Lashkar-e-Taiba Commander : యుద్ధ పోరాటాల్లో వ్యూహాలే ప్రధానం. ఓ చిన్న తప్పిదం మొత్తం పోరాట స్వరూపాన్నే మార్చేస్తే, ఓ మంచి వ్యూహం అద్భుత ఫలితాల్నిఅందిస్తుంటుంది. అలాంటి సంఘటనే జమ్మూకశ్మీర్ లో ఇటీవల చోటుచేసుకున్న కీలక కమాండర్ ఎన్ కౌంటర్లో జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్న కీలక కమాండర్ ను హతమార్చేందుకు.. కుక్క బిస్కెట్లు ఉపయోగపడడం ఆసక్తికరంగా మారింది.
లష్కర్ -ఈ – తోయిబా కీలక కమాండర్ ఉస్మాన్ ను భద్రతా దళాలు హతమార్చాయి. ఇందుకోసం ఎంత పక్కాగా ప్రణాళికలు రూపొందించాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవల జమ్మూ, కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతలకు క్షేత్రస్థాయిలో భారత సైన్యం తీవ్రంగా కృషి చేస్తోంది. క్షేత్ర స్థాయిలో బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్న సైన్యం.. శ్రీనగర్ లోని ఖన్యార్ లో ఉస్మాన్ కదలికల్ని పసిగట్టాయి. తీవ్ర జన సంచారం ఉండే ఇక్కడ.. డైరెక్ట ఆపరేషన్ చాలా కష్టం. అందుకే.. తొమ్మిది గంటలు శ్రమించి.. సైన్యం ఓ ప్రణాళికను రూపొందించింది.
చాలా ఇరుకైన ప్రాంతం కావడం, ఉస్మాన్ కు ఈ ప్రాంతంపై పూర్తిస్థాయి పట్టుండడంతో.. సైన్యం కదలికలపై ఏ మాత్రం అనుమానం వచ్చినా అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అందుకే.. క్షేత్రస్థాయిలోని ప్రతీ చిన్న విషయాన్ని ప్రణాళికలో చేర్చారు. అందులో.. కుక్కల కోసం బిస్కెట్లు తీసుకువెళ్లడం కూడా ఓ భాగమైంది.
అవును లష్కర్- ఈ- తోయబా కీలక కమాండర్ ఎన్ కౌంటర్ విజయవంతం కావడంలో సైన్యం కుక్కల కోసం బిస్కెట్లు తీసుకెళ్లడం చాలా ముఖ్యపాత్ర పోషించిందని అంటున్నారు అధికారులు. ఎందుకంటే శ్రీనగర్ లో ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో కుక్కలు బెడద ఎక్కువ. ఈ కారణంగానే.. సైన్యం తుపాకులతో ఇక్కడ ఆపరేషన్ కి వెళితే.. కుక్కలు మొరిగే అవకాశం ఉంది. ఒకవేళ అవి పెద్ద ఎత్తున ఒక్కసారే మొరిగితే.. సైన్యం సంకేతం గా భావించి ఉస్మాన్ తప్పించుకునే అవకాశాలున్నాయి. అందుకే.. కుక్కల బిస్కెట్లు వెంట తీసుకువెళ్లి.. కుక్కలను భద్రతా దళాలు నియంత్రించాయి.
ఉదయకాల ప్రార్థనలకు ముందే ఉస్మాన్ ఉన్న బిల్డింగ్ ను చుట్టుముట్టిన భద్రతా దళాలు.. ఆ ప్రాంతంలోని దాదాపు 30 భవనాలను తమ ఆపరేషన్ పరిధిలోకి తీసుకున్నాయి. అనంతరం కాల్పులు చోటుచేసుకోగా.. ఏకే 47, ఓ పిస్తోలు సహ గ్రానైట్లతో ఉనన ఉస్మాన్ భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో కొన్ని గ్రానైట్లు పేలి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా భద్రతా దళాలు నిరోధించాయి.
రోజంతా జరిగిన కాల్పుల్లో నలుగురు భద్రత సిబ్బంది గాయపడగా.. కీలక కమాండర్ ఉస్మాన్ హతమయ్యాడు. పాకిస్తాన్ కు చెందిన ఉస్మాన్.. కాశ్మీర్ లోయలో 2016-17లో కశ్మీర్ లో చొరబడి స్థానికంగా అనేక దాడులకు పాల్పడ్డట్టు అధికారులు తెలిపారు. గత ఏడాది.. క్రికెట్ ఆడుతున్న పోలీస్ అధికారి మష్రూమ్ మనీ పై కాల్పులు జరిపి హత్య చేసిన ఘటనలోనూ ఉస్మానే ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.