EPAPER

Farmers protest: అన్నదాతల పోరు.. అందరిదీ కావాలి..!

Farmers protest: అన్నదాతల పోరు.. అందరిదీ కావాలి..!
Farmers protest highlights

‘Delhi Chalo’ Farmers protest highlights: వేడుకుంటున్న గొంతుకలకు ఉరి వేసే ప్రయత్నాలు నిరాటకంగా సాగుతున్న వేళ కోటి కంఠాలు ఒక్కటై నినదిస్తున్నాయి. ఆదుకోమని చాచిన చేతులకు సంకెళ్లు బిగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. అమాయక రైతుల భవిష్యత్తుకు మరణ శాసనం రాసే కార్పొరేట్ కుటిల చట్టాలకు వ్యతిరేకంగా ప్రశ్నల సవాళ్లు ముంచెత్తుతున్నాయి. పచ్చని నేలను కాంక్రీటు మయం చేసి కోట్లు వెనకేసుకోవాలనే బడాబాబులకు వత్తాసు పలుకుతున్న నిరంకుశ పాలకుల మీద యుద్ధం ప్రకటిస్తూ దేశ రాజధాని శివారు ఊగిపోతోంది. తమ కోసం సొంతూరు వదిలి పోరుబాట పట్టిన రైతుల గొంతుక నేడు దేశం నలుమూలలా కొత్త పోరాటాలకు ఊపిరి పోస్తోంది. ఇది కేవలం కర్షకుల సమస్య మాత్రమే కాదు.. అన్నం తినే ప్రతి వాడి సమస్య అనే భావన దేశంలో వేగంగా విస్తరిస్తోంది. బీదవాడి అన్నం గిన్నెలోని మెతుకు మీద కూడా పెత్తనం చేసేందుకు వేగంగా అడుగులేస్తున్న నిరంకుశ కేంద్ర పాలకుల దమననీతిని ఎండగడుతూ కలాలు గళాలు విప్పుతున్నాయి. మొత్తంగా సామాన్యుడైన రైతు చేస్తున్న అసమాన పోరాటం పక్కనపెట్టలేని సమస్య అని కేంద్రం అంగీకరించాల్సి వచ్చింది.


‘భారతదేశపు ఆత్మ గ్రామసీమల్లో, మన రైతు దగ్గర ఉంది’ అన్న గాంధీ మహాత్ముడికి ఈ దేశం గురించి ఎంత గొప్ప అవగాహన ఉందో తెలియజేస్తాయి. కానీ.. నేటి కేంద్ర పాలకులు మాత్రం కోట్లాది మన రైతుల జీవితాలను విదేశీ కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ప్రయత్నంలో తొలిమెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయం పేరిట దేశంలో, ఏ భూముల్లో ఏ పంట, ఏ విధంగా పండించాలి? ఎవరికి, ఏ రేటుకు అమ్ముకోవాలో నిర్దేశిస్తూ స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే చట్టాలతో 2022లో దేశం ముందుకు వచ్చారు. కానీ.. ఢిల్లీ కేంద్రంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతుల పోరాటంతో మోదీ సర్కారు వాటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కానీ… గతంలో ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీల గురించి గత పార్లమెంటు సమావేశాల్లోనైనా ప్రకటన వస్తుందని ఆశించిన రైతాంగానికి భంగపాటు ఎదురుకావటంతో వారు మరోమారు దేశ రాజధాని శివారులో పోరాటాన్ని ప్రారంభించారు. పంజాబ్, హర్యానా నుంచి తరలివచ్చిన రైతులు ఆరు నెలలకు సరిపడా ఏర్పాట్లతో గుడారాలు వేసుకుని కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

కొత్త వ్యవసాయ చట్టాలను గతంలో ఉపసంహరించుకుని, రైతాంగానికి క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ ప్రభుత్వం నాడు రైతాంగానికి కొన్ని హామీలిచ్చింది. అవి.. ఎమ్.ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన కనీస మద్దతు ధర అమలు, సమ్మె సంబంధిత కేసులు ఉపసంహరణ, సమ్మెలో మరణించిన 600 కుటుంబాలకు పరిహారం, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ బిల్లులను తగ్గింపు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పని కల్పించాలి, రోజువారీ వేతనం రూ. 700కు పెంపు, లఖిమ్ పూరి ఖేరి ఘటన బాధ్యలను శిక్షించటం, WTOతో చేసుకున్న ఒప్పందాలను నిషేధించటం, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ అంశాన్ని పరిశీలించటం, విద్యుత్ సవరణ బిల్లు 2020ను ఉపసంహరించుకోవటం, నకిలీ విత్తనాలు, పురుగు మందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవటం, మిర్చి, పసుపు వంటి సుగంధ పంటల జాతీయ కమిషన్ ఏర్పాటు, ఆదివాసుల హక్కులను, అటవీ భూములకు రక్షణ వంటి అంశాలున్నాయి.


