EPAPER

Regional Parties: ప్రాంతీయ పార్టీలలో ప్రజాస్వామ్యం ఎంత?

Regional Parties: ప్రాంతీయ పార్టీలలో ప్రజాస్వామ్యం ఎంత?

 


regional parties in india

Democracy in regional parties(Today latest news telugu): ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనదే. గత ఏడున్నర దశాబ్దాల కాలంలో మన ప్రజాస్వామ్యం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఈ 77 ఏళ్ల ప్రయాణంలో భారతదేశం పరిపక్వ ప్రజాస్వామ్య వ్యవస్థగా మారలేకపోయినా, అనేక సవాళ్లను అధిగమిస్తూ మొత్తం మీద అది తన ఉనికిని, ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగింది. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశపు భవిష్యత్తు అయినా ఆ దేశ రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంటుంది.


అయితే, బహుళ పార్టీ వ్యవస్థ అమల్లో ఉన్న మనదేశంలో గత ముప్ఫయ్యేళ్ల కాలంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. దీనివల్ల దేశంలోని రాజకీయ పార్టీల బలాబలాలలో సమతుల్యత దెబ్బతిన్నది. దీంతో గతంలో బలంగా ఉన్న కాంగ్రెస్, వామపక్షాల వంటి జాతీయ పార్టీలు బలహీనపడటంతో కేంద్రంలోని నిరంకుశ ధోరణులను అవలంబించే ప్రభుత్వాలను బలంగా నిలదీసే నిర్మాణాత్మక విపక్ష పాత్రను ఆయా జాతీయపార్టీలు పోషించలేని దుస్థితిలో పడిపోయాయి. ఈ వైఫల్యానికి ప్రాంతీయ పార్టీలను దోషులుగా చూపటం అన్యాయంగా కనిపించినా, అందులో వాస్తవం లేదని కొట్టిపారేయటమూ సాధ్యం కాదు.

Read more: రామేశ్వరం కేఫ్‌ నిందితుడి ఆచూకీ కోసం ఎన్‌ఐఏ భారీ నజరానా

దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న రోజుల్లోనే తమిళనాడులో ప్రాంతీయ ఆకాంక్షలు బయటపడ్డాయి. తొలినాళ్లలో కేవలం భాష, సంస్కృతి, ఆత్మగౌరవం వంటి అంశాలతో సాగిన నాటి ద్రవిడ ఉద్యమం 1949 నాటికి డీఎంకే పార్టీగా ఆవిర్భవించింది. అన్నాదురై ప్రారంభించిన ఈ పార్టీ నుంచే తర్వాతి రోజుల్లో ఏఐడీఎంకే పుట్టుకొచ్చింది. 1967లో కాంగ్రెస్‌ను ఓడించిన డీఎంకే తమిళనాట పాలనా పగ్గాలు చేపట్టింది మొదలు నేటి వరకు ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలు అధికారంలోకి రాలేకపోయాయి. తర్వాత ఏపీలో తెలుగుదేశం, మహారాష్ట్రలో శివసేన పార్టీలు స్థానిక ఆకాంక్షలకు ప్రతీకలుగా పుట్టుకొచ్చాయి. అధికార కాంక్షతో జాతీయ పార్టీల నుంచి వేరైపోయి ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడిన ఆర్జేడీ, బిజూ జనతాదళ్, జేడీయూ. జేడీఎస్, వైసీపీ వంటివీ వచ్చాయి. ఇవి గాక.. ప్రత్యేక పాలన పేరిట పుట్టిన బీఆర్ఎస్, జేఎంఎం వంటి ప్రాంతీయ పార్టీలూ ఉన్నాయి.

ప్రాంతీయ పార్టీల ప్రస్థానం మొదలైన రోజుల్లో ఇవి మన ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేస్తాయని మన దేశంలోని మెజారిటీ మేధావులు భావించారు. అయితే, అనతికాలంలోనే ఈ పార్టీలన్నీ ఫెడరలిజాన్ని కుటుంబ ప్రయోజనాలకు, కేంద్రీకృత పాలనకు పర్యాయపదంగా మార్చాయి. దానిని కప్పి పుచ్చుకునేందుకు జాతీయ పార్టీలను ‘ఢిల్లీలో ఉండి నిర్ణయాలు చేసే పార్టీలు’గా చూపే కళలో ఈ ప్రాంతీయ పార్టీలు ఆరితేరాయి. వీటిలో ప్రజాస్వామ్యం మోతాదు కాస్త ఎక్కువ, తక్కువ ఉన్న పార్టీలున్న మాట నిజమే గానీ, పథకాలను ఎరవేసి ఓట్లు రాబట్టుకోవటంలో వీటన్నిటిదీ ఒకటే బాట. కాలక్రమంలో ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనను ప్రశ్నించరాదనే స్థితికి ఇవి చేరుకున్నాయి.

