Delhi air Pollution: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్ మోగిస్తోంది. వాయుకాలుష్యంతోపాటు, పొగమంచు కూడా కమ్మేయడంతో అక్కడ గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 431కి పడిపోయింది. కాలుష్యం వల్ల గాలి నాణ్యత క్షీణిస్తోంది. పీల్చే గాలిలో నాణ్యత లేకపోవడం వల్ల శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు అక్కడి ప్రజలు.కాలుష్యం కంట్రోల్ చేసేందుకు యాంటీ స్మోక్ గన్ వాహనాలను ప్రారంభించారు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్.
శీతాకాలం మంచుపొగతో పాటు పొల్యూషన్ ఎయిర్ గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఢిల్లీ వాసులు పీల్చే గాలి కూడా ఆయువు తీసే రేంజ్ కు చేరింది. దీంతో ఢిల్లీలో బతకడం.. ప్రాణాలతో చెలగాటంలా మారుతోంది. దీపావళి పండగ దీనికి మరింత ఆజ్యం పోసింది. పండగ రోజు పేల్చిన పటాకులతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 293గా నమోదు అయింది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వాహనాలు చొప్పున సుమారు 200 వాహనాలు వినియోగించేందుకు సిద్ధమైంది ఢిల్లీ ప్రభుత్వం.ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించడం లేదంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ కాలుష్యానికి తోడు పక్క రాష్ట్రాలైన హరియాణ, పంజాబ్‌లో పంట వ్యర్ధాలు తగలబెట్టడమే ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడానికి కారణమని..సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆరోపిస్తోంది.
Also Read: దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని ముంచేసిన పొగమంచు..!
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 700 దాటింది. కొన్ని ప్రాంతాల్లో ఇది 500 దాటింది. ఢిల్లీలో సగటు AQI 556గా నమోదైంది. కాగా, ఆనంద్ విహార్‌లో 714, డిఫెన్స్ కాలనీలో 631, పట్‌పర్‌గంజ్‌లో 513 ఏక్యూఐ నమోదైంది. ఈ గాలి వల్ల ఢిల్లీ వాసులు ప్రాణాల మీద భయం ఏర్పడింది. ఈ గాలి శ్వాసకోశ వ్యవస్థలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది పలు రకాల అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు, శ్వాస కోస సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దాంతో, ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఢిల్లీ ప్రజలు.
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఢిల్లీలో బాణసంచా తయారీ, విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు, డెలివరీలకు ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. అయినప్పటికీ, కొందరు ఈ ఆంక్షలను ఖాతరు చేయలేదు. ఇప్పటికే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోగా… తాజాగా దీపావళి బాణసంచాతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.