Big Stories

Parliament: 96 ఏళ్ల పార్లమెంట్ భవనం.. ఆ చరిత్ర తెలుసా..!

Parliament-building

Parliament: భారత పార్లమెంట్ భవనం. భలే ఉంటుంది నిర్మాణం. వృత్తాకారంలో బిల్డింగ్. చుట్టూ ఎత్తైన పిల్లర్లు. ఆ లుక్కే వేరు. అత్యద్భుతంగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవంతో.. అద్భుతమైన ఆనాటి పాత పార్లమెంట్ భవనం ఇక గడిచిన చరిత్రకు సాక్షిగా మిగిలిపోనుంది.

- Advertisement -

పాత పార్లమెంట్ భవన చరిత్ర ఇదే:
బ్రిటిష్ ఇండియాకు మొదట్లో కలకత్తా రాజధానిగా ఉండేది. 1911లో కేపిటల్‌ను కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. బ్రిటిష్ ప్రభుత్వం కోసం ‘న్యూ ఢిల్లీ’ని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి భవనం.. అప్పట్లో గవర్నర్ జనరల్ నివాసంగా ఉండేది. ఇప్పటి ఢిల్లీ అసెంబ్లీ భవనాన్ని.. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ సెక్రటేరియెట్‌గా వాడేవారు.

- Advertisement -

బ్రిటిష్ సంస్కరణల్లో భాగంగా 1918 తర్వాత చట్టసభల ప్రాధాన్యం, సభ్యుల సంఖ్య పెరిగింది. అప్పటి అవసరాల మేరకు.. 1921లో సెక్రటేరియెట్‌ బిల్డింగ్‌లోనే ఓ భారీ ఛాంబర్‌ కట్టారు. అదే సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ (దిగువ సభ). కొంతకాలం పాటు అందులో సభ నిర్వహించేవారు. ఆ తర్వాత ఎగువ, దిగువ చట్టసభల కోసం పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణం తలపెట్టారు.

న్యూ ఢిల్లీ రూపశిల్పుల్లో ఒకరైన ‘ల్యూటన్’.. వృత్తాకారంలో పార్లమెంట్ బిల్డింగ్ డిజైన్ తయారు చేశారు. 1921 ఫిబ్రవరి 12న, డ్యూక్‌ ఆఫ్‌ కానాట్‌ ప్రిన్స్‌ ఆర్థర్‌ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ఆరేళ్లు సమయం పట్టింది.

మొత్తం 6 ఎకరాల్లో.. చుట్టూ 27 అడుగుల ఎత్తుండే.. 144 పిల్లర్లతో.. చూడచక్కగా భవనాన్ని నిర్మించారు. ఆ అందమైన భవనం మధ్యలో సెంట్రల్‌ హాల్‌, దాని పక్కనే మూడు అర్ధవృత్తాకార ఛాంబర్లు.. చుట్టూ ఉద్యానవనం.. ఇలా ఆకట్టుకునేలా నిర్మించారు. ఈ బిల్డింగ్ డిజైన్‌కు మధ్యప్రదేశ్‌లోని చౌసత్‌ యోగిని దేవాలయ ఆకృతి స్ఫూర్తి అంటారు. 1927 జనవరి 19న భారత వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్ ఈ భవనాన్ని‌ ప్రారంభించారు.

సెంట్రల్‌ హాల్‌ చుట్టూ ఉండే ఒక ఛాంబర్‌లో సంస్థానాధీశుల సభ (ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌), ఇంకోదాంట్లో స్టేట్‌ కౌన్సిల్‌ (ఎగువ సభ), మూడో ఛాంబర్లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ (దిగువ సభ) నిర్వహించేవారు. ఈ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలోనే 1929లో పంజాబ్ సింహం భగత్‌సింగ్‌, ఆయన సహచరుడు బతుకేశ్వర్‌ దత్‌లు బాంబు విసిరి.. బ్రిటిష్ పాలకులను సవాల్ చేశారు.

బ్రిటిషర్ల కాలంలో చట్టసభగా కొనసాగిన ఈ భవనం.. స్వాతంత్రం తర్వాత అధికార మార్పిడికి వేదికైంది. మొదట్లో సుప్రీంకోర్, యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంటు కాంప్లెక్స్‌లోనే ఉండేది. 1956లో పాత పార్లమెంటులో మరో రెండు అంతస్థులు నిర్మించారు.

96 ఏళ్ల పాటు భారత చట్టసభలకు వేదికగా నిలిచిన ఈ పార్లమెంట్ భవనం.. ఇకపై చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోయింది. పక్కనే నయా భారత్‌కు నిదర్శనంగా.. 75 ఏళ్ల ప్రజాస్వామ్యానికి సాక్షిభూతంగా.. కొత్త అత్యాధునిక పార్లమెంట్ భవనం వజ్రాకారంలో కొలువుదీరింది. జయహో భారత్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News