరం లేకుండా పరిష్కరించుకోగలుగుతున్నాం. ఇదే మన జాతి సమైక్యతకు కారణం. మన జాతీయ సమైక్యతను ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన దేశ సేవను మరిచిపోలేం. ఆయన దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో పడిన కష్టం ఈ రోజు మన దేశం ఐక్యంగా ఉండేందుకు ఉపయోగపడుతోంది.
Also Read: ఏఐ సాయంతో ఉగ్రవాదులు హతం.. అఖ్‌నూర్ ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందంటే?..
కానీ పటేల్ కష్టాన్ని కొందరు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కులం పేరుతో, మతం పేరుతో సమాజంలో విభజన తీసుకొచ్చి సమాజాన్ని బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా అర్బన్ నక్సల్స్ కూటమి చేస్తోంది. ఈ కూటమి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. ఈ విభజన వల్ల దేశ అభివృద్ధిని ప్రభావితం చేస్తోంది. విదేశీ పెట్టుబడిదారులు దేశంలో రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. వారంతా దేశాన్ని పేదరికం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతీయ జనత పార్టీ దేశం ఐక్యమత్యం కోసం, అభివృద్ధి కోసం పాటు పడుతోంది.
దేశంలో బిజేపీ ప్రభుత్వం చాలా మార్పులు తీసుకొచ్చింది. జీఎస్టీ, జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు వంటి మంచి నిర్ణయాలు తీసుకున్నాం. దేశ రాజ్యాంగ సిద్ధాంతాలు అనుసరిస్తూ.. వన్ నేషన్, వన్ ఐడెంటిటీ ని ప్రతిబింబిస్తోంది. దేశంలో సామాజిక న్యాయం, జాతీయ అభివృద్ధి సాధించేందుకు పౌరులందరూ కలిసి ముందుకురావాల్సిన అవసరం ఉంది.” అని చెప్పారు.