ఈ పార్టీల్లో పారదర్శకత, అంతర్గత ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం వంటివి ప్రాంతీయ పార్టీల్లో తక్కువని నాలుగు దశాబ్దాల అనుభవాలు మనకు చెబుతున్నాయి. ప్రభుత్వాధినేత నిర్ణయాన్ని ఆ పార్టీలని సీనియర్ నేతలు ప్రభావితం చేసిన సందర్భాలున్నా, అవి తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ నేతల కేంద్రీకృత నిర్ణయాలు అవినీతికి దారి తీసిన ఉదంతాలెన్నో. బిహార్‌లో లాలూ ప్రసాద్, తమిళనాడులో జయలలిత, కరుణానిధి, శశికళ, హర్యానాలో ఓంప్రకాశ్​ చౌతాలా ఇలా ఎందరో నేతలు అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారు.

మరికొంతమంది ప్రాంతీయ నేతలు కేసులను ఎదుర్కొనే క్రమంలో ఉన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచిన కాలంలో ఈ ప్రాంతీయ పార్టీలు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. నేడు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పటికీ, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ఆ పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోటా కొందరు నేతలు దొరికిపోయినా, అది ఆ సదరు వ్యక్తుల అనైతికతకు ఉదాహరణగా కనిపించిదే తప్ప పార్టీలోని ప్రజాస్వామ్య ధోరణి మీద ప్రశ్నలు ఉత్పన్నం కాలేదు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలే అధికార, విపక్ష పాత్రలు పోషిస్తున్నాయి. గతంలో తమిళనాడులో డీఎంకే ఉండగా కరుణానిధి, అన్నాడీఎంకే హయాంలో జయలలిత అకారణంగా ప్రతీకారాలకు దిగి ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేయగా, నేడు ఏపీలో టీడీపీ, వైసీపీలు అదే బాటలో కొనసాతున్నాయి. తెలంగాణలో జాతీయపార్టీ విపక్షంగా ఉన్నప్పటికీ తొమ్మిదన్నరేళ్లుగా కాస్త అటూ ఇటుగా ఇలాంటి వాతావరణమే రాజ్యమేలింది. ప్రజల భూములకు, ఆస్తులకు, ఆత్మగౌరవానికి రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. ప్రశ్నించే గొంతులను అణచివేసే ధోరణి, పారదర్శకత, జవాబుదారీతనం గురించి అడిగిన వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించారు. ఆత్మగౌరవం అటకెక్కిపోగా, స్వయం పాలన ఒకే కుటుంబ పాలనలో నలిగిపోయింది.

read more: ఇండియాతో వివాదం.. చైనాతో మాల్దీవుల కొత్త సైనిక ఒప్పందం..

సంక్షేమం పేరుతో ఓట్లు రాల్చుకుంటున్న ప్రాంతీయ పార్టీలు తమ కుటుంబ, వారసత్వ రాజకీయాలను కొనసాగించుకునేందుకు ఢిల్లీలో అధికారంలో ఉన్నవారికి విధేయత ప్రకటిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలను విస్మరించి ఈ పార్టీలు పార్లమెంటులో వ్యూహాత్మక మౌనం పాటించటం వల్ల గత పదేళ్లలో జీఎస్టీ బిల్లు, వ్యవసాయ బిల్లు, నోట్ల రద్దు వంటి నిర్ణయాలెన్నో ఏ చర్చాలేకుండానే దేశం మీద రుద్దబడ్డాయి. పథకాల పేరిట, పునర్మిర్మాణం పేరిట తమ ప్రాంత, కుల, కుటుంబ, అనుచరుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే ఈ పార్టీలు ఈ పదేళ్లలో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చేసిన ఒక్క నిర్ణయమూ కానరాదు.

ప్రాంతీయ పార్టీలు ఉండరాదని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. వాటిపై నిషేధం ఏమీ లేదు. కానీ అవి బాధ్యతాయుతంగా, సమాఖ్య విధానాన్ని గౌరవించి, దానికి కట్టుబడి పని చేయడం అవసరం. అందుకే ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడుస్తున్న ప్రాంతీయ పార్టీలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించాలి. భిన్న మతాలకు, భాషలకు, ప్రాంతాలకు, వేలాది కులాలకు ఆలవాలమైన భారత ప్రజాస్వామ్యానికి జాతీయ పార్టీల అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత విద్యావంతులు, మేధావులదే. అప్పుడే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి, దేశ సమగ్రత, అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×