Big Stories

Godra : గోద్రా రైలు దహనం కేసు.. దోషులకు బెయిల్‌ ఇవ్వొద్దు : గుజరాత్‌ ప్రభుత్వం

Godra : గోద్రా రైలు దహనం కేసులో దోషుల దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ కేసులో కొందరు దోషులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. వాళ్లు రాళ్లదాడికి పాల్పడటం వల్లే దగ్ధమవుతున్న కోచ్‌ నుంచి ప్రయాణికులు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ తరఫు న్యాయవాది తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు.

- Advertisement -

2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దుండగులు నిప్పుపెట్టారు. ఈ దుర్ఘటనలో ఎస్‌-6 బోగీలోని 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో కొందరు దోషులు తమకు బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే వారు 17-18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. దీంతో వారి పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

- Advertisement -

ఈ కేసులో దోషుల వ్యక్తిగత పాత్రపై వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. దోషుల రాళ్లదాడి వల్ల బోగీలోని ప్రయాణికులు బయటకు రాలేకపోయారని వివరించారు. మరోవైపు దోషుల బెయిల్‌ పిటిషన్లు 2017 అక్టోబర్‌లో గుజరాత్‌ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 11 మందికి విధించిన మరణ శిక్షను గుజరాత్‌ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని సుప్రీంకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. రైలు దహనంపై దోషుల వ్యక్తిగత పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News