Fadnavis Security| మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం తమకు అందిందని.. ఆయన భద్రత కోసం ఇప్పటికే ‘Z’ ప్లస్ సెక్యూరిటీ ఉండగా.. ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో అదనపు భద్రతగా మరో ఎక్స్ ఫోర్స్ సిబ్బందిని కేటాయిస్తున్నట్లు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ శనివారం తెలిపారు. మహారాష్ట్రలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయనకు భద్రత పెంపు అవసరమని మంత్రి మహాజన్ పేర్కొన్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రితోపాటు, హోమ్ మంత్రి బాధ్యతలు తానే నిర్వర్తిస్తున్నారు. ఆయనకు మహారాష్ట్ర పోలీసుల స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ ‘Z’ ప్లస్ సెక్యూరిటీ అందిస్తోంది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20, 2024న జరుగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. అయితే ఈ తరుణంలో పార్టీ నాయకులకు ప్రాణ హాని ఉందని బెదిరింపులు రావడంతో వారి భద్రత విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా అజిత్ పవార్ ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దిఖిని అక్టోబర్ 12న దుండగులు పోలీసులు, భద్రతా సిబ్బంది ముందు ఉండగానే కాల్పి చంపారు. దీంతో పోలీస్ విభాగం మహారాష్ట్రలో నిఘా పెంచినట్లు తెలుస్తోంది.
Also Read: ‘లైఫ్ జాకెట్ వేసుకుంటే సెల్ఫీ చెడిపోతుంది’.. సముద్రంలో మునిగిపోయిన ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్లు
ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ అధికారులు.. పలువురు నేరస్తులను విచారణ చేయగా.. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు తెలిసింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఆయనకు భద్రత పెంపు కల్పించారు.
అయితే ఫడ్నవీస్ భద్రత పెంపుపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన మండిపడింది. ఉపముఖ్యమంత్రి, హోమ్ మంత్రికి ముందుగానే ‘Z’ ప్లస్ సెక్యూరిటీ ఉంటే మళ్లీ భద్రత పెంచడం ఏంటని శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. “ఫడ్నవీస్ కు ఎవరి నుంచి ప్రమాదం ఉంది. ఆయనకు హాని ఎవరు తలపెడతారు?. ఆయనే రాష్ట్రానికి హోమ్ మంత్రి. మరి ఆయనకు ముఖ్యమంత్రి నుంచి ప్రమాదం పొంచి ఉందా? టెర్రరిస్టులతో పోరాడడానికి శిక్షణ పొందిన ఒక కమండో ఫోర్స్ సిబ్బందిని ఆయన సెక్యూరిటీ పెంచడం కోసం నియమించడం ఏంటి? ఫడ్నవీస్ పై ఏమైనా ఇజ్రాయెల్ దాడి చేస్తుందా? ఉక్రెయిన్ దాడి చేస్తుందా?” అని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.
ఫడ్నవీస్ సెక్యూరిటీ పెంపుపై సీనియర్ నాయకుడు ఎన్‌సీపీ అగ్రనేత షరద్ పవార్ కూడా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. “ఫడ్నవీస్ కు ప్రాణహాని ఉంటే దాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించాలి. ఒక హోమ్ మంత్రి.. ఆయనకు ముందుగానే ‘Z’ ప్లస్ సెక్యూరిటీ భద్రత ఉంది. అయినా ఆ ప్రాణాలకు ముప్పు ఉందంటే భద్రత పెంచాలి అని అవసరమని పిస్తే.. ఇదేదో చాలా సీరియస్ అంశం ” అని వ్యాఖ్యానించారు.
మరోవైపు మహారాష్ట్ర మంత్రి మహాజన్.. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. “సంజయ్ రౌత్ ఏమైనా మాట్లాడుతాడు.. ప్రధాన మంత్రికి కూడా ‘Z’ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఆయన చేసేవన్నీ అర్థంలేని వ్యాఖ్యలు. ఎవరైనా ఉద్ధవ్ ఠాక్రేకు సెక్యూరిటీ ఎందుకు అవసరమని ప్రశ్నిస్తే.. ఎలా ఉంటుంది?” అని మండిపడ్డారు.