EPAPER
Kirrak Couples Episode 1

Siddaramaiah : లెజెండరీ లీడర్.. సిద్ధరామయ్య రూటే సెపరేటు..

Siddaramaiah : లెజెండరీ లీడర్.. సిద్ధరామయ్య రూటే సెపరేటు..


Siddaramaiah : సిద్ధరామయ్య కర్ణాటక కాంగ్రెస్ లో కాకలు తీరిన యోధుడు. రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి అనూహ్య విజయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే వచ్చారు. కన్నడనాట ఖతర్నాక్ మాస్ లీడర్. ఇప్పుడు మరోసారి సీఎం సీటుకు అడుగు దూరంలో ఉన్నారు. మైసూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన సిద్ధరామనహుండిలో పుట్టారు. ఆయన తండ్రి సిద్ధరామె గౌడ రైతు. ఐదుగురు తోబుట్టువుల్లో సిద్ధ రెండోవారు. మైసూరు వర్శిటీలో బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. జూనియర్‌ న్యాయవాదిగా కొనసాగి, కొన్నాళ్లు న్యాయశాస్త్రాన్ని బోధించారు. సిద్ధరామయ్య-పార్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రాకేశ్‌ తన తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి వచ్చినా అనారోగ్యం కారణంగా 38 ఏళ్ల వయసులో 2016లో కన్నుమూశారు. చిన్నకుమారుడు యతీంద్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

సిద్ధరామయ్యకు జనతా పరివార్‌తో మొదటి నుంచి అనుబంధం ఉంది. భారతీయ లోక్‌దళ్‌ పార్టీ టికెట్‌పై చాముండేశ్వరి నియోజకవర్గంలో గెలిచి 1983లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనూహ్య విజయంతో ఆయన పేరు కన్నడనాట ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐదుసార్లు అక్కడి నుంచే గెలిచి, మరో మూడుసార్లు ఓడిపోయారు. తొలిసారి గెలిచిన తర్వాత ఆయన అధికార జనతాపార్టీలో చేరారు. రామకృష్ణ హెగ్డే సర్కారులో మంత్రి పదవి చేపట్టారు. 1992లో జనతాదళ్‌ ప్రధాన కార్యదర్శి అయ్యారు. దళ్‌లో చీలికల తర్వాత జేడీఎస్‌లో చేరారు. కర్ణాటకలో మంత్రిగా 13 సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఆయన సొంతం. రెండుసార్లు ఉప ముఖ్యమంత్రిగా చేశారు.


2004లో కర్ణాటక ఓటర్లు అస్పష్టమైన తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్‌ నేత ధరంసింగ్‌ సీఎం కాగా, అప్పట్లో జేడీఎస్‌లో ఉన్న సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తానే సీఎంను కావాల్సి ఉన్నా జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ ఆ అవకాశాలకు గండి కొట్టారని ఆయనకు ఆగ్రహంగా ఉండేది. దానికితోడు దేవెగౌడ తన కుమారుడు హెడ్‌.డి.కుమారస్వామికి పార్టీలో ప్రాధాన్యం లభించేలా ప్రయత్నాలు చేస్తుండడంతో సిద్ధరామయ్య వెనుకబడినవర్గాల నేతగా గుర్తింపు పొందేందుకు ఆరాటపడ్డారు. కర్ణాటకలో సంఖ్యాబలంలో మూడో స్థానంలో నిలిచే కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆయన మైనారిటీలు, బీసీలు, దళితులతో అహిందా కూటమిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో సిద్ధరామయ్యపై అప్పట్లో జేడీఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. మనస్తాపానికి గురై, ఒకదశలో రాజకీయ సన్యాసం తీసుకుని మళ్లీ లాయర్ గా కొనసాగాలనే ఆలోచన చేశారు. ధనబలాన్ని తట్టుకునే శక్తి తనకు లేదంటూ ప్రాంతీయ పార్టీ నెలకొల్పే ప్రతిపాదనను పక్కన పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ ఆహ్వానించగా 2006లో హస్తం గూటికి చేరుకున్నారు.
2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సేవలందించారు. నిజానికి 2013లో సీఎం పీఠం కోసం ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు, అప్పటి కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే నుంచి ఆయనకు గట్టిపోటీ ఎదురైంది. అయినా నెగ్గుకురాగలిగారు. ప్రజాదరణ పొందిన పథకాలను విజయవంతంగా అమలుచేసినా 2018లో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి కారణం.. లింగాయత్ లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించాలని సిద్ధరామయ్య సర్కారు తీసుకున్న నిర్ణయమేనని చెబుతారు. లింగాయత మతం కోసం చురుగ్గా ఉద్యమించిన చాలామంది నేతలు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. సిద్ధరామయ్య కూడా తన నియోజకవర్గంలో విజయం సాధించలేకపోయారు. అయితే బాదామి నియోజకవర్గంలోనూ పోటీచేసి అక్కడ గెలవడంతో అసెంబ్లీకి రాగలిగారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో సీఎం అభ్యర్థిత్వం గురించి ఆయన బాహాటంగానే చాలాసార్లు చెబుతూ వచ్చారు. ఆ పదవిని ఆశించడంలో తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు.

కర్ణాటకకు ప్రత్యేక జెండా ఉండాలని అప్పట్లో రూపకల్పన కూడా చేశారు. క్యాబినెట్ తో ఆమోదముద్ర వేయించి కేంద్ర హోంశాఖకు పంపించారు. 1960ల నుంచే కర్ణాటకకు అనధికారికంగా జెండా ఉంది. అయితే దేశంలో జమ్మూకశ్మీర్ తర్వాత ప్రత్యేక జెండా కర్ణాటకకు ఉండాలని సిద్ధరామయ్య కోరుకున్నారు. సీన్ కట్ చేస్తే 2018 ఎన్నికల్లో దెబ్బ పడింది. సిద్ధరామయ్య కొత్తగా ఆలోచించిన ప్రతిసారీ ఎన్నికల్లో దెబ్బ పడింది. ఇప్పుడు మాత్రం చాలా సాదాసీదాగా… పంచరత్నాలపై ఫోకస్ పెట్టి కాంగ్రెస్ ను గెలిపించుకోగలిగారు.

Related News

CM Siddaramaiah: భార్య నిర్ణయం.. ఆశ్చర్యపోయిన సీఎం సిద్ధరామయ్య

Udhayanidhi: టార్గెట్ తలపతి.. ఉదయనిధి పదవి వెనక బిగ్ స్కెచ్

Viral Video: వామ్మో.. ఈ ఖడ్గమృగాన్ని చూడండి.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని సడెన్‌గా…

Work Pressure: హర్రర్ జాబ్.. 45 రోజులుగా నిద్రలేదు, చివరికి తన ప్రాణాలను తానే…

Cows are Rajya Mata: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. మహారాష్ట్ర “రాజ్యమాతగా” ఆవు

Mithun Chakraborty: మిథున్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్.. కమల కటాక్షమేనా?

Bomb Threat: పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అలర్ట్ అయిన అధికారులు

Big Stories

×