Big Stories

Cheetah: 70 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై చీతాలు జననం.. ఎక్కడో తెలుసా..?

Cheetah : భారత్ గడ్డపై 7 దశాబ్దాల తర్వాత చీతాలు జన్మించాయి. మనదేశంలోని చివరి చీతా 1947లో ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో వేటకు బలైంది. దీంతో దేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం 1952లో అధికారికంగా ప్రకటించింది. అంతరించి పోయిన చీతాల సంతతిని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ చీతాను ప్రారంభించింది.

- Advertisement -

మొదటి విడతలో భాగంగా గతేడాది నమీబియా నుంచి భారత్‌కు ఎనిమిది చీతాలను తీసుకొచ్చారు. వాటిని ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని శ్యోపూర్‌ జిల్లాలోని కునో జాతీయ పార్కులోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. వీటిలో సాశా అనే ఆడ చీతా ఇటీవలే అనారోగ్యంతో మృత్యువాత పడింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో అది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన ఏడు చీతాలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని తెలిపారు. సాశా మృతి చెందిన రెండు రోజుల్లోనే మరో చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌ గడ్డపై చీతాలు జన్మించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.

- Advertisement -

చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘ శుభాకాంక్షలు, వన్యప్రాణుల సంరక్షణలో చారిత్రాత్మకమైన క్షణం. గతేడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది’’ అని వీడియో, ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు.

రెండో విడతలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు తీసుకొచ్చారు. ఆ చీతాలు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఆరోగ్యంగా ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. భారత్‌లో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించింది. తాజాగా జన్మించిన నాలుగు పిల్లలతో కలిపి భారత్ లో చీతాల సంఖ్య 23 కు చేరింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News