Actor Darshan Bail | రేణుకా స్వామి హత్య కేసులో గత కొన్ని నెలలుగా జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్వన్ థూగుదీపకు కర్ణాటక హై కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జి ధర్మాసనం నటుడు దర్శన్ కు ఆరోగ్య కారణాల రీత్యా ఆరు వారాల ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేశారు.
వెనెముక నొప్పి కారణంగా నటుడు దర్శన్ ఆపరేషన్, ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన అవసరముందని ఆయన లాయర్ సివి నగేష్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను విచారణ చేసిన జస్టిస్ విశ్వజిత్ శెట్టి నటుడి వైద్య పరీక్షల రిపోర్ట్ పరిశీలించి బెయిల్ మంజూరు చేశారు. బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న నటుడు దర్శన్‌ని బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రి న్యూరాలజీ డాక్టర్లు మంగళవారం పరీక్షించారు.
నటులు దర్శన్ కు అరికాళ్లలో, వెనెముకలో తీవ్రమైన నొప్పి ఉందని ఆయన మైసూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తన సొంత ఖర్చులతో వైద్యం చేసుకునేందుకు ఆరు వారాల బెయిల్ కు అనుమతి ఇవ్వాలని లాయర్ నగేష్ న్యాయమూర్తికి కోరారు. కానీ లాయర్ నగేష్ వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ వ్యతిరేకించారు. హత్య కేసులో నిందితుడైన దర్శన్ కు అవసరమైన వైద్య చికిత్స ప్రభుత్వ ఆస్పత్రిలో చేయొచ్చని.. దానికి ఆరు వారాలు అవసరం లేదని వాదించారు. దానికి లాయర్ నగేష్ సుప్రీం కోర్టు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. ఒక నిందితుడికి తాను కోరుకున్న ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే హక్కు ఉందని చెప్పారు.
మరోవైపు నటుడు దర్శన్ రెగులర్ బెయిల్ పిటీషన్ ని ట్రయల్ కోర్టు తిరస్కరించగా.. ఆయన లాయర్ ట్రయల్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ.. హైకోర్టులో ప్రత్యేక పిటీషన్ దాఖలు చేశారు. ఆ రెగులర్ బెయిల్ పిటీషన్ విచారణ కూడా త్వరలోనే ప్రారంభకానుందని సమాచారం.
నటుడు దర్శన్‌ని .. జూన్ 11, 2024న తన అభిమాని రేణుకా స్వామి (33) హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. రేణుకా స్వామి దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు అశ్లీల మెసేజ్‌లు పంపించాడని.. దీంతో దర్శన్ అతడిని హత్య చేయించాడనే ఆరోపణలున్నాయి. రేణుకా స్వామి మృతదేహం జూన్ 9న బెంగుళూరులోని సుమనహళ్లి ప్రాంతంలో ఒక మురికి కాలువలో లభించింది.
రేణుకా స్వామిని హత్య చేసే ముందు నటుడు దర్శన్ మరో అభిమాని రాఘవేంద్ర.. రేణుకాస్వామిని ఒక కారులో ఆర్ ఆర్ నగర్ లోని ఒక షెడ్డుకు తీసుకొనివచ్చాడని, అక్కడ దర్శన్ ఆదేశాల మేరకే అతడిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారని పోలీసులు తెలిపారు. రేణుకాస్వామిని హత్య చేసే ముందు అతడిని నటుడు దర్శన్, పవిత్ర గౌడ ఇద్దరూ చితకబాదారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.