EPAPER

Hathras Stampede Tragedy: హాథ్రస్ ఘటనలో గంట గంటకు పెరుగుతున్న మృతులు.. 121కి చేరిన సంఖ్య

Hathras Stampede Tragedy: హాథ్రస్ ఘటనలో గంట గంటకు పెరుగుతున్న మృతులు.. 121కి చేరిన సంఖ్య

Hathras Stampede Tragedy: ఉత్తరప్రదేశ్‌ హాథ్రస్ లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఈ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 116కి చేరింది. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.


ఈ ఘటనతో బోలే బాబా ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. బోలే బాబా గతంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైగా విధులు నిర్వహించే వారని తెలుసుకున్నారు. 2006లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత సూరజ్ పాల్ సింగ్‌ తన పేరును సూరజ్ పాల్ సింగ్‌ బోలేబాబాగా మార్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లా బహదూర్ నగర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్ తండ్రి ఓ రైతు.

సూరజ్ పాల్‌కు చిన్నప్పటి నుంచి ప్రబోధం అంటే ఆసక్తి ఉండేది. కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి తర్వాత ఎస్సైగా ప్రమోషన్ పొందాడు. 12 పోలీస్ స్టేషన్లతో పాటు, స్థానిక ఇంటిలిజెన్స్ యూనిట్‌లో కూడా పనిచేశారు. భోలే బాబా భక్తుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు ప్రముఖ నాయకులు కూడా ఉన్నారని విచారణలో గుర్తించారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం పరిశీలించాయి.


గత కొన్ని రోజులుగా హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నిన్నే చివరి రోజు. దీంతో బాబాను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రమాదాని ప్రధాన కారణం.. బాబా పాదాల దగ్గర మట్టిని సేకరించేందుకు భక్తుల ఎగబడ్డారు. దీంతో.. ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక చాలా మంది మృతి చెందారు. అయితే.. మొదట మృతుల సంఖ్య ఇంత పెద్ద మొత్తంలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. తొక్కిసలాట జరిగిన దగ్గర మృతదేహాలను వెలికితీస్తే పదుల సంఖ్యల వస్తూనే ఉన్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. కొంతమంది చికిత్స పొందుతూ మృతి చెందారు.

Also Read :యూపీలో తీవ్ర విషాదం.. 100 మందికి పైగా మృతి

మంగళవారం (జూలై 2) భోలే బాబా గంటన్నరపాటు ఈ కార్యక్రమం నిర్వహించాడు. ఆ తర్వాత బయలుదేరిన సమయంలో ఆయన పాదాలను తాకడానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. మైదానం చిత్తడిగా ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రౌండ్‌లో.. దానికి కెపాసిటీకి మించి భక్తులు వచ్చారు. భక్తులకు సరిపడా ఏర్పాట్లు కూడా లేవు. నిన్న సాయంత్రం మూడున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సత్సంగ్‌ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.

నిన్న లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నపుడే ఘటన గురించి తెలియడంతో ఆయన వెంటనే సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం తరుఫున 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండియా కూటమి శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గోవాలని రాహుల్‌ గాంధీ సూచించారు.

ప్రతీఏటా భోలే బాబా సత్సంగ్ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తాడు. గతంలో కూడా భోలే బాబా నిబంధనలను ఉల్లంఘించాడు. 50 మందితో సత్సంగ్ నిర్వహించేందుకు నామమాత్రపు అనుమతులు తీసుకుని.. 50 వేల మందితో నిర్వహించాడు. ఈసారి 80 వేల మందితో సత్సంగ్ నిర్వహించేందుకు అనుమతులు తీసుకోగా.. రెండున్నర లక్షల మందికి పైగా హాజరయ్యారు. తొక్కిసలాట జరిగి.. వచ్చినవారిలో అనేకమంది మరణిస్తుండగా.. ఆధారాలను అంతం చేసేందుకు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. సత్సంగ్ నిర్వాహకులలో ఐదుగురిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేశారు. కానీ.. వారిలో భోలేబాబా పేరులేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Related News

Army Use AI Jammu Kashmir: ఏఐ సాయంతో ఉగ్రవాదులు హతం.. అఖ్‌నూర్ ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందంటే?..

Railway Luggage Fine: ‘ఇక లగేజిపై ఫైన్ విధిస్తాం’.. రైల్వేశాఖ కీలక ప్రకటన

Actor Darshan Bail : కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్.. ఆపరేషన్ కోసం అనుమతించిన హైకోర్టు

India – China boarder issue : సరిహద్దులో చైనా స్నేహ హస్తం.. డ్రాగన్ కుయుక్తుల్ని నమ్మొచ్చా..?

NCB – Secret Meth Lab : దిల్లీలో డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుర్తింపు.. జైలు వార్డెనే అసలు సూత్రధారి

Threat To Abhinav Arora : పదేళ్ల పిల్లాడినీ వదలని లారెన్స్ బిష్ణోయ్.. ఇంతకీ ఆ బాలుడు చేసిన తప్పేంటీ?

Army Dog Phantom Dies: సైనికులను కాపాడి.. తన ప్రాణం విడిచింది.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ డాగ్ ఫాంటమ్ మరణం

×