Bengaluru Man Dies: ఒకే ఒక్క ఛాలెంజ్ తన జీవితాన్ని మారుస్తుందనుకున్నాడు. ఏదైనా సరే ఛాలెంజ్ లో నెగ్గాలని అనుకున్నాడు. చివరికి ఛాలెంజ్ పుణ్యమా అంటూ ప్రాణాలు వదిలాడు ఓ వ్యక్తి. సరదాలను ఛాలెంజ్ గా తీసుకుంటే.. జీవితాలు బుగ్గి పాలేనంటారు పెద్దలు. సేమ్ టు సేమ్ అటువంటి ఘటనే ఇది. తన ఫ్రెండ్ సరదాగా ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించిన ఆ కుర్రాడు, లోకానికే దూరమయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, ఇంతకు ఆ ఛాలెంజ్ ఏమిటి? ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.
దీపావళి అంటేనే ఆరోజు సాయంత్రం క్రాకర్స్ మోత మోగాల్సిందే. లేకుంటే పండుగ సందడి అస్సలు కనిపించదు మనకు. అందుకే ఆరోజు ప్రధానంగా యువత క్రాకర్స్ కాలుస్తూ చేసే సందడి అంతా ఇంతా కాదు. అలాగే బెంగుళూరు లోని కోననకుంటెలో కూడా దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకున్నారు. ఇక్కడే కొందరు యువకులు గుమికూడి, ఛాలెంజ్ లు విసురుకోవడం మొదలు పెట్టారు.
సరదాగా ఛాలెంజ్ లు విసురుకుంటున్న వీరిలో 32 ఏళ్ల శబరీశక్కు కూడా ఉన్నాడు. అక్కడ అతని ఫ్రెండ్స్ ఓ ఛాలెంజ్ విసిరారు. అదేమిటంటే టపాసుపై కూర్చుంటే, తాము పేలుస్తామని, కదలకుండా కూర్చుంటే ఆటో కొనిస్తామని హామీ ఇచ్చారు అతడికి. ఇక తనకు ఆటో వస్తుందనుకున్న శబరీశక్కు, ఏమాత్రం ఆలోచించకుండా టపాసుపై కూర్చున్నాడు. టపాసును కాల్చారు ఫ్రెండ్స్.. ఇక అంతే ఢమాల్ అంటూ శబ్దం.. ఒక్కసారిగా ఎగిరి బలంగా కిందపడ్డాడు శబరీశక్కు. చివరకు అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
చివరకు ఆటో తన ఉపాధికి ఉపయోగపడుతుందని భావించిన సదరు యువకుడు, ఛాలెంజ్ స్వీకరించి కానరాని లోకాలకు వెళ్లాడు. తన కుటుంబానికి తీరని శోకం మిగిల్చాడు. దీపావళి పండుగ రోజు ఆనందంగా ఉండాల్సిన ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సరదాగా మనం చేసే కొన్ని పనులు విషాదాలను నింపుతాయని, అందుకే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు పెద్దలు.