Sonia Gandhi: ఛాన్స్ దొరికితే చాలు బీజేపీ చెలరేగిపోతోంది. కర్నాటక ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. బజరంగ్ దళ్‌పై నిషేధ వివాదాన్ని ఎంతగా రాజకీయం చేసిందో చూశాం. ఇప్పుడు నేరుగా సోనియాగాంధీనే టార్గెట్ చేశారు కమలనాథులు. అందుకు, ఆమె చేసిన కాంట్రవర్సీ ట్వీటే కారణం. కీలకమైన సమయంలో సోనియా కావాలనే అన్నారో తెలీదు కానీ.. బీజేపీ మాత్రం సోనియా ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకుంది. ఈసీకి ఫిర్యాదు చేసింది.
కర్నాటక ప్రతిష్ట, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాంగ్రెస్ చూస్తుంది.. ఇందుకు భంగం కలిగించే వారిని ఎవరిని అనుమతించబోము.. అంటూ సోనియా పేరుతో ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది.
సార్వభౌమత్వం.. అనే పదంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బీజేపీ. సార్వభౌమత్వం అనేది భారత దేశానికి మాత్రమే ఉంటుంది. రాష్ట్రాలకు ఉండదు. మరి, సోనియా ఆ వ్యాఖ్యలు ఎలా చేసినట్టు? కర్నాటకను కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రాంతం/దేశంగా పరిగణిస్తోందా? ఇది రాజ్యాంగ విరుద్ధం.. ఎన్నికల సంఘం నియమనిబంధనలకు వ్యతిరేకం. ఇది విభజన, విచ్చిన్నకర రాజకీయం. తక్షణమే ఈ వ్యాఖ్యలు చేసిన సోనియాపై చర్యలు తీసుకోవాలంటూ విరుచుకుపడుతోంది బీజేపీ.
సోనియా గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఆరోపించింది. సార్వభౌమత్వం అన్న పదాన్ని వాడడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ మేరకు ఈసీకి లేఖ రాసింది. సోనియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. కాంగ్రెస్ పార్టీ అనుమతి రద్దు చేయాలంటూ.. ఈసీని డిమాండ్ చేసింది బీజేపీ.