EPAPER

Union Budget: ఆర్థిక మంత్రి కాదు.. ప్రధాన మంత్రులే బడ్జెట్ ప్రవేశ పెట్టిన వేళ!.. ఎన్నిసార్లు జరిగిందంటే..

Union Budget: ఆర్థిక మంత్రి కాదు.. ప్రధాన మంత్రులే బడ్జెట్ ప్రవేశ పెట్టిన వేళ!.. ఎన్నిసార్లు జరిగిందంటే..

Union Budget| భారతదేశంలో ప్రతీ సంవత్సరం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేది ఆర్థిక మంత్రులు కదా? కానీ దానికి భిన్నంగా మన ప్రధాన మంత్రులు కూడా బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. ఇలా చరిత్రలో మూడు సార్లు జరిగింది. ఆ మూడు సార్లు కూడా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ప్రధానులే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఓ రికార్డ్.


ఈ పరిస్థితి ఎదుర్కొన్న తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ. నాటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజీనామా చేయడంతో ప్రధాని నెహ్రూయే దానిని సమర్పించాల్సి వచ్చింది. 1958-59 బడ్జెట్‌ను ఫిబ్రవరి 13, 1958న నెహ్రూ ప్రవేశపెట్టారు.

ఇందిరా గాంధీకీ తప్పలేదు
1970లో కూడా ఇదే పరిస్థితి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకి ఎదురైంది. ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో.. ఆ శాఖ బాధ్యతలను కూడా ప్రధాని ఇందిరాగాంధీయే నిర్వర్తించారు. దాంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు.


మూడోసారి రాజీవ్ గాంధీ
ఇక కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో సమర్పించిన మూడో ప్రధాని రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ మంత్రివర్గం నుంచి వీపి సింగ్ రాజీనామా చేసి.. ఆయన ప్రభుత్వంతోనూ తెగదెంపులు చేసుకున్నారు. అప్పుడు రాజీవ్ గాంధీ.. ఆర్థిక మంత్రి అవతారం ఎత్తారు. 1987-88 సంవత్సరానికి గాను ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇలా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు ప్రధాన మంత్రి పదవిలో ఉంటూనే పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పించారు.

బడ్జెట్ సమర్పించడంలో రికార్డులు

అత్యధికంగా బడ్జెట్లను సమర్పించింది మొరార్జీ దేశాయ్. ఆర్థిక మంత్రిగా ఆయన తన హయాంలో మొత్తం పది బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఆయనదే రికార్డు. ఆ తర్వాత స్థానాల్లో పి.చిదంబరం(9 బడ్జెట్లు), ప్రణబ్ ముఖర్జీ(8), యశ్వంత్ సిన్హా(8), నిర్మలా సీతారామన్ (7), మన్మోహన్ సింగ్(6) నిలిచారు.

సుదీర్ఘ ప్రసంగం
బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగిస్తారు. భారత చరిత్రలో సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసింది ఎవరో తెలుసా? నిర్మలా సీతారామన్. 1 ఫిబ్రవరి 2020న ఆమె బడ్జెట్‌ను(2020-21) సమర్పించి.. 2 గంటల 42 నిమిషాలు మాట్లాడారు. అదే ఇప్పటివరకు రికార్డు. జశ్వంత్ సింగ్ 2003 బడ్జెట్ సమర్పణ సమయంలో 2 గంటల 13 నిమిషాలు ప్రసంగించారు. బడ్జెట్ ప్రసంగానికి అతి తక్కువ సమయం తీసుకున్న ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ.

1982లో ఆయన 1 గంట 35 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించారు. షార్టెస్ట్ ఆర్థిక మంత్రి.. లాంగెస్ట్(సుదీర్ఘ) బడ్జెట్‌ను సమర్పించారంటూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ చమత్కరించారు. సంక్షిప్తం, పొట్టి అనే రెండు అర్థాలతో ఆమె షార్టెస్ట్ అనే పదాన్ని వినియోగించి చతురత ప్రదర్శించారు. ప్రణబ్ ముఖర్జీ పొట్టిగా ఉంటారన్న విషయం తెలిసిందే.

పదాల లెక్కలో మన్మోహన్ సింగ్ రికార్డు..
పదాల లెక్కన తీసుకుంటే మన్మోహన్‌సింగ్‌దే సుదీర్ఘ ప్రసంగమని చెప్పాలి. 1991లో ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో మన్మోహన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. ఈ విషయంలో అరుణ్ జైట్లీకి రెండో స్థానం దక్కుతుంది. 2018లో 18,604 పదాలతో ఆయన బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. మొత్తం 1 గంట 49 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. ఇక క్లుప్తంగా, తక్కువ పదాలతో బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్‌కు దక్కుతుంది. 1977లో ఆయన 800 పదాలతో తన ప్రసంగాన్ని ముగించడం విశేషం.

