EPAPER

Chiblu Idlis : చిబ్లు ఇడ్లీ.. తింటే ఎంతో మజా

Chiblu Idlis : చిబ్లు ఇడ్లీ.. తింటే ఎంతో మజా
Chiblu Idlis

Chiblu Idlis : దక్షిణాది వారికి ప్రియమైన ఫలాహారం ఇడ్లీ. ఇందులో బోలెడన్ని రకాలు. రైస్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, రాగి ఇడ్లీ, పొడి ఇడ్లీ, తట్టె ఇడ్లీ, మినీ ఇడ్లీ, బటన్ ఇడ్లీ, మల్లిగె ఇడ్లీ.. చెప్పుకుంటూపోతే రుచులకు అంతే ఉండదు. కొబ్బరి లేదా పల్లీ చట్నీ, కాస్తంత వెన్న వాటికి జోడిస్తే ఓ పట్టు పట్టేయరూ! ఇవన్నీ ఒకెత్తు అయితే చిబ్లు ఇడ్లీ మరో ఎత్తు.


దీని కోసం కర్ణాటక మాండ్య జిల్లాలోని హలగురు గ్రామానికి వెళ్లాల్సిందే. విజయవాడలో బాబాయ్ హోటల్ ఎంత ప్రత్యేకమో.. హలగురులోని బాబు హోటల్ కూడా అంతే. టిఫిన్ కోసం ఆ హోటల్‌కు రోజూ 500 మంది వస్తుంటారు. చిబ్లు ఇడ్లీల కోసం మరీను. వారాంతంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది.

70 ఏళ్లుగా ఆ ప్రత్యేకమైన ఇడ్లీని బాబు హోటల్ అందిస్తూ వస్తోందని యజమాని భక్తవత్సల తెలిపారు. ఆయన తాత శివన్న 1950లలో ఆ హోటల్‌ను ప్రారంభించారు. వ్యవసాయానికి తోడు ఎంతో కొంత ఆదాయం వస్తుందనే ఆలోచనతో చిన్నగా హోటల్ వ్యాపారం కూడా చేపట్టారాయన. శివన్న తదనంతరం హోటల్ బాగోగులను తన తండ్రి, ఆపై తాను చూశామని వివరించారు వత్సల.


సోషియాలజీలో గ్రాడ్యుయేట్ అయిన 45 ఏళ్ల వత్సల.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పరిమితుల కారణంగా చదువు విషయంలో పెద్ద పెద్ద కోరికలు ఏవీ పెట్టుకోలేదు. బుద్ధిగా ఎన్నో ఏళ్లుగా కుటుంబం అనుసరించిన హోటల్ వ్యాపారంలోకే దిగారు.

సాధారణంగా ఇడ్లీలను ఆవిరిలో ఉడికించేందుకు వివిధ పాత్రలను వినియోగిస్తాం. దీనికి భిన్నంగా వత్సల కుటుంబం ఇడ్లీలను చిన్నపాటి వెదురుబొంగు బాస్కెట్లలో ఉడికిస్తుంది. ఈ వెదురు బాస్కెట్లను కన్నడ భాషలో ‘చిబ్లు’గా వ్యవహరిస్తారు.

తమ గ్రామంలో వెదురుకు కొదవలేదని వత్సల తెలిపారు. వెదురుతో తయారు చేసిన వస్తువులు, ఎన్నో పాత్రలను ఆ పరిసరాల్లో విక్రయిస్తుంటారు. ఈ కారణంగానే తమ పూర్వీకులు ఇడ్లీలను వెదురు పాత్రల్లో తయారు చేసి ఉండొచ్చని వత్సల వివరించారు.

బౌల్‌షేప్‌లో వెదురుతో చేసిన చిన్నపాటి మౌల్డ్స్‌లో ఇడ్లీ పిండి వేస్తారు. ఈ బాంబూ బౌల్స్‌ను వెదురు ముక్కల సాయంతో అల్యూమినియం పాత్రలో ఉడికిస్తారు. 2 అడుగుల వ్యాసం ఉండే ఈ పాత్రల్లో ఒకేసారి 80 ఇడ్లీలను తయారు చేయొచ్చని వత్సల వెల్లడించారు.

వెదురు పాత్రల్లో వండటం వల్ల ఇడ్లీలకు ఇతర పద్ధతుల్లో పోల్చిచూసినప్పుడు అమితమైన రుచి లభిస్తుందని వత్సల తెలిపారు. బాబు హోటల్ ఇడ్లీలకు విపరీతమైన డిమాండ్ రావడంతో.. ఆ పరిసరాల్లోనూ చిన్న చిన్న హోటళ్లు అనేకం వెలిశాయని చెప్పారు. తమ హోటల్‌లో ఇడ్లీలు ఆరగించిన వేలాది మందిలో ప్రముఖ యూట్యూబర్లు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు, సినీతారలు ఎందరో ఉన్నారన్నారు.

చిబ్లూ ఇడ్లీ ధర ఒక్కొక్కటి రూ.10. ఘుమఘుమలాడే నెయ్యి, పల్యా చట్నీ కూడా అందిస్తారు. బాబు హోటల్‌లో పలు ఇడ్లీ రకాలతో పాటు దోశెలు కూడా లభిస్తాయి. తమ హోటల్ వ్యాపారం ఇంతలా సక్సెస్ కావడానికి కారణం కఠోరశ్రమ, అంకితభావం, చిత్తశుద్ధే కారణాలని వత్సల చెప్పారు.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×