ఈ డిమాండ్ల గురించి ఒకవైపు రైతులతో చర్చలు జరుపుతూ కాలం వెళ్లదీస్తోన్న కేంద్ర మంత్రుల కమిటీ నిర్దిష్టమైన హామీలు మాత్రం ఇవ్వటం లేదు. ఇదిలా జరుగుతుండగానే మరో కొత్త నాటకానికి కేంద్రం తెరలేపింది. రైతుల పోరాటాన్ని చల్లబరిచేందుకు రైతు ప్రధానిగా పేరుగాంచిన చౌధరి చరణ్ సింగ్, హరిత విప్లవాన్ని తెచ్చి దేశంలో ఆహారధాన్యాల కొరత తీర్చిన గొప్ప శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్‌లకు ‘భారత్ రత్న’ లను మోదీ సర్కారు ప్రకటించింది. ఇందులోనూ రాజకీయ లాభాన్నే కేంద్రం ఆశిస్తోందని.. ఇండియా కూటమిలో ఉన్న చరణ్ సింగ్ మనుమడు జయంత్ చౌధురి ఎన్డీయేలో చేరుతున్నట్లు చేసిన ప్రకటన నిర్ధారించింది. దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందిస్తున్నామని చెబుతున్న ప్రధాని మోదీ.. ఆ పంట పండించే రైతుల విషయంలో మాత్రం నిర్దయగా వ్యవహరించటం దేశాన్ని నివ్వెర పరుస్తోంది.

భారత్‌ను 5 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థగా, ప్రపంచపు మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుస్తామని చెబుతున్న కేంద్రం పదేపదే ‘సబ్ కా సాత్… సబ్ కా వికాస్’ అనే మాటను వల్లె వేస్తోంది గానీ.. ఆ సబ్(అందరిలో) రైతులు ఉన్నారని మరచిపోతోంది. గత 9 ఏళ్లలో 2 లక్షల మంది రైతులు చనిపోయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే.. సగటున రోజుకు 30 మంది రైతులు కన్నుమూశారని తెలుస్తోంది. ఇక.. కేంద్రం 23 పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తుండగా, వాటిల్లో కేవలం బియ్యం, గోధుమలకే నియంత్రిత మార్కెట్లు ఉన్నాయి. పత్తి, చెరకు, పప్పుధాన్యాల మార్కెట్ల నియంత్రణ మాత్రం కొంతమేరకు రాష్ట్రాల ప్రభావంలో ఉంది. దేశం మొత్తం మీద కేవలం 15% మంది రైతులకే మద్దతు ధర లభిస్తోందని స్వయంగా ప్రభుత్వమే ఇటీవల లోక్‌సభలో ప్రకటించింది. అంటే 86% మంది రైతులు మార్కెట్ దయాదాక్షిణ్యాలపై, దళారుల కనికరం మీద ఆధారపడి ఉన్నారని తెలుస్తోంది.

రైతులు డిమాండ్ చేస్తు్న్నట్లు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అనుసరించి మద్దతు ధర ప్రకటిస్తే.. అది రైతుల ఆదాయాన్ని పెంచటమే గాక.. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థకూ ఉత్తేజాన్ని కలిగిస్తుంది. జనాభాలో కేవలం 3 % ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను 7వ వేతన సంఘం గణనీయంగా పెంచితే.. వారి కొనుగోలు శక్తి పెరిగి దేశం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోందని గతంలో కేంద్రం ఊదరగొట్టింది. మరి.. రైతులు ఇంతగా ప్రాధేయపడుతున్నా.. ఇన్నికోట్ల రైతుల ఆదాయాన్ని పెంచే చిన్న నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేకపోతోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది.

ఇంత దమన నీతిని కేంద్రం ప్రదర్శిస్తున్నా.. రైతులు మాత్రం శాంతియుతంగానే పోరాడుతున్నారు. ప్రభుత్వం మాత్రం రాజధాని, దాని శివారు ప్రాంతాల్లో 144వ సెక్షన్ ప్రకటించటం, ఇంటర్నెట్ సేవలను రద్దు చేయటం, రహదారులపైన ముళ్ల కంచెలు, కాంక్రీట్ బ్లాకుల బారికేడ్‌లు పెట్టి రైతులను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి.. డ్రోన్‌ల సాయంతో టియర్ గ్యాస్ షేల్స్ వేసే ప్రయోగాలూ చేస్తోంది. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే మనదేశం.. పోరుబాట పట్టిన రైతుల డిమాండ్లను సానుభూతితో పరిశీలించటానికి బదులు.. వారిని దేశద్రోహులుగా, తీవ్రవాదుల మద్దతుదారులుగా, విపక్షానికి లబ్ది చేకూర్చే ప్రయత్నంగా చిత్రీకరించటం బాధ్యతా రాహిత్యం గాక మరొకటి కాదు. 144 కోట్ల జనాభాలో 60 కోట్ల మంది రైతులు దుర్భర జీవనం సాగిస్తుంటే మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటే మాత్రం కలిగే ప్రయోజనం ఏముంది? అనేదే ఈరోజు మనముందు ఉన్న కీలక ప్రశ్న.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×