Also Read| మొరార్జీ దేశాయ్ పేరున ఎక్కువసార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్.. త్వరలో ఆ రికార్డు బ్రేక్!

ఏడున్నర దశాబ్దాల్లో ఎన్నో మార్పులు చెందిన బడ్జెట్

ఏడున్నర దశాబ్దాల కాలంలో దేశ ఆర్థిక ముఖ చిత్రమే మారిపోయింది. బడ్జెట్ సమర్పణకు సంబంధించి కూడా కాలక్రమంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి బగెట్ అనే ఫ్రెంచి పదం నుంచి బడ్జెట్ వచ్చింది. బగెట్ అంటే చిన్న బ్యాగ్ అని అర్థం. బడ్జెట్ పత్రాలను ఆ బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చేవారు.

టాబ్లెట్ రంగప్రవేశం..
కాలక్రమంలో బ్యాగ్ స్థానంలో బ్రీఫ్ కేసు చేరింది. 2019లో నిర్మలా సీతారామన్ బ్రీఫ్ కేసుకు బదులుగా సంప్రదాయ ‘బహీఖాతా’ను జాతీయ చిహ్నం ఉన్న ఎర్రటి వస్త్రంలో తీసుకొచ్చారు. 2021లో దానిని మార్చేశారు. ఆధునికతకు అద్దం పడుతూ టాబ్లెట్‌తో బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. అలా డిజిటల్ ఇండియా దిశగా అడుగులేశారు.

రెండు భాషలు..
బడ్జెట్‌ను తొలుత ఆంగ్లంలో మాత్రమే ప్రచురించేవారు. 1955లో కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మార్చేసింది. ఇంగ్లిష్‌తో పాటు హిందీలోనూ ప్రింట్ చేయడం ఆ ఏడాది నుంచి ఆరంభమైంది.

బడ్జెట్ సంప్రదాయం.. సమయం, రోజు
బడ్జెట్‌ను ఫిబ్రవరిలో చివరి వర్కింగ్ డే నాడు సాయంత్రం 5గంటలకు సమర్పిస్తూ వచ్చేవారు. బ్రిటిషర్ల హయాం నుంచి వస్తున్న సంప్రదాయమిది. అయితే 1999 నుంచి ఉదయం 11 గంటలకే బడ్జెట్‌ను సమర్పించే పద్ధతిని అమల్లోకి తెచ్చారు. యశ్వంత్‌ సిన్హా ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఈ మార్పు జరిగింది. అలాగే బడ్జెట్‌ను సమర్పించే రోజు కూడా మారిపోయింది. 2016 వరకు ఫిబ్రవరిలో చివరి రోజు బడ్జెట్‌ను పెట్టేవారు. 2017లో దానిని మార్చేసి.. ఫిబ్రవరి 1వ తేదీనే సమర్పించడం ఆరంభించారు. బ్రిటీషర్ల కాలం నాటి పద్ధతికి స్వస్తి పలికి.. అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 1, 2017న బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుంచారు.

ముద్రణకు స్వస్తి
కొవిడ్-19 మహమ్మారి కారణంగా అన్ని రంగాల్లోనూ ఎన్నో అనూహ్య మార్పులు సంభవించాయి. బడ్జెట్ ముద్రణను నిలిపివేశారు. 1950 వరకు రాష్ర్టపతి భవన్‌లో బడ్జెట్‌ను ముద్రించేవారు. కానీ అప్పట్లో బడ్జెట్ వివరాలు లీకైన నేపథ్యంలో.. ముద్రణను ఢిల్లీలోని మింటో రోడ్‌లోని ప్రెస్‌కు మార్చారు. 1980లో నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో శాశ్వత పద్ధతిలో ప్రభుత్వ ప్రెస్‌ను ఏర్పాటు చేసి ముద్రిస్తూ వచ్చారు. 2021లో కొవిడ్ కారణంగా ముద్రణను నిలిపివేశారు. కాగితాలు, పుస్తకాల రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో పార్లమెంట్ సభ్యులకు బడ్జెట్ ప్రతులను అందజేయడం 2021లో ఆరంభమైంది. కాగిత రహిత బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇప్పడు మొబైల్ యాప్‌ లోనూ బడ్జెట్ పత్రాలను అందుబాటులో తీసుకొచ్చారు.

 